సరైన అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించారంటూ చంద్రబాబు అక్కసు
పోలవరం సాక్షిగా బడాయి మాటలు.. పచ్చి అబద్ధాలు
తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలను కనీసం ఖండించని బాబు
ఏకాంత భేటీలో ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరిందో చెప్పకుండా గద్దింపు
శ్రీశైలంలో 841 అడుగులకు దిగువన నీటిని వాడుకోవడానికి సీమ ఎత్తిపోతల చేపట్టారంటూ నిష్టూరం.. సీమకు మేలు జరిగితే బాబుకొచ్చిన నష్టమేమిటని రైతుల ప్రశ్న
881 అడుగుల కంటే ఎత్తులో శ్రీశైలం నీళ్లు నిల్వ ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం
800 నుంచి 841 అడుగులలోపే వచ్చిన నీటిని వచ్చినట్లుగా శ్రీశైలం నుంచి రోజుకు 7 టీఎంసీలను తోడేస్తున్న తెలంగాణ
అలాంటప్పుడు ఇక శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగులకు చేరేదెప్పుడు? పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు ఎప్పుడు నీళ్లు రావాలి?
వర్షాభావ సంవత్సరాల్లో మరింత ఘోరం
అందుకే మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను వాడుకోవడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టిన వైఎస్ జగన్
అది పూర్తయితే జగన్‌కు మంచి పేరొస్తుందనే కక్షతో దాన్ని ఆపేసిన చంద్రబాబు సర్కార్
రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు తానే నిర్మించానంటూ బాబు బడాయి మాటలు
గండికోట, బ్రహ్మంసాగర్‌లో పూర్తి స్థాయిలో తానే నీటిని నిల్వ చేశానంటూ పచ్చి అబద్ధాలు
జలయజ్ఞంలో 83 ప్రాజెక్టులు చేపట్టింది.. వాటిలో 44 ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేసింది వైఎస్సారే
అందులో నెల్లూరు, సంగం, గాలేరు–నగరి, వెలిగొండలను జాతికి అంకితం చేసింది వైఎస్ జగనే
నాలుగు సార్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టుకు డిజైన్.. నిర్మాణం.. పూర్తి చేసిన దాఖలాలే లేవంటున్న ఇంజనీర్లు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, ఏలూరు: రాష్ట్రానికి జీవనాడి పోలవరం సాక్షిగా... రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం చంద్రబాబు తన కడుపు మంట, ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రూ.3,528 కోట్లు మంజూరు చేసి సరైన అనుమతులు లేకుండా ప్రారంభించారని విమర్శించారు. అనుమతులు లేని ప్రాజెక్టును మొదలుపెట్టి విచ్చలవిడిగా, అడ్డగోలుగా పనులు చేశారన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల దిగువన కేవలం 34 టీఎంసీలే నిల్వ ఉంటాయని.. అందులో రాష్ట్ర వాటా 22 టీఎంసీలని.. ఆ నీటిని వాడుకోవడానికి మల్యాల, ముచ్చుమర్రి (హంద్రీ–నీవా) ఎత్తిపోతల ఉందంటూ దబాయించారు. ఆ నీటిలో రోజుకు 3 టీఎంసీలను మళ్లించేలా, పర్యావరణ అనుమతి తీసుకోకుండానే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారని.. దానిపై ఎవరో ఎన్జీటీలో కేసు వేస్తే పనులు ఆపేయాలని తీర్పు ఇచ్చిందని.. దాంతో పనులు ఆగిపోయాయంటూ తనకు అలవాటైన రీతిలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేశారు.
పోలవరం పనులను బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి డయాఫ్రమ్‌వాల్ పూర్తవుతుందని, ఈసీఆర్‌ఎఫ్ డ్యామ్ గ్యాప్–2 పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మంసాగర్ రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయని, హంద్రీ–నీవా ద్వారా అన్ని చెరువులకు నీళ్లు ఇచ్చామని, కుప్పం వరకు నీళ్లు పారించామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. కాగా సీఎం చంద్రబాబునాయుడుతో ఏకాంతంగా (క్లోజ్ రూమ్‌లో) సమావేశమై రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపేయించా..!
ఆ పనులు ఆగిపోయాయో లేదో అన్నది తెలుసుకోవాలంటే తనిఖీ చేసుకోవచ్చంటూ తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి శనివారం చేసిన వ్యాఖ్యలను ఇంతవరకూ చంద్రబాబు ఖండించకపోవడం గమనార్హం. ఆ సమావేశంలో ఏం ఒప్పందం కుదిరిందన్నది వెల్లడించలేదు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చెప్పింది నిజమేనని చంద్రబాబు అంగీకరించారన్నది స్పష్టమవుతోంది. దీన్ని బట్టి.. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతో.. పనిగట్టుకుని ఆ ఎత్తిపోతల పనులను చంద్రబాబు ఆపేయించారని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు.
రాయలసీమ, నెల్లూరు వరదాయిని..
⇒ శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా కనీస నీటి మట్టం 854 అడుగులు. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టుకు సాగునీరు, చెన్నైకి తాగునీటిని శ్రీశైలం జలాశయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే నీటిని విడుదల చేయాలి.
⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను శ్రీశైలం ప్రాజెక్టులో 841 అడుగుల నీటి మట్టం వద్ద అమర్చారు. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంటుంది. అదే 854 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 7 వేలు, 841 అడుగుల్లో నీటి మట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఇక శ్రీశైలంలో 841 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉంటే చుక్క నీటిని కూడా తీసుకోలేం.
⇒ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు సర్కార్.. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాయి. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలాన్ని ఏపీ ప్రభుత్వం.. నాగార్జునసాగర్‌ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నాడు కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందంటూ అప్పట్లో తెలంగాణ తన అధీనంలోకి తీసుకున్నప్పటికీ చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఇంతలో ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ సర్కార్‌కు సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.
⇒ ఇదే అదునుగా తెలంగాణ సర్కార్ కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యాన్ని 25 నుంచి 40 టీఎంసీలకు పెంచుతున్నా.. అనుమతి లేకుండా శ్రీశైలం నుంచి రోజుకు 2 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా నాడు బాబు సర్కార్ నోరు మెదపలేదు. ఫలితంగా శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీ, ఎస్సెల్బీసీ నుంచి 0.5 టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి–డిండి ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరసి శ్రీశైలం ప్రాజెక్టులో 800 అడుగుల నీటి మట్టం నుంచే రోజుకు 6.95 టీఎంసీలు తరలించే సామర్థ్యాన్ని తెలంగాణ సాధించుకుంది. శ్రీశైలం నుంచి 800 అడుగుల స్థాయిలో హంద్రీ –నీవా ద్వారా కేవలం 0.33 టీఎంసీలు తరలించే సామర్థ్యం మాత్రమే ఏపీకి ఉంది.
⇒ శ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ.. 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా సరే.. డెడ్ స్టోరేజీలో ఉన్న నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేనప్పటికీ ఎడమ గట్టు కేంద్రంలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాయలసీమ రైతుల హక్కులను హరిస్తున్నా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఇక శ్రీశైలంలోకి వరద ప్రవాహం ప్రారంభమయ్యాక కూడా తెలంగాణ సర్కార్ వచ్చింది వచ్చినట్టుగా నీళ్లను తరలించడం వల్ల నీటి మట్టం 881 అడుగులకు చేరడం గగనంగా మారింది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు నీళ్లందక.. తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ఆయకట్టులో 2014–19 మధ్య ఏటా పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కృష్ణా బేసిన్‌లో 2015–16లో వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలానికి 58.69 టీఎంసీల ప్రవాహమే రాగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు కేవలం 0.95 టీఎంసీని మాత్రమే సరఫరా చేశారు. ఆ ఏడాది గుక్కెడు తాగునీటి కోసం కటకటలాడటమే అందుకు నిదర్శనం.
