చరిత్ర పొరపాట్లు చేయదు. కానీ, మానవ స్వార్థం చరిత్రలో పొరపాట్లు నమోదు అయ్యేలా చేస్తుంది. అటువంటి చారిత్రకమైన స్వార్థపూరిత పొరపాట్లే ఇక్కడ ఉన్న ఈ ఆవిష్కరణలన్నీ. వీటిని కనిపెట్టింది, లేదా సృష్టించింది మహిళలే అయినప్పటికీ, ఆ గొప్పదనం పురుషులకు దక్కింది! నిజానికి ఇది ‘దక్కటం’ కాదు. ‘కొట్టేయటం’! స్త్రీల నుంచి పురుషులు.. చోరీ చేసి, ప్రపంచాన్ని మభ్యపెట్టి, గురువు స్థానంలో ఉండీ, పేటెంట్‌ను మూలన పడేసి, సహోద్యోగిని టాలెంట్‌ను తొక్కిపెట్టి, పైకి మాట్లాడనీయకుండా చేసి, పక్కకు తోసేసి...క్రెడిట్ తీసుకున్న ఇన్నోవేషన్‌లు.. డిస్కవరీలలో ఇవి కొన్ని మాత్రమే!
మోనోపలీ గేమ్
ఈ బోర్డ్ గేమ్‌ని కనిపెట్టింది కాలిఫోర్నియాకు చెందిన చార్ల్స్ డారో అనే ఆయన అని; కనిపెట్టి ‘పార్కర్ బ్రదర్స్’ అనే గేమ్ పబ్లిషర్స్‌కి 1935లో విక్రయించారని; అలా ఈ ‘మోనోపలీ’ బోర్డ్ గేమ్ ప్రఖ్యాతి చెందిందని ప్రపంచానికి ఒక పొరపాటు భావన ఉంది.
నిజానికి మోనోపలీ బోర్డ్ గేమ్‌ను కనిపెట్టింది అమెరికన్ గేమ్ డిజైనర్, రచయిత్రి ఎలిజబెత్ మ్యాగీ (1866–1948). చార్ల్స్ డారో కంటే 3 దశాబ్దాల ముందే.. ‘ది ల్యాండ్‌లార్డ్స్ గేమ్: యాంటీ–మోనోపలిస్ట్, మోనోపలిస్ట్’ అనే పేరుతో రెండు సెట్‌ల మోనోపలీ గేమ్‌ని ఎలిజబెత్ మ్యాగీ సృష్టించారు.
మోనోపలీ బోర్డ్ గేమ్‌లో ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను వ్యాపారంలో దివాలా తీయించటానికి, వ్యాపార ప్రపంచ జగదేక వీరుడిగా నిలవటానికి ఆస్తులను కొనుగోలు చేస్తూ, అమ్ముతూ, లాభాల కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తుంటారు. ఈ గేమ్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆడుతుంటారు. ఆటకు కనీసం ఇద్దరు ఉండాలి. 6 లేదా 8 మంది ప్లేయర్‌ల వరకు ఆడవచ్చు.
పేపర్ బ్యాగులు
అడుగు భాగం బల్లపరుపుగా ఉండి, పక్కకు వాలిపోకుండా స్థిరంగా నిలబడి ఉండేలా పేపర్ బ్యాగులను తయారు చేసే యంత్రానికి సృష్టికర్త నిజానికి మార్గరెట్ ఎలోయిస్ నైట్ (1838–1914) అనే అమెరికన్ మహిళ.
అయితే, చార్ల్స్ అన్నన్ అనే అతడు ఆమె కనిపెట్టిన పేపర్ బ్యాగ్ డిజైన్‌ను తస్కరించి తన పేరుతో పేటెంట్స్ సంపాదించాడు. మార్గరెట్ ఎలోయిస్ నైట్.. పేపర్ బ్యాగ్ యంత్రానికి మొదట చెక్కతో నమూనాను తయారు చేసి, దానికి ఒరిజినల్ వెర్షన్ కోసం (ఇనుప యంత్రం నమూనా) ఒక షాపుకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అన్నన్ ఆమె దగ్గరున్న పేపర్ బ్యాగ్ డిజైన్‌ను దొంగిలించాడు.
అన్నన్‌పై న్యాయ పోరాటం చేసి మరీ మార్గరెట్ తన పేటెంట్‌ను దక్కించుకోవలసి వచ్చింది. ఆమె తన 12వ యేటే ‘ఆటో–స్టాపర్’ మెషిన్‌ను కూడా కనిపెట్టారు. నేటి ఎలక్ట్రానిక్ గృహోపకరణాలలో; పారిశ్రామిక, వాణిజ్య పరికరాలలో ఆ ఆటో స్టాపర్ (దానంతటే ఆగిపోయే ఏర్పాటు) కీలకమైన పాత్రను నిర్వహిస్తోంది.
సెక్స్ క్రోమోజోమ్‌లు
అమెరికన్ మహిళా జన్యుశాస్త్రవేత్త నెట్టీ స్టీవెన్స్ (1861–1912) 1905లో సెక్స్ క్రోమోజోములను కనిపెట్టారు. అయితే ఆ ఘనతను మొదట ఆమె గురువు ఇ.బి.విల్సన్ దక్కించుకున్నారు.
పురుషుల్లోని లింగ నిర్ధారణ క్రోమోజోమ్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవటానికి నెట్టీ స్టీవెన్స్ పేడ పురుగులపై పరిశోధనలు చేస్తున్నప్పుడు... పుట్టే బిడ్డ ఆడా, మగా అనేది నిర్ణయించేది పురుషుల క్రోమోజోమ్‌లేనని ఆమె కనుగొన్నారు.
