వివిధ డిజైన్లలో కనిపించే ఉంగరాలు వేళ్లకు, చేతులకు ఎంత అందాన్ని తీసుకువస్తాయో మనకు తెలిసిందే. ఇదే ఆలోచనను టేబుల్ నాప్‌కిన్స్‌కు తీసుకువచ్చారు అలంకార ప్రియులు. నాప్‌కిన్ రింగ్ హోల్డర్లు నాప్‌కిన్లను నీటుగా ఉంచుతాయి. టేబుల్ అలంకరణకు ఆకర్షణను జోడిస్తాయి. వీటిని లోహం, కలప, పూసలు, వివిధ రకాల మెటీరియల్‌తో చేతితో తయారు చేసుకోవచ్చు. ఒకే డిజైన్, ఒకే పరిమాణంలో ఉన్న ఈ హోల్డర్లు విందు సమయాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయి.
వీటి వల్ల ప్రయోజనాలు ఏంటంటే...
నాప్‌కిన్‌లు అస్తవ్యస్తంగా లేకుండా నీటుగా ఉంటాయి. టేబుల్ అందాన్ని, వ్యక్తిత్వాన్ని, సంపూర్ణతను జోడిస్తాయి. ఈ చిన్న ఉంగరాలు విలాసవంతమైన అనుభూతిని కలిగిస్తాయి.
ఈ రింగ్స్ వల్ల నాప్‌కిన్‌లను ఒక్కొక్కటి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
బంగారం, ఇత్తడి, స్టెయిన్‌లెస్ స్టీల్, కలప, ప్లాస్టిక్, వెదురు, జనపనార... ఇలా వివిధ రకాల మెటీరియల్‌తో రుమాలు ఉంగరాలను రూపొందించవచ్చు.
సాధారణ బ్యాండ్ల నుండి బొమ్మలు, జంతువులు, ఆకులు... లెక్కలేనన్ని డిజైన్లలో ఈ రింగ్స్ లభిస్తాయి.
వీటిని ఎలా ఎంచుకోవాలంటే...
భోజనాల గది సౌందర్యానికి అనుగుణంగా ఉండే డిజైన్స్‌ని ఎంచుకోవాలి.
ఉపయోగించే నాప్‌కిన్‌లకు కాగితం లేదా క్లాత్ ఏదైనా, హోల్డర్ సరైన సైజులో ఉండేలా సరిచూసుకోవాలి.
సులభంగా విరిగిపోయేవి, పడిపోయేవి కాకుండా తగినంత బరువుతో ఉండేలా చూసుకోండి. రింగుల హోల్డర్లు గట్టిగా ఉండాలి కానీ, మరీ బరువుగా ఉండకూడదు.
మరకలు లేదా తుప్పు పట్టకుండా ఉండే రింగ్ హోల్డర్లను ఎంచుకోవాలి.
రుమాలు ఉంగరాలకు చరిత్ర కూడా ఉంది. 1800 ప్రాంతంలో ఫ్రాన్స్‌లో ఈ మోడల్ మొదలైంది. ప్రత్యేక విందు కార్యక్రమాలలో కనిపించే వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకునేవారు. వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్న నాప్‌కి రింగ్ హోల్డర్లను అభిరుచికి తగినవి సన్నిహితులకు కానుకలుగా ఇవ్వడానికీ సరైన ఎంపిక అవుతుంది.
ఎన్నార్
(చదవండి: కనిపెట్టింది మహిళలు.. క్రెడిట్ కొట్టేసింది పురుషులు..!)