⇒ ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తడారిన గొంతులను తడిపేందుకు.. బచావత్ ట్రిబ్యునల్ ద్వారా హక్కుగా దక్కిన నీటిని వాడుకుని ఎండిపోతున్న పంటలను రక్షించడం కోసం.. తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ.3,825 కోట్లతో 2020 మే 5న రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ఎత్తిపోతల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు వరదాయిని అవుతుందని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.
⇒ చంద్రబాబు చెబుతున్నట్లుగా శ్రీశైలంలో 841 అడుగుల దిగువన నిల్వ ఉండే 34 టీఎంసీలను తరలించడానికి కాదు.. 841 అడుగుల ఎగువ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువకు 3 టీఎంసీలను ఎత్తిపోసి.. మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే రాయలసీమ ఎత్తిపోతల.
పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు
అడుగడుగునా మోకాలడ్డు..
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరొస్తుందోననే ఈర‡్ష్యతో.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన టీడీపీ సానుభూతిపరుడు గవినోళ్ల శ్రీనివాస్ ద్వారా ఎన్జీటీ (చెన్నై) బెంచ్‌లో చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయించారని.. అదే వ్యక్తితో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పశ్చిమ మండలాల రూపురేఖలను మార్చడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ముదివేడు, నేతిగుంటపల్లి, ఆవులపల్లి రిజర్వాయర్ల పనులపైనా ఎన్జీటీలో ఫిర్యాదు చేయించారని సాగునీటిరంగ నిపుణులు, రైతులు అప్పట్లోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆ మూడు రిజర్వాయర్ల నిర్మాణం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని ఎన్జీటీలో పిటిషనర్ వాదించారు.
అయితే తెలుగుగంగ, గాలేరు–నగరి, ఎస్సార్బీసీలకు పర్యావరణ అనుమతి ఉందని.. ఆ ప్రాజెక్టులకు నీటిని అందించడానికి చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి అవసరం లేదని వైఎస్ జగన్ ప్రభుత్వం నాడు ఎన్జీటీకి స్పష్టం చేసింది. కానీ.. పర్యావరణ అనుమతి తీసుకుని, ఆ పనులు చేపట్టాలంటూ 2020 అక్టోబర్ 29న ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పర్యావరణ అనుమతి కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే.. రాయలసీమ, నెల్లూరు, చెన్నై తాగునీటి అవసరాల కోసం సీమ ఎత్తిపోతల పనులను కొనసాగించింది.
ఈ క్రమంలో రూ.990 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. కానీ.. గతేడాది ఫిబ్రవరి 27న కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్వహించిన ఈఏసీ సమావేశంలో రాయలసీమ ఎత్తిపోతలను తొలి దశలో తాగునీటి అవసరాల కోసం చేపడుతున్నామని.. మలి దశలో పర్యావరణ అనుమతి తీసుకుంటామని చంద్రబాబు సర్కారు స్పష్టం చేసి ఉంటే ఆ ఎత్తిపోతల పనులకు ఎలాంటి అడ్డంకి ఉండేది కాదని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేవలం వైఎస్ జగన్‌కు మంచి పేరొస్తుందనే ఈర‡్ష్యతోనే ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను ఈఏసీ సమావేశంలో చంద్రబాబు సర్కార్ చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు.
ఒక్క ప్రాజెక్టూ కట్టకుండా బడాయి మాటలు..
