breaking news
bhuma Vikhyat reddy
-
బెదిరించి.. భయపెట్టి..
నంద్యాల: నంద్యాల విజయ డెయిరీ చైర్మన్ పదవి కోసం టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. చట్టానికి విరుద్ధంగా పోలీసు బలగాలతో డెయిరీ ఎన్నికలు సవ్యంగా జరగకుండా కుట్రలు పన్నుతున్నారు. చైర్మన్ పదవిని తన తమ్ముడు భూమా విఖ్యాత్‌రెడ్డికి కట్టబెట్టేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దండోపాయాలు ఉపయోగిస్తున్నారు. చాగలమర్రి మండలం చక్రవర్తులపల్లె గ్రామ పాల సొసైటీ అధ్యక్షుడిగా భూమా విఖ్యాత్‌రెడ్డి ఎన్నిక చెల్లదని.. దానికి వివరణ ఇవ్వాలని నోటీసులిచ్చిన త్రిసభ్య కమిటీ సభ్యులను టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా.. డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్‌రెడ్డి, ఎండీ ప్రదీప్‌కుమార్‌లను బైండోవర్ చేసేందుకు నంద్యాలకు చెందిన ముగ్గురు సీఐలు, ఎస్ఐలు, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం నుంచే విజయ డెయిరీ వద్ద మోహరించారు. రవికాంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని తాలూకా పోలీసుస్టేషన్లో ఉంచారు. మిగిలిన ఇద్దరు డైరెక్టర్లతో పాటు ఎండీని బైండోవర్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే, నోటీసులు ఇవ్వకుండా స్టేషన్‌కు రమ్మంటే ఎలా వస్తామని వీరు ప్రశ్నించగా.. రావాల్సిదేనని పోలీసులు పట్టుబట్టారు. దీంతో.. డెయిరీ వద్ద రోజంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, మధుసూదన్‌రెడ్డి తాను అయ్యప్ప మాల వేసుకున్నందున పూజకు వెళ్లాలని చెప్పి వెళ్లారు. సాయంత్రం డెయిరీ ఎండీ ఇతర డైరెక్టర్లపై బైండోవర్ కేసులు పెట్టి తహసీల్దార్ శ్రీనివాసులు ఎదుట హాజరుపరిచారు.త్రిసభ్య కమిటీ ముందు హాజరుకాకుండా హైడ్రామా..బమరోవైపు.. భూమా విఖ్యాత్‌రెడ్డి విజయ డెయిరీకి రూ.1.20 కోట్లు అప్పు ఉన్నారు. ఆ అప్పు చెల్లించకపోవడంతో అతని సభ్యత్వాన్ని రద్దుచేశారు. దీంతో.. పాల సొసైటీ అధ్యక్షుడు కాకపోతే చైర్మన్ కావడం సాధ్యంకాదని భావించి ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు పాల సొసైటీలో సభ్యత్వం లేకుండానే అధ్యక్షుడిగా విఖ్యాత్‌రెడ్డి ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు. అయితే, విఖ్యాత్ అప్పు చెల్లించకపోవడంతో డిఫాల్టర్‌గా ప్రకటించామని, అతని సభ్యత్వం కూడా రద్దుచేశామని.. మీరెలా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారో త్రిసభ్య కమిటీకి వివరణ ఇవ్వాలని కమిటీ సభ్యులు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. ఈ కమిటీలో డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, రవికాంత్రెడ్డిలు ఉన్నారు. కానీ, విఖ్యాత్‌రెడ్డి వివరణ ఇవ్వలేదు. ఈనెల 10న వివరణ ఇవ్వాల్సి ఉండగా కమిటీ సభ్యులపైనే బైండోవర్ కేసులు నమోదుచేయడం చర్చనీయాంశమైంది.నిబంధనల ప్రకారం డైరెక్టర్‌గా వస్తే స్వాగతిస్తాం..