చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
● ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలకు చట్టపరధిలో న్యాయం చేస్తామని ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఎస్పీ సునీల్ షెరాన్ వినతులు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పీజేఆర్‌ఎస్‌లో 88 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని....
● తనకు నంద్యాల పట్టణంలోని నందమూరినగర్‌లో అధికారులు మూడు సెంట్ల స్థలం మంజూరు చేశారని, ఈ స్థలాన్ని మహబూబ్ బాషా అనే వ్యక్తి ఆక్రమించుకొని దౌర్జన్యంగా రేకులు వేశారని షేక్‌వహీదాబీ ఫిర్యాదు చేశారు.
● తన వద్ద తొమ్మిది పొట్టేలను తీసుకుని డబ్బులు అడిగితే ఇవ్వకుండా గడివేముల మండలం గడిగరేవుల గ్రామానికి చెందిన పసులరాజు బెదిరిస్తున్నాడని, న్యాయం చేయాలని పాణ్యం మండలం కొండజూటూరు గ్రామానికి చెందిన ఓబులేసు కోరారు.
పలువురు వైద్యులకు పదోన్నతి
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పనిచేసే పలువురు అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు వారికి పదోన్నతిపై బదిలీ స్థానాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో పనిచేస్తున్న డాక్టర్ కె.వెంకటేవ్వర్లు(బయోకెమిస్ట్రీ) కర్నూలుకు, అనంతపురంలో పనిచేస్తున్న డాక్టర్ పీవీ శ్రీనివాసకుమార్(కమ్యూనిటి మెడిసిన్) కర్నూలకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ జె.విజయలక్ష్మి(మైక్రోబయాలజి) మచిలీపట్నంకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ జి.రాధిక, డాక్టర్ ఆర్.ఎలిజబెత్‌రాణి(ఫిజియాలజి) అక్కడే పోస్టింగ్ లభించింది. కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ పీఎస్ అరుణలత(అనెస్తీషియా)కు విజయవాడ ఎంఎంసీకి, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ పి.హరికృష్ణకు కర్నూలులోనే, తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజిలో పనిచేస్తున్న డాక్టర్ ఒ.శ్రీధర్(రేడియో డయాగ్నోసిస్)కు కర్నూలుకు, కర్నూలులో పనిచేస్తున్న డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి(రేడియేషన్ ఆంకాలజి), అనంతపురంలో పనిచేస్తున్న డాక్టర్ జె.ప్రశాంతి(రేడియేషన్ ఆంకాలజిలకు కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు బదిలీ అయ్యారు.
బార్ ఏర్పాటుకు రీ నోటిఫికేషన్
కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాల్టీ పరిధిలో బార్ ఏర్పాటుకు కలెక్టర్ అనుమతితో ఎకై ్సజ్ జిల్లా అధికారి సుధీర్ బాబు రీ–నోటిఫికేషన్ జారీ చేశారు. రెండు విడతలుగా నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ బార్ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో మూడోసారి బార్ ఏర్పాటుకు లైసెన్స్ జారీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సుధీర్ బాబు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ.5 లక్షలు తిరిగి చెల్లించని రుసుంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. కనిష్టంగా నాలుగు దరఖాస్తులు వస్తేనే 4వ తేదీ కలెక్టర్ సమక్షంలో లాటరీ నిర్వహించి లైసెన్స్ దారున్ని ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఈఎస్ సుధీర్ బాబు పేర్కొన్నారు.