ఉమ్మడి రాష్ట్రంలో 1995–99, 1999–2004.. విభజన తర్వాత 2014–19, మళ్లీ ఇప్పుడు.. మొత్తం నాలుగు సార్లు సీఎం చంద్రబాబు అధికారంలో ఉన్నారు. దాదాపు 16 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు డిజైన్ చేయలేదు.. నిర్మాణాన్ని చేపట్టలేదు.. పూర్తి చేసి జాతికి అంకితం చేయలేదు అంటూ జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం పనిచేసిన రిటైర్డు ఇంజనీర్–ఇన్–చీఫ్‌లు, చీఫ్ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ.. రాష్ట్రంలో 90 శాతం ప్రాజెక్టులు తానే కట్టానంటూ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేస్తూ బడాయి మాటలు మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో జలయజ్ఞం కింద ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయంతో పోలవరం, పులిచింతల, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తోటపల్లి, పుష్కర, తాడిపూడి, వంశధార స్టేజ్–2 ఫేజ్–2 వంటి భారీ, సూరంపాలెం, భూపతిపాలెం వంటి మధ్య తరహా 83 ప్రాజెక్టులు చేపట్టి.. తాను మరణించే నాటికే 44 ప్రాజెక్టులను పూర్తి చేసి, జాతికి అంకితం ఇచ్చి చరిత్రలో నిలిచిపోయారని ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు.
జలయజ్ఞంలో భాగంగా దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలను సస్యశ్యామలం చేయడం కోసం 2005లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచినప్పుడు.. దాన్ని నిరసిస్తూ, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రకాశం బ్యారేజీపై దేవినేని ఉమాహేశ్వరరావుతో తెలంగాణ ప్రాంతంలో మహబూబ్‌నగర్ జిల్లాలో మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డితో చంద్రబాబు ధర్నాలు చేయించారని గుర్తు చేస్తున్నారు. ఇక తెలుగుగంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ నిర్మాణంలో లోపాల వల్ల మట్టికట్టలో లీకేజీలు ఏర్పడటంతో 2020 వరకూ ఎన్నడూ నాలుగైదు టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖాలు లేవు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్ నిర్మించి, మట్టికట్ట లీకేజీలకు అడ్డుకట్ట వేసి 2020 నుంచి బ్రహ్మంసాగర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందంటూ ఆ పనులను పర్యవేక్షించిన రిటైర్డు అధికారి ఒకరు విస్తుపోయారు.
మహానేత వైఎస్ నిర్మించిన గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు వైఎస్ జగన్ 2019లో రూ.వెయ్యి కోట్లతో పునరావాసం కల్పించి.. ఆ రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను ప్రతి ఏటా నిల్వ చేస్తే.. ఆ పని తాను చేసినట్లుగా సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా అబద్ధాలాడటం గమనార్హం. ఇక మహానేత వైఎస్సార్ పూర్తి చేసిన పుష్కర, తాడిపూడి, చాగల్నాడు, కల్వకుర్తి, నెట్టెంపాడు, దేవాదుల లాంటి ఎత్తిపోతల పథకాలను తాను పూర్తి చేసినట్లుగా సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయకుండా.. కమీషన్ల కోసం గోదావరి కుడి గట్టుపై పట్టిసీమ, ఎడమ గట్టుపై పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టింది.
ఆ రెండు ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఇక చింతలపూడి ఎత్తిపోతల తొలిదశకు 2008లో నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం పర్యావరణ అనుమతి తీసుకుంది. కానీ.. 2018లో ఆ ఎత్తిపోతల సామర్థ్యాన్ని చంద్రబాబు సర్కార్ పెంచింది. అయితే దానికి పర్యావరణ అనుమతి తీసుకోలేదు. ఈ మూడు ఎత్తిపోతల పథకాలపై ఎన్జీటీలో కేసులు దాఖలయ్యాయి. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఆ మూడు ఎత్తిపోతల పథకాలపై జరిమానా విధిస్తూ 2021 డిసెంబర్ 2న ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. పురుషోత్తపట్నం ఎత్తిపోతలపై రూ.24.56 కోట్లు, పట్టిసీమ ఎత్తిపోతలపై రూ.24.9 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతలపై రూ.73.6 కోట్లను జరిమానాగా విధించింది.
జగన్ హయాంలోనే సీమ సుభిక్షం..
⇒ నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పులిచింతల నిర్వాసితులకు పరిహారం చెల్లించింది. తెలంగాణకు పరిహారం చెల్లించి పూర్తి స్థాయిలో అంటే 45.77 టీఎంసీలను పులిచింతలలో నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండు పంటలకు నీళ్లందించి చరిత్ర సృష్టించింది.
