కేజీబీవీల్లో విజయపథం, జూనియర్ కాలేజీల్లో సంకల్ప్–2026
వచ్చేనెలలో పదో తరగతి 100 డేస్ ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 100 రోజుల ప్రణాళికను ‘విజయపథం’ పేరుతో అమలు చేస్తుండగా, ఇంటర్మిడియట్ కాలేజీల్లో సంకల్ప్–2026 పేరుతో సోమవారం నుంచి అమలు చేయనున్నట్టు ఇంటర్ విద్య డైరెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. పదో తరగతిలోనూ మెరుగైన ఫలితాలు సాధించేందుకు వచ్చే నెల నుంచి 100 డేస్ ప్లానింగ్ అమలు చేసేందుకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం (2025–26)లో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. కేజీబీవీల్లోని ఇంటర్మీడియట్ బాలికల కోసం ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు అమలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతిరోజు రెండు సబ్జెక్టుల్లో పరీక్షలతో పాటు 15 రోజులకు ఒక గ్రాండ్ టెస్టు నిర్వహించేలా ప్రణాళికను కేజీబీవీలకు అందించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు రోజువారీ ప్రణాళికను సోమవారం విడుదల చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసి ఉదయం 9.10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 50 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. నిర్దేశిత టైమ్‌టేబుల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని డైరెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. కాగా, ఈ విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ మొదటి ఏడాది 5,28,805, రెండో ఏడాది 4,93,454 మంది మొత్తంగా 10,22,259 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
వచ్చేనెల నుంచి పదో తరగతి కూడా..
ప్రస్తుత విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 6.40 లక్షల మంది విద్యార్థులు ఉండగా, వీరిలో దాదాపు 3.40 లక్షల మంది ప్రభత్వ పాఠశాలలకు చెందిన వారున్నారు. వీరికోసం డిసెంబర్ మొదటి వారం నుంచి అమలు చేసేందుకు ఎన్‌సీఈఆర్టీ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తోంది. కాగా, 2026 పదో తరగతి పబ్లిక్ పరీక్షలను మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. అదేనెల 31తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో 100 రోజుల ప్రణాళికను వచ్చేనెల మొదటి వారం నుంచి అమలు చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈ క్రమంలో షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు.


