టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు వేధిస్తే చూస్తూ ఊరుకోం
● మైక్రోఫైనాన్స్ వేధింపులతోనే
వైఎస్సార్‌సీపీ కార్యకర్త బలవన్మరణం
● మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరు: మైక్రోఫైనాన్స్ వేధింపులతోనే వైఎస్సార్‌సీపీ కార్యకర్త కార్పెంటర్ రమణ బలవన్మరణానికి పాల్పడ్డారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంగళ్‌రెడ్డి నగర్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రమణ మృతదేహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరుల సమావేశంలో శిల్పా మాట్లాడారు. కార్పెంటర్ రమణ అల్లుడు గంగాధర్ మైక్రోఫైనాన్స్‌లో పనిచేస్తుండటంతో పలువురు అతడిని నమ్మి ఫైనాన్స్‌కు ఇవ్వాలని డబ్బులు చెల్లించారన్నారు. అయితే గంగాధర్ తమకు డబ్బులు చెల్లించడం లేదని మామ కార్పెంటర్ రమణను బెదిరించారన్నారు. తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేయడమేగాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. మైక్రోఫైనాన్స్ పేరుతో ఆత్మకూరు ప్రాంతంలో చాలామంది తిరుగుతున్నారని, ఇందులో రాజమండ్రి, వెస్ట్ గోదావరి ప్రాంతాల నుంచి వచ్చినవారు ఉన్నారని శిల్పా తెలిపారు. ఆత్మకూరు ప్రాంతంలో ఆస్తులు తనఖా పెట్టుకుని రూ.100కు రూ.10, రూ.20 చొప్పున అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారన్నారు.
చంపుతామని బెదిరింపులు
తన అల్లుడు గంగాధర్ ఈ మైక్రోఫైనాన్స్‌లో పనిచేస్తున్న విషయం కార్పెంటర్ రమణ కూడా తెలియదని శిల్పా అన్నారు. అల్లుడు బదులు రమణ డబ్బులు చెల్లించాలని, లేకపోతే చంపుతామని బెదిరించారన్నారు. ఈ విషయమై డీఐజీతో మాట్లాడామన్నారు. దీంతో ఆత్మకూరు డీఎస్పీతో డీఐజీ మాట్లాడి రమణపై బలవంతం చేయవద్దని చెప్పారన్నారు. అయినా కూడా డీఎస్పీ, పోలీసులు వేధించడం మానుకోకపోవడంతో పాటు రమణను పిలిపించి మందలించారన్నారు.
ప్రజలే తరిమికొట్టాలి
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన హరివెంకటకృష్ణారెడ్డి అనే వ్యక్తి తీవ్ర ఒత్తిళ్లు చేసి, టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు, పోలీసుల చేత ఒత్తిళ్లు చేయించడంతో కార్పెంటర్ రమణ ఆత్మహత్య చేసుకున్నాడని శిల్పా తెలిపారు. పోలీసులు, మైక్రోఫైనాన్స్ వారు రమణ కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేస్తే తాము సహించబోమని శిల్పా అన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో తాము పెద్ద ఎత్తున ఆందోళన చేయడమేగాక కేసులకు కూడా వెనుకాడబోమన్నారు. మైక్రోఫైనాన్స్ వారిని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మైక్రోఫైనాన్స్‌వ వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఫైనాన్స్ వారి చేతిలో ఏ ఒక్కరూ కూడా మృతిచెందరాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రూ.25 లక్షలు ఆర్థిక సాయం అందించాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. శిల్పా వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.