⇒ తెలుగుగంగ లింక్ కెనాల్‌ను ఆధునికీకరించి.. వెలుగోడు రిజర్వాయర్‌ను సకాలంలో గరిష్ట సామర్థ్యం 16.95 టీఎంసీలను చేర్చి నింపింది. రూ.600 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువకు లైనింగ్ చేసి.. డిజైన్ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని 5 వేల క్యూసెక్కులకు పెంచింది.
⇒ బ్రహ్మంసాగర్ మట్టికట్టకు రూ.90 కోట్లతో డయాఫ్రం వాల్‌ను వేసి లీకేజీలకు అడ్డుకట్ట వేసి దాని పూర్తి సామర్థ్యం మేరకు 17.74 టీఎంసీలను నిల్వ చేసింది.
⇒ తెలుగుగంగలో అంతర్భాగమైన సోమశిల రిజర్వాయర్‌లో గరిష్ట సామర్థ్యం మేరకు 78 టీఎంసీలు, కండలేరు రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 68.3 టీఎంసీలను నింపి ఐదేళ్లూ ఆయకట్టులో రెండు పంటలకూ నీళ్లందించింది.
⇒ గాలేరు–నగరి వరద కాలువలో అవుకు వద్ద రెండు సొరంగాలను పూర్తి చేసి..
గండికోట రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లను పరిహారంగా చెల్లించి, వారికి పునరావాసం కూడా కల్పించి గరిష్ట సామర్థ్యం మేరకు 26.85 టీఎంసీలను నిల్వ చేసింది.
⇒ చిత్రావతి రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లను పరిహారంగా చెల్లించి, పునరావాసం కల్పించి.. గరిష్ట సామర్థ్యం మేరకు పది టీఎంసీలు నిల్వ చేసింది.
⇒ ఇలా ఐదేళ్లూ రిజర్వాయర్లను సకాలంలో నింపి.. రాయలసీమను సస్యశ్యామలం చేసింది.
కొత్తగా అనేక పనులు చేపట్టిన జగన్ సర్కార్...
మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షాలు కురిసే రోజులు తగ్గాయి. శ్రీశైలానికి గరిష్టంగా వరద వచ్చినప్పుడు దాన్ని ఒడిసి పట్టుకునే సామర్థ్యం కాలువలకు లేదు. దీంతో కృష్ణా వరద జలాలను గరిష్ట స్థాయిలో ఒడిసి పట్టి శ్రీశైలానికి వరద వచ్చే 30–40 రోజుల్లోనే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులను నింపేలా వైఎస్సార్‌సీపీ హయాంలో కాలువల సామర్థ్యం పెంచే పనులు, అవసరమైన చోట్ల కొత్త ప్రాజెక్టుల పనులను చేపట్టింది.
⇒ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల నుంచి 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు.. శ్రీశైలం కుడి గట్టు ప్రధాన కాలువ సామర్థ్యాన్ని, గాలేరు–నగరి వరద కాలువ, తెలుగుగంగ లింక్ కెనాల్, ప్రధాన కాలువ ప్రవాహ సామర్థ్యం పెంచే పనులను చేపట్టింది.
⇒ కేసీ కెనాల్ ఆయకట్టును స్థిరీకరించడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజోలి, జోలదరాసి రిజర్వాయర్ల పనులను చేపట్టింది.
⇒ తెలుగుగంగ ఆయకట్టుకు సమృద్ధిగా నీటిని అందించడానికి కుందూ ఎత్తిపోతల పనులను చేపట్టింది.
⇒ గాలేరు–నగరి సుజల స్రవంతి–హంద్రీ–నీవా సుజల స్రవంతిలను అనుసంధానం చేస్తూ ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు పనులు చేపట్టింది.
⇒ హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 3,850 నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచే పనులను చేపట్టింది.
⇒ కానీ.. చంద్రబాబు సర్కార్ ఆ పనులన్నింటినీ ఆపేసి రాయలసీమకు వెన్నుపోటు పొడిచింది.