భూమా విఖ్యాత్‌రెడ్డి డీఫాల్టర్ అయ్యాడు. ముత్యాలపాడు సొసైటీలో సభ్యత్వం లేకుండా అధ్యక్షుడు కావడం నిబంధనలకు విరుద్ధం. ఆ సొసైటీకి అధ్యక్షుడిగా ఎంపికపై సమాధానం ఇవ్వాలంటూ సభ్యులకు మూడుసార్లు నోటీసులిచ్చాం. ఈనెల 10న వివరణ ఇచ్చేందుకు మరోమారు అవకాశవిుచ్చాం. కానీ, మాపై బైండోవర్ కేసులు అంటూ పోలీసులు హడావుడి చేయడమేమిటి? నోటీసులిచ్చి ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్లొచ్చు. అక్రమంగా ఎండీ ప్రదీప్‌కుమార్‌పై బైండోవర్ కేసు పెట్టడం దుర్మార్గం. కమిటీ రిపోర్టును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మాకు రాజకీయ ఉద్దేశాల్లేవు. రైతుల సంక్షేమమే ముఖ్యం. – డైరెక్టర్లు పీపీ మధుసూదన్‌రెడ్డి, విజయసింహారెడ్డిలోకేశ్ను కలిసిన వెంటనే సీన్ మారింది..ఇక ఈనెల 6న భూమా విఖ్యాత్‌రెడ్డి మంత్రి నారా లోకేశ్‌ను కలవడంతో డెయిరీ రాజకీ యం పూర్తిగా మారిపోయింది. త్రిసభ్య కమిటీ సభ్యులు, డెయిరీ ఎండీపై ఆ మర్నాడే బైండోవర్ కేసు పెట్టారంటే టీడీపీ అధిష్టానం నుండే పోలీసులకు ఆదేశాలు వచ్చినట్లు ఇక్కడ చర్చ జరుగుతోంది. -
భూమా కుటుంబానికి ‘విజయ’ షాక్
నంద్యాల (అర్బన్): మ్యాక్స్ చట్టం, విజయ డెయిరీ బైలా ప్రకారం విజయ పాల డెయిరీకి పరోక్షంగా, ప్రత్యక్షంగా నష్టం కలిగించిన జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిల ప్రియ సోదరుడు భూమా జగత్ విఖ్యాత్‌రెడ్డిని విజయ డెయిరీ డీఫాల్టర్‌గా ప్రకటించింది. ఆదివారం విజయ డెయిరీ చైర్మన్ ఎస్వీ జగన్మోహన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ జగత్ డెయిరీ వర్కింగ్ పార్ట్నర్గా భూమా విఖ్యాత్ ఉంటూ విజయడెయిరీ ద్వారా రూ.1.30 కోట్లు రుణం తీసుకొని పలుమార్లు నోటీసులు పంపినా అప్పు చెల్లించలేదన్నారు. 2014–2020 వరకు జగత్ పాల డెయిరీని విజయ డెయిరీకి సమానంగా నడిపారని.. ఆ సమయంలో 30% వ్యాపారం విజయ డెయిరీకి నష్టం వచ్చిందన్నారు.జగత్ డెయిరీ మూతపడిన అనంతరం మళ్లీ విజయ డెయిరీ లాభాల్లోకి వచ్చిందన్నారు. నాలుగేళ్లుగా తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో నోటీసులిచ్చినా విఖ్యాత్ స్పందించలేదని, ప్రైవేట్ డెయిరీలో పనిచేస్తున్న వారికి విజయ డెయిరీలో స్థానం లేదని స్పష్టం చేశారు. జగత్ విఖ్యాత్ విజయపాల డెయిరీకి సమాంతర వ్యాపారం నిర్వహిస్తూ విజయ డెయిరీ నష్టాలకు బాధ్యులయ్యారని తెలిపారు. ఆయన ప్రాతినిధ్యం వస్తున్న చక్రవర్తులపల్లె పాల సొసైటీ పాలకవర్గాన్ని కూడా రద్దు చేశామన్నారు. -
టీడీపీలో అరాచక నేతలు
‘‘నాపై హత్యకు సుపారీ ఇచ్చింది. ఇప్పుడు దాడి చేసింది. ఇన్ని రోజులు పిల్లోళ్లు ఎత్తుకుని పెంచాం ఎందుకులే అనుకున్నా. ఇంత వరకూ వచ్చిన తర్వాత ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఏం జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది.’’ ఏవీ సుబ్బారెడ్డి యువగళం పాదయాత్రలో మే 16న టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల, తన అనుచరవర్గం భౌతికదాడి చేశారు. అఖిల దగ్గరుండి కొట్టండి.. తన్నండి అని రెచ్చగొడుతూ దాడికి పురిగొల్పారు. దాడిలో ఏవీకి రక్తగాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి అఖిలపై కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లొచ్చారు. ఈ ఘటన నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ టీడీపీలో కలకలం రేపింది. ‘‘కొడకల్లారా దాక్కోండి. గుళ్లోకెళ్లి మొక్కోండి. మీ ఖర్మకాలి టీడీపీ అధికారంలోకి వస్తే ఏ మూలన దాక్కున్నా వెంటపడి వస్తాం. వెతుక్కుంటూ వస్తాం. శోభానాగిరెడ్డి రాజకీయం చూపిద్దామనుకున్నా. వీళ్లకి భూమా నాగిరెడ్డి రాజకీయమే కావాల. కచ్చితంగా నాగిరెడ్డి రాజకీయమే చూపిస్తా!’’ – ఆళ్లగడ్డ యువగళం సభలో భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి సాక్షి ప్రతినిధి కర్నూలు: వ్యక్తిగతమైన ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వివాదాలు తమ వర్గాలకు రుద్ది, ఇది వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న విభేదాలుగా కాకుండా, వర్గాల మధ్య విభేదాలుగా చూపి రాజకీయం చేయడం టీడీపీ నేతలకే చెల్లింది. పొరపాటున టీడీపీకి అధికారం ఇస్తే ‘ఫ్యాక్షన్’ రాజకీయాలు చేస్తామని భూమా నాగిరెడ్డి వారసుడు విఖ్యాత్‌రెడ్డి.. లోకేశ్ సమక్షంలోనే తెగేసి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కనీసం ఇలాంటివి తప్పని కూడా వారించే ప్రయత్నం లోకేశ్ చేయకపోవడం ఆయన రాజకీయ పరిణతి ఏపాటిదో తెలియజేస్తోంది. దీంతో నిజంగానే వీరికి అధికారం ఇస్తే మళ్లీ ఫ్యాక్షన్ తగాదాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలో రక్తం పారే ప్రమాదం లేకపోలేదని ప్రజల్లో భయాందోళన నెలకొంది. వైఎస్సార్సీపీ కండువాతో గెలిచిన అఖిల, నాగిరెడ్డి ‘పచ్చ’కండువాలేసుకుని ‘సైకిల్’ జర్నీ చేశారు. 2019 ఎన్నికలకు ముందే నాగిరెడ్డి చనిపోయారు. ఈ ఎన్నికల్లో అఖిల ఓడిపోయారు. ఆళ్లగడ్డ, నంద్యాల ఎమ్మెల్యేలుగా కొత్తతరం రాజకీయనేతలు గంగుల బిజేంద్రారెడ్డి, శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఎన్నికయ్యారు. నాలుగేళ్లలో అభివృద్ధి మినహా వీరికి మరో ఆలోచన లేదు. ఈ క్రమంలో టీడీపీ నేతలకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా రెండు నియోజకవర్గాల్లో మళ్లీ అరాచక పాలన మొదలవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అఖిల వ్యవహారంతో కుటుంబ సభ్యులు దూరం నాగిరెడ్డి మృతి తర్వాత విభేదాల నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి దూరమయ్యాడు. చివరకు తనను చంపించేందుకు అఖిల సుఫారీ ఇచ్చినట్లు ఏవీ ఆరోపించారు. చింతకుంట, గోవిందపల్లికి చెందిన కొంతమందిని కడప పోలీసులు అప్పట్లో అదుపులోకి తీసుకున్నారు. ఏవీని దూరం చేసుకోవడం అఖిలకు దెబ్బే! ‘భూమా’కు అత్యంత సన్నిహితుడైన శివరామిరెడ్డిని క్రషర్ విషయంలో దూరం చేసుకున్నారు. నాగిరెడ్డి చిన్నాన్న, విజయ డెయిరీ చైర్మన్‌గా కొనసాగిన భూమా నారాయణరెడ్డిని ఆ కుర్చీ నుంచి తప్పించే ప్రయత్నం చేయడంతో ఆయన కూడా దూరమయ్యారు. ఆపై అఖిల పెద్దనాన్న భాస్కర్‌రెడ్డి కుమారుడు భూమా కిషోర్‌రెడ్డితో విభేదాలు పెంచుకున్నారు. దీంతో అతను బీజేపీలో చేరారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి సోదరుడు మహేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. కిషోర్ పార్టీలో చేరిన తర్వాత తన ఇంటికి వెళ్లకుండా కిషోర్ నివాసానికి అఖిల తాళాలు వేయించారు. చివరకు బ్రహ్మానందరెడ్డికి, అఖిలకు కూడా మాటల్లేవు. ఇలా ఒక్కొక్కరుగా ‘భూమా’ బంధువులు పూర్తిగా అఖిలకు దూరమయ్యారు. ఈ పరిణామాలతో ఆళ్లగడ్డ, నంద్యాలలోని ‘భూమా’ వర్గం కూడా రాజకీయంగా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డకు అఖిల వచ్చినా కనీసం పదిమంది ఇంటికి రాని పరిస్థితి. ఈ కారణంగానే ఆమె జిల్లాకు రావడం వదిలేసి ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటోందనే చర్చ ఉంది. అయితే అక్కడ కూడా వివాదాల్లో తలదూర్చారు. శేరిలింగంపల్లిలో 40 ఎకరాల భూమి ఆక్రమించుకునేందుకు కేసీఆర్ బంధువులను కిడ్నాప్ చేసిన వ్యవహారంలో అఖిల 14రోజుల రిమాండ్‌లో ఉన్నారు. చంచల్‌గూడకు ‘సీమ’లో బహుశా, రాష్ట్ర రాజకీయాల్లో కిడ్నాప్ వ్యవహారంలో మాజీ మహిళా మంత్రి జైలుకు వెళ్లడం ఇదే ప్రథమం. ‘ఫ్యాక్షన్’ భూమిలో అభివృద్ధి వెలుగులు ఆళ్లగడ్డ మూడు దశాబ్దాలపాటు ‘భూమా’ ఏలుబడిలోనే ఉంది. ఇన్నేళ్లలో సాధించిందేమిటని ఆరాతీస్తే హత్యలు, కేసులు, వారిని నమ్మకున్న కుటుంబాలు ఫ్యాక్షన్‌లో రాలిపోవడం మాత్రమే. నాగిరెడ్డి వల్ల నాపై 24కేసులు ఉన్నాయని, ఫ్యాక్షన్ నడిపానని ఏవీ సుబ్బారెడ్డే స్వయంగా చెబుతున్నారు. ఇదేదో వారు సాధించిన ఘనకార్యంలా చెప్పుకుంటున్నారు. గంగుల బిజేంద్రారెడ్డి ఎమ్మెల్యే అయ్యాక డిగ్రీ కాలేజీ సాధించి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. 30 పడకల ఆస్పత్రి 50 పడకలకు పెంచి పేదల ఆరోగ్యానికి దన్నుగా నిలిచారు. చాగలమర్రి మండలం వనిపెంట చెంచుగూడెం లాంటి చీకటి తండాలకు వంతెనలను నిర్మించి బయటి ప్రపంచానికి వారిని తీసుకొచ్చారు. ఇలా ప్రతి ఆలోచనలో అభివృద్ధి మినహా మరో ఆలోచన లేని నాయకుడిగా ఎదుగుతున్నారు. అలాగే శిల్పా రవి హయాంలో నంద్యాల జిల్లా కేంద్రమైంది. మెడికల్ కాలేజి సాధించారు. ‘అమృత్’ ద్వారా రూ.9కోట్లతో వెలుగోడు నుంచి తాగునీటిని నంద్యాలకు రప్పించి దాహార్తి తీర్చే ప్రయత్నం చేశారు. నగరంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా మూడు వంతెనలు నిర్మించారు. ఇలా వీరు అభివృద్ధి వైపు వెళుతున్నారు. కానీ టీడీపీ నేతలు గెలిస్తే చంపుతాం, నరుకుతాం అంటూ రక్తచరిత్రను గుర్తు చేస్తూ ప్రశాంత గ్రామాల్లో అలజడి సృష్టిస్తున్నారు. -
భూమా కుమారుడికి తప్పిన ప్రమాదం
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమారుడు విఖ్యాత్ రెడ్డి ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. విఖ్యాత్ రెడ్డి, అతడి స్నేహితులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. అయితే ఇంజిన్ నుంచి పొగ రావడాన్ని గుర్తించి వారు కారు దిగిపోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బేగంపేట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించాయని అనుమానిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో విఖ్యాత్ తల్లి శోభా నాగిరెడ్డి మృతి చెందిన సంగతి తెలిసిందే.


