ఆటో కార్మీకులంటే అంత అలుసా బాబూ? | Auto Drivers Fires On Chandrababu: AP | Sakshi
Sakshi News home page

ఆటో కార్మీకులంటే అంత అలుసా బాబూ?

Mar 15 2026 4:54 AM | Updated on Mar 15 2026 4:54 AM

Auto Drivers Fires On Chandrababu: AP

ముఖ్యమంత్రి చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ ఆందోళన చేస్తున్న ఆటోవాలాలు

సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ 

ఆటోవాలాల ఆందోళన

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇటీవల జరిగిన మహిళా దినోత్సవంలో ఆటోకార్మీకులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆటో కార్మి­కు­లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆటో కార్మీకులు ప్రమాదాలకు కారణం అవుతున్నారని, ప్రమాదాల నుంచి మహిళలను రక్షించేందుకే ఫ్రీ బస్సు పథకం ఏర్పాటు చేశానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నా­యని ఆగ్ర­హం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఆటో కార్మీకులను దోషులుగా చూపడం తగదన్నారు. 

రైళ్లు, బస్సులు చివరికి విమానాలు కూడా ప్రమాదాలకు గురవుతున్నాయన్నారు. కేవలం ఆటో కార్మీకులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విజయవాడ అలంకార్‌ సెంటర్‌ ధర్నా చౌక్‌లో శనివారం ఆటోవాలాలు ధర్నా చేపట్టారు. తమనుద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను  ఆటోకార్మీకులు తప్పుబట్టారు. తన సొంత హెరిటేజ్‌కి రూ.200 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి రాయితీలు పొందడం దుర్మార్గమన్నారు. లేబర్‌ కోడ్స్‌ రద్దు కోరుతూ ఇఫ్టూ ఆధ్వర్యంలో ఈ నెల23న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఇఫ్టూ రాష్ట్ర అధ్యక్షుడు కె.పోలారి, మునిశంకర్, పెద్దిరాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement