పోలీసులతో వాగ్వాదం చేస్తున్న డైరెక్టర్ పీపీ మధుసూదన్‌రెడ్డి
నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ గిరీ కోసం ‘భూమా’ దండోపాయాలు
సొసైటీ సభ్యత్వం ఉంటేనే అది సాధ్యం
కానీ, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తమ్ముడు భూమా విఖ్యాత్‌రెడ్డి రూ.1.20 కోట్లు బాకీ
ఇది చెల్లించకపోవడంతో చక్రవర్తులపల్లె పాల సొసైటీలో అతని సభ్యత్వం రద్దు
దీంతో అడ్డదారుల్లో ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండానే అధ్యక్షుడిగా ఎన్నిక
దీనికి వివరణ ఇవ్వాల్సిందిగా సొసైటీ సభ్యులకు త్రీమెన్ కమిటీ నోటీసులు
వీరిని దారిలోకి తెచ్చుకునేందుకు బెండోవర్ అస్త్రం
నోటీసులు ఇవ్వకుండా బైండోవర్ ఎలా చేస్తారని నిలదీసిన డైరెక్టర్లు
మంత్రి లోకేశ్‌ను విఖ్యాత్‌రెడ్డి కలవగానే మారిన సీన్
నంద్యాల: నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసు బలగాలతో డెయిరీ ఎన్నికలు సవ్యంగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాత్‌రెడ్డికి కట్టబెట్టేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్‌రెడ్డి ఎన్నిక చెల్లదని.. దానికి వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా.. డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్‌రెడ్డి, ఎండీ ప్రదీప్‌కుమార్‌లను బైండోవర్ చేసేందుకు నంద్యాలకు చెందిన ముగ్గురు సీఐలు, ఎస్‌ఐలు, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నుంచే విజయ డెయిరీ వద్ద మోహరించారు.
రవికాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీసుస్టేషన్‌లో ఉంచారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లతో పాటు ఎండీని బైండోవర్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే, నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌కు రమ్మంటే ఎలా వస్తామని వీరు ప్రశ్నించగా.. రావాల్సిదేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో.. డెయిరీ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, మధుసూదన్‌రెడ్డి తాను అయ్యప్ప మాల వేసుకున్నందున పూజకు వెళ్లాలని చెప్పి వెళ్లారు. సాయంత్రం డెయిరీ ఎండీ ఇతర డైరెక్టర్లపై బైండోవర్ కేసులు పెట్టి తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచారు.
త్రిసభ్య కమిటీ ముందు హాజరుకాకుండా హైడ్రామా..
బమరోవైపు.. భూమా విఖ్యాత్‌రెడ్డి విజయ డెయిరీకి రూ.1.20 కోట్లు అప్పు ఉన్నారు. ఆ అప్పు చెల్లించకపోవడంతో అతని సభ్యత్వాన్ని రద్దుచేశారు. దీంతో.. పాల సొసైటీ అధ్యక్షుడు కాకపోతే చైర్మన్ కావడం సాధ్యంకాదని భావించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం లేకుండానే అధ్యక్షుడిగా విఖ్యాత్‌రెడ్డి ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. అయితే, విఖ్యాత్ అప్పు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ప్రకటించామని, అతని సభ్యత్వం కూడా రద్దుచేశామని.. మీరెలా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వాలని కమిటీ సభ్యులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఈ కమిటీలో డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్‌రెడ్డిలు ఉన్నారు. కానీ, విఖ్యాత్‌రెడ్డి వివరణ ఇవ్వలేదు. ఈనెల 10న వివరణ ఇవ్వాల్సి ఉండగా కమిటీ సభ్యులపైనే బైండోవర్ కేసులు నమోదుచేయడం చర్చనీయాంశమైంది.
నిబంధనల ప్రకారం డైరెక్టర్‌గా వస్తే స్వాగతిస్తాం..
భూమా విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్ అయ్యాడు. ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండా అధ్యక్షుడు కావడం నిబంధనలకు విరుద్ధం. ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఎంపికపై సమాధానం ఇవ్వాలంటూ సభ్యులకు మూడుసార్లు నోటీసులిచ్చాం. ఈనెల 10న వివరణ ఇచ్చేందుకు మరోమారు అవకాశవిుచ్చాం. కానీ, మాపై బైండోవర్ కేసులు అంటూ పోలీసులు హడావుడి చేయడమేమిటి? నోటీసులిచ్చి ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లొచ్చు. అక్రమంగా ఎండీ ప్రదీప్‌కుమార్‌పై బైండోవర్ కేసు పెట్టడం దుర్మార్గం. కమిటీ రిపోర్టును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మాకు రాజకీయ ఉద్దేశాల్లేవు. రైతుల సంక్షేమమే ముఖ్యం.
– డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, విజయసింహారెడ్డి
లోకేశ్‌ను కలిసిన వెంటనే సీన్ మారింది..
ఇక ఈనెల 6న భూమా విఖ్యాత్‌రెడ్డి మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో డెయిరీ రాజకీ యం పూర్తిగా మారిపోయింది. త్రిసభ్య కమిటీ సభ్యులు, డెయిరీ ఎండీపై ఆ మర్నాడే బైండోవర్ కేసు పెట్టారంటే టీడీపీ అధిష్టానం నుండే పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు ఇక్కడ చర్చ జరుగుతోంది.


