భారతీయ విమానయాన మార్కెట్‌లో 64 శాతం పైగా ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిట్ (ఎఫ్‌డీటీఎల్) నిబంధనల అమలులో జరిగిన జాప్యం కారణంగా దేశవ్యాప్తంగా తీవ్ర సంక్షోభం నెలకొంది. డిసెంబర్ 2 నుండి 5 వరకు 1,200కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 5న ఒక్కరోజే 1,000కు పైగా సర్వీసులు రద్దయ్యాయి. ఇది ఇండిగో 20 సంవత్సరాల చరిత్రలో అతిపెద్ద ఆపరేషనల్ సవాలుగా నిలిచింది.
ఎఫ్‌డీటీఎల్ నిబంధనల్లో ఏముంది?
జనవరి 2024లో డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను ప్రకటించింది. వీటిని నవంబర్ 1, 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలని ఆదేశించింది. ఈ నిబంధనల్లో ఉన్న కొన్ని ముఖ్యాంశాలు..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రవేశపెట్టిన నూతన FDTL (ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్) నిబంధనలు ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా మారాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి తగినంత విశ్రాంతి లభించేలా అలసటను తగ్గించి భద్రతను పెంచేందుకు ఈ నిబంధనలు తీసుకొచ్చారు.
సిబ్బందికి వారానికి తప్పనిసరి విశ్రాంతి సమయాన్ని పెంచారు (గతంలో 36 గంటల నుంచి 48 గంటలకు). రాత్రిపూట ల్యాండింగ్‌ల సంఖ్యను తగ్గించారు (ముందు 6 నుంచి ఇప్పుడు వారానికి 2కి). రాత్రిపూట విమానయాన కార్యకలాపాల సమయంలో పరిమితులు విధించారు.
ఇండిగో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో ఇది రోజుకు 2,200కి పైగా విమానాలను నడుపుతుంది. కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ భారీ నెట్‌వర్క్‌ను, సిబ్బంది రోస్టర్‌ను వెంటనే మార్చుకోలేకపోవడంతో తీవ్ర సిబ్బంది కొరత ఏర్పడింది. పాత షెడ్యూల్స్ ప్రకారం డ్యూటీ చేసిన అనేక మంది సిబ్బంది కొత్త నియమాల వల్ల అకస్మాత్తుగా పని చేయలేని పరిస్థితి నెలకొంది.
తాత్కాలిక రిలాక్సేషన్
పరిస్థితి చేయిదాటిపోవడంతో సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ తక్షణమే జోక్యం చేసుకుని డిసెంబర్ 5న డీజీసీఏ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపేసింది. ఇండిగో A320 ఫ్లీట్‌కు మాత్రమే వర్తించేలా ఫిబ్రవరి 10, 2026 వరకు రిలాక్సేషన్లు మంజూరు చేశారు.
ఇండిగో ఆధిపత్యం
మార్కెట్ షేర్: ఆగస్టు 2025 నాటికి 64.2 శాతం డొమెస్టిక్ మార్కెట్ వాటాతో దేశంలో ప్రతి 10 మంది ప్రయాణికులలో 6 మంది ఇండిగోలో ప్రయాణిస్తున్నారు.
అంతర్జాతీయంగా ఆసియాలో 2వ అతిపెద్ద ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ప్రపంచంలో 9వ అతిపెద్ద ప్యాసింజర్ క్యారియర్‌గా ఉంది.
నవంబర్ 2025 నాటికి రోజుకు 2,700కి పైగా సర్వీసులు నడుపుతోంది.
ఇదీ చదవండి: విమాన కష్టాలు.. ఇండిగో సీఈవో వివరణ


