ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'కు భారీ షాక్ తగిలింది. డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద పారదర్శకత & డేటా యాక్సెస్ వంటివి ఉల్లంఘించినందుకు యూరోపియన్ యూనియన్ (EU) ఎక్స్‌కు వ్యతిరేకంగా 120 మిలియన్ యూరోలు జరిమానా విధించింది.
యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడంపై ఎలాన్ మస్క్ విరుచుకుపడ్డారు. ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే, ''ప్రభుత్వాలు తమ ప్రజలకు ప్రాతినిధ్యం వహించగలిగేలా ఈయూని రద్దు చేసి, సార్వభౌమత్వాన్ని వ్యక్తిగత దేశాలకు తిరిగి ఇవ్వాలని'' మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
The EU should be abolished and sovereignty returned to individual countries, so that governments can better represent their people
— Elon Musk (@elonmusk) December 6, 2025
ఏమిటీ డిజిటల్ సర్వీసెస్ చట్టం
డిజిటల్ సర్వీసెస్ చట్టం కింద యూరోపియన్ యూనియన్ జరిమానా విధించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇది (డిజిటల్ సర్వీసెస్ చట్టం) ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించడానికి, చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అరికట్టడానికి మాత్రమే కాకుండా 27 సభ్య దేశాలలో పారదర్శకతను మెరుగుపరచడానికి రూపొందించబడిన ఒక విస్తృత చట్టం. ఎక్స్ విధివిధానాలపై రెండేళ్ల దర్యాప్తు తరువాత యూరోపియన్ ఈ జరిమానా విధించింది.
యూరోపియన్ యూనియన్ చర్యను మస్క్ వ్యతిరేకించిన తరువాత.. అమెరికా రాజకీయ ప్రముఖులు కూడా ఖండించారు. దీనిని అమెరికన్ టెక్నాలజీ కంపెనీలపై దాడిగా.. అమెరికా ఆధారిత ప్లాట్‌ఫామ్‌ల పట్ల పెరుగుతున్న శత్రుత్వానికి సంకేతంగా అభివర్ణించారు.
ఈ ఘర్షణ మస్క్ & యూరోపియన్ సంస్థల మధ్య పెరుగుతున్న అంతరాన్ని హైలైట్ చేస్తుంది. ఎక్స్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి ఆయన నియంత్రణ చట్రాలను పదే పదే విమర్శించారు. అయితే ఈయూ సంస్థలు వినియోగదారులను రక్షించడానికి & ప్రజాస్వామ్య ప్రక్రియలను రక్షించడానికి పర్యవేక్షణ అవసరమని వాదిస్తున్నాయి.


