విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత పేర్ని నాని, చిత్రంలో మేధావులు, వివిధ పార్టీల నాయకులు
ప్రపంచంలో ఎక్కడాచూడని అతిపెద్ద స్కామ్ ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటీకరణ
చంద్రబాబు సర్కార్‌పై మేధావులు, వివిధ పార్టీల నాయకుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాన్ని ఎంచుకున్నారని మే«ధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో నిరి్మంచిన ప్రభుత్వ వైద్యకళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెడుతూ ప్రపంచంలో ఎన్నడూ చూడని అతిపెద్ద స్కామ్‌కు తెరతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 10 వైద్యకళాశాలలను ప్రైవేటీకరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలోని ధర్నాచౌక్‌లో సామూహిక నిరసన దీక్ష చేపట్టారు.
ఈ దీక్షకు భారీ స్పందన లభించింది. వైఎస్సార్‌సీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ సహా వివిధ రాజకీయ పార్టీలు, నాయకులు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకునేవరకు ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు. భవిష్యత్‌లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. దీక్షలో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత పేర్ని నాని, ప్రభుత్వ వైద్యకళాశాలల పరిరక్షణ కమిటీ కన్వినర్ డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, కాంగ్రెస్ నాయకులు గిడుగు రుద్రరాజు, ఎన్.తులసిరెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్‌జీ, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు పానుగంటి చైతన్య, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనకు మద్దతు తెలుపుతున్న నాయకులు
100కి 150 శాతం తప్పుడు నిర్ణయం
గత వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త వైద్యకళాశాలల ఏర్పాటు చేపట్టింది. వాటిలో కొన్ని కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు 10 కళాశాలలు ప్రైవేట్‌కు ఇస్తామనడం 100కి 150 శాతం తప్పుడు నిర్ణయం. కళాశాలలు ప్రభుత్వరంగంలో ఉంటే దానికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. – వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతుసంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వినర్
మోసగాడినేనని నిరూపించుకుంటున్న లోకేశ్
గత ప్రభుత్వంలో వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం తెస్తే తీవ్రంగా ఖండించిన లోకేశ్.. తాము అధికారంలోకి రాగానే రద్దుచేస్తామన్నారు. ఇప్పుడు మొత్తం కళాశాలలనే ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్నారు. తండ్రిలాగా తాను కూడా మోసగాడినే అని లోకేశ్ నిరూపించుకుంటున్నారు. – విజయ్‌కుమార్, మాజీ ఐఏఎస్ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
ప్రభుత్వం ప్రైవేట్‌కు ఇస్తున్న 10 వైద్యకళాశాలలు ఉన్న ప్రాంతాల్లో ఏడు అత్యంత వెనుకబడినవే. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పీపీపీ నిర్ణయాన్ని విరమించుకోవాలి. దీనిమీద ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. – కె.ఎస్.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ
ప్రభుత్వాన్నే ప్రైవేట్‌కు ఇచ్చేయ్
18 నెలల నుంచి ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు చేస్తోంది. అన్నింటికి అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్యకళాశాలల కోసం రూ.3 వేలకోట్ల నుంచి రూ.4 వేలకోట్లు ఖర్చు చేయలేరా? ఎవరైనా ప్రశ్నిస్తే ప్రైవేట్ వ్యక్తులయితేనే కళాశాలలు మెరుగ్గా నిర్వహిస్తారని చెబుతున్నారు. అలాగైతే మొత్తం ప్రభుత్వాన్నే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పేయండి. వాళ్లే బాగా ప్రభుత్వాన్ని నడుపుతారు. – కె.రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
బాబు ప్రభుత్వానికి శరాఘాతం
పది వైద్యకళాశాలలను ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం చంద్రబాబు ప్రభుత్వానికి శరాఘాతం అవుతుంది. రాష్ట్రంలో వైద్య శాఖ నిరీ్వర్యం అయిపోయింది. రెండేళ్లు తిరగకుండానే రూ.3 లక్షల కోట్లకుపైగా అప్పులు చేసిన చంద్రబాబు వైద్యకళాశాలలకు నిధుల్లేవంటున్నారు. – మల్లాది విష్ణు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు
చంద్రబాబు తగ్గకపోతే ప్రజలే ఆయన్ని తగ్గిస్తారు
వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై చంద్రబాబు తగ్గకపోతే 2029లో ప్రజలే ఆయన్ని తగ్గిస్తారు. చంద్రబాబు తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం భవిష్యత్‌లో రాజ్యాంగంపైనా ప్రభావం చూపుతుంది. ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. – జి.ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
పార్టీలకు అతీతంగా ఉద్యమించాలి
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వారికి పాడిగేదెలాగా మార్చే నీచమైన ఆలోచన కలిగిన నాయకుడు చంద్రబాబు. ఆయన ఆలోచన మార్చుకునే వరకూ ప్రజలందరు ఉద్యమం చేయాలి. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. – పేర్ని నాని, మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత
దానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు
ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటుకు ఇవ్వడంపై ప్రశి్నస్తే 99 పైసలకు భూములు ఇచ్చేస్తా మీరెవరు అడగానికి అని లోకేశ్ అంటున్నారు. ఉచితంగా దానం చేయడానికి మీ అబ్బ సొత్తు కాదు. అంతలా దానం చేసుకోవాలని ఉంటే హెరిటేజ్, ఇంకా సొంత ఆస్తులను దానం చేసుకోవాలి. – వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
ప్రపంచంలో ఎక్కడా చూడని కుంభకోణం
ప్రభుత్వ రంగంలోని 10 వైద్యకళాశాలలను ప్రైవేట్‌కు దోచిపెడుతున్న ఇలాంటి కుంభకోణాన్ని ప్రపంచంలో మరెక్కడా చూసి ఉండం. సంవత్సరానికి రూ.రెండువేల కోట్ల చొప్పున మూడేళ్లు ఖర్చుచేస్తే కళాశాలలన్నీ ప్రభుత్వరంగంలోనే అందుబాటులోకి వస్తాయి. – వి. లక్ష్మణరెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు


