- రైతుల పొట్టకొట్టి లాక్కున్న భూములను... కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా?
- 99 పైసలకే భూములిచ్చే హక్కు లోకేశ్‌కు ఎక్కడుంది?
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం
సాక్షి, అమరావతి: ‘రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తోంది. ఆ భూములను అప్పనంగా కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతోంది. దాన్ని సమర్థించుకునేందుకు మంత్రి లోకేశ్ 99 పైసలకే కార్పొరేట్లకు భూములిచ్చేస్తా... మీకేంటి ఇబ్బంది? అని బరితెగించి మాట్లాడుతున్నారు. రైతుల పొట్టకొట్టి బలవంతంగా లాక్కున్న పంట భూములను కార్పొరేట్లకు ఉచితంగా ఇస్తారా?’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు లోకనాథంతో కలిసి ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
గతంలో తాము ఎవరికీ ఉచితంగా భూములు ఇవ్వలేదని లోకేశ్ చెప్పారని గుర్తుచేశారు. అప్పుడు మార్కెట్ రేటుకే భూములు ఇస్తున్నామని, ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయలకు భూములిచ్చారో లెక్కలతో సహా వెల్లడించారని తెలిపారు. అలాంటిది ఇప్పుడు 99 పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పడం బరితెగింపేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరి ఆస్తి? ఎవరికి 99 పైసలకిస్తారు? అలా ఇవ్వడానికి లోకేశ్‌కు ఏం హక్కుంది? అని శ్రీనివాసరావు ప్రశ్నించారు.
విశాఖ రీజనల్ డెవలప్‌మెంట్ పేరుతో స్టీల్ ప్లాంట్ భూముల మళ్లింపు
కొత్తగా విశాఖపట్నం రీజనల్ డెవలప్‌మెంట్ అంటూ నీతి ఆయోగ్ ఓ రిపోర్టు తయారు చేసిందని, దానిలో విశాఖ స్టీల్ ప్లాంటుకు చెందిన 2,500 ఎకరాలను నక్కపల్లిలో పరిశ్రమలు పెట్టడానికి ప్రైవేట్ వ్యక్తులకు మళ్లించండి... అని స్పష్టంగా ఉందని శ్రీనివాసరావు చెప్పారు. భూములను ఇష్టానుసారం ఇస్తున్నారని ప్రశ్నించినందుకు సీపీఎం నాయకుడు అప్పలరాజును తీసుకెళ్లి డిటైన్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అప్పలరాజుపై కేసు లేదు, కోర్టు ముందు ప్రవేశపెట్టలేదు... ఎవరినీ కలవనీయడం లేదని ధ్వజమెత్తారు.
ఈ రకంగా ఎంతమందిని నిర్బంధించి, ఎన్ని అక్రమ కేసులు పెట్టి బెదిరించి రైతుల భూములను లాక్కుంటారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ‘సీపీఎం నాయకులు వేరేవారి స్క్రిప్ట్ చదువుతున్నారని మంత్రి లోకేశ్ ఆరోపించడం సరికాదు. గత ప్రభుత్వంపై మేం పోరాటాలు చేస్తే ఒప్పు.. ఇప్పుడు మీ తప్పులను నిలదీస్తే తప్పా?’ అని లోకేశ్‌ను శ్రీనివాసరావు ప్రశ్నించారు. కొత్త ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా సీపీఎం ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు ర్యాలీల ద్వారా ఇంటింటికి తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. ఈ నెల 14న కొత్త ఉపాధి చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


