పట్టణాల్లో విలువైన వ్యవసాయేతర దేవుడు భూముల పందేరానికి పచ్చ జెండా
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ ఆ«దీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మీక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకు ఇవ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మీక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌కు కల్పించింది. లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ధార్మీక పరిషత్‌కు కల్పించింది. అయితే గతంలో దేవదాయ శాఖ జారీ చేసిన జీవో 426 ప్రకారం దేవాలయాలకు సంబంధించిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాలని నిర్దేశించడం గమనార్హం
నిన్న ఆమోదం.. నేడు జీవో..
రాష్ట్రంలో వివిధ ఆలయాల పేరిట ఉన్న లక్షల ఎకరాల దేవుడి భూములను ఎలాంటి వేలం లేకుండా ధార్మీక సంస్థల పేరిట కావాల్సిన వారికి నేరుగా పందేరం చేసేందుకు పచ్చజెండా ఊపుతూ చంద్రబాబు ప్రభుత్వం 2025 మే 2వతేదీన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. దాదాపు 8 నెలల తర్వాత తుది మార్గదర్శకాలను గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా.. శుక్రవారం జీవో ఎంఎస్ నెంబరు 15 ద్వారా అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయితే లీజు ధరలను సైతం స్పష్టంగా వెల్లడించకపోవడం గమనార్హం. అధికారుల విచక్షణ మేరకు లీజు ధరలపై నిర్ణయం తీసుకునే అధికారం కల్పించింది.
4.67 లక్షల ఎకరాల దేవుడి భూములు...
రాష్ట్రంలో దేవదాయశాఖ పరిధిలో ఆలయాలు, సత్రాలు, మఠాలు పేరిట మొత్తం 4.67 లక్షల ఎకరాల భూములున్నాయి. అందులో పట్టణ ప్రాంతాల్లో 4,244 ఎకరాల మేరకు అత్యంత విలువైన వ్యవసాయేతర భూములున్నాయి. వీటిలో 1.55 కోట్ల చదరపు గజాలు ఖాళీ భూములుగానూ, మరో 50 వేల చదరపు గజాలు కట్టడాల రూపంలో ఉన్నాయి.


