ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగానికి ‘గాడ్‌ఫాదర్’గా పిలుచుకునే ఏఐ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ మరోసారి తీవ్ర హెచ్చరిక చేశారు. ఏఐ వేగవంతమైన పురోగతి కారణంగా లక్షల్లో సిబ్బంది ఉద్యోగాలు కోల్పోతారని, ఇది సామూహిక నిరుద్యోగానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల అమెరికా సెనెటర్ బెర్నీ సాండర్స్‌తో కలిసి జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో జరిగిన చర్చలో హింటన్ ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘ఏఐ వల్ల భారీ నిరుద్యోగం రాబోతోందన్న విషయం చాలా మందికి స్పష్టంగా కనిపిస్తోంది’ అని ఆయన అన్నారు. టెక్ దిగ్గజాలు డేటా సెంటర్లు, చిప్స్‌పై ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేయగల ఏఐ వ్యవస్థలను రూపొందించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
2023లో గూగుల్‌ను వీడిన హింటన్ ఏఐ ప్రమాదాల గురించి బహిరంగంగా మాట్లాడుతూ.. ఏఐ కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందన్న ఆశావాదాన్ని ఖండించారు. ‘కొత్త ఉద్యోగాలు వస్తాయి కానీ, దీని పరిణామాల వల్ల కోల్పోయే ఉద్యోగాల సంఖ్యను అవి ఎప్పటికీ భర్తీ చేయలేవు’ అని స్పష్టం చేశారు.
టెక్ దిగ్గజాల అభిప్రాయాలు
ఏఐ ఉద్యోగాలపై చూసే ప్రభావం గురించి టెక్ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సెన్ హువాంగ్ ఇటీవల ‘ఏఐ సామూహిక తొలగింపులకు దారితీయదు, కానీ ఉద్యోగాల స్వభావాన్ని పూర్తిగా మారుస్తుంది’ అని అన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మాట్లాడుతూ త్వరలోనే చాలా అంశాల్లో మానవుల అవసరం లేకుండా పోతుందన్నారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ‘మరో 20 సంవత్సరాల్లో చాలా మందికి పని చేయవలసిన అవసరమే ఉండదు’ అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ఇంటి అద్దె పెంచాలంటే ముందే చెప్పాలి..