తల్లి అండంలో కేవలం ఎక్స్ క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి. తండ్రి శుక్రకణాల్లో ‘వై’, ‘ఎక్స్’ క్రోమోజోములు రెండూ ఉంటాయి. తండ్రిలో ‘వై’ క్రోమోజోమ్ తల్లిలోని ‘ఎక్స్’తో కలిస్తే మగబిడ్డ; లేదా తండ్రిలోని ‘ఎక్స్’– తల్లిలో ఉండే ‘ఎక్స్’తో కలిస్తే ఆడబిడ్డ పుడతారని నెట్టీ స్టీవెన్స్ కనిపెట్టారు.
నెట్టీ పరిశోధనను, మరికాస్త ముందు తీసుకువెళ్లటం వరకు మాత్రమే ఇ.బి.విల్సన్ పాత్ర పరిమితమై ఉన్నప్పటికీ అసలైన సృష్టికర్తగా ఆయనకే పేరు వచ్చింది.
విండ్‌షీల్డ్ వైపర్లు
1902లో, మేరీ ఆండర్సన్ (1866–1953) అలబామా నుండి న్యూయార్క్ నగరానికి కారులో ప్రయాణిస్తున్నారు. బాగా మంచు కురుస్తోంది. విండ్‌షీల్డుపై పడుతున్న ఆ మంచును మెత్తటి వస్త్రంతో తుడిచేందుకు డ్రైవర్ మాటిమాటికీ కారును రోడ్డు పక్కన ఆపవలసి వస్తోంది. అది చూసిన మేరీ ఆండర్సన్‌కు ఈ విండ్‌షీల్డ్ వైపర్‌ల ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనకు పేటెంట్‌ను దాఖలు చేశారు.
దురదృష్టవశాత్తూ ఆమె ఆవిష్కరణకు పెద్దగా ప్రాముఖ్యం లభించలేదు. ఇదీ ఒక ఇన్వెషనేనా అన్నారు. కొంతకాలం ఆమె పేటెంట్ గడువు ముగిసింది. తరువాత కొన్ని నెలల్లోనే అమెరికాలో ఎక్కడ చూసినా విండ్‌షీల్డ్ వైపర్‌లే! అంతేకాదు, విండ్‌షీల్డ్ వైపర్స్‌ను కనిపెట్టిన క్రెడిట్ రాబర్ట్ కియర్న్స్ అనే వ్యక్తికి దక్కింది!
మేరీ ఎలిజబెత్ ఆండర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆమెకు విస్తారంగా పాడి పంటల క్షేత్రాలు ఉన్నాయి. ద్రాక్ష తోటల్ని పెంచేవారు. నిరంతరం కారు ప్రయాణాలు చేస్తుంటారు. ఏమైనా.. విండ్‌షీల్డ్ వైపర్ సృష్టికర్త రాబర్ట్ కియర్న్స్ కాదని, మేరీ ఎలిజబెత్ అని త్వరలోనే ప్రపంచానికి నిజం తెలిసిపోయింది.
కేంద్రక విచ్ఛిత్తి
‘కేంద్రక విచ్ఛిత్తి’ని కనుగొన్నందుకు ఒట్టో హాన్ అనే జర్మనీ శాస్త్రవేత్తకు 1944లో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నిజానికి ఆ బహుమతి దక్కవలసింది ఆయన సహోద్యోగి లిజ్ మీట్నర్‌కు! కేంద్రక విచ్ఛిత్తికి (న్యూక్లియర్ ఫిషన్) సైద్ధాంతిక వివరణను అందించింది అసలు లిజ్ మీట్నరే. యురేనియంలో మహా శక్తి ఉన్నట్లు కూడా ఆమే కనిపెట్టారు.
ఒక పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ పరమాణు కేంద్రాలుగా విడిపోయే ప్రక్రియే కేంద్రక విచ్ఛిత్తి. రేడియో ధార్మిక వికిరణం కంటే ఎక్కువగా అత్యధిక స్థాయిలో కేంద్రక విచ్ఛిత్తిలో శక్తి విడుదల అవుతుందని లిజ్ మీట్నర్ కనుగొన్నారు. ఆమె అందించిన సహకారం వల్లనే ఒట్టో హాన్ నోబెల్ సాధించగలిగారు.
లిజ్ మీట్నర్ (1878–1968) ఆస్ట్రియన్–స్వీడిష్ అణు భౌతిక శాస్త్రవేత్త. వియన్నా విశ్వవిద్యాలయం నుండి భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ పొందిన రెండవ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. 1924–1948 మధ్య రసాయన శాస్త్రంలో 19 సార్లు, 1937–1967 మధ్య భౌతిక శాస్త్రంలో 30 సార్లు నోబెల్‌కు ఆమె నామినేట్ అయ్యారు.
గ్రీన్‌హౌస్ ప్రభావం
గ్రీన్‌హౌస్ ప్రభావం గురించి మాట్లాడేటప్పుడు, ఈ అద్భుతమైన విషయాన్ని కనుగొన్న వ్యక్తిగా బ్రిటిష్ శాస్త్రవేత్త జాన్ టిండాల్ పేరు తరచుగా ప్రస్తావనకు వస్తుంటుంది. అయితే, గ్రీన్‌హౌస్ ప్రభావాన్ని మొదట సిద్ధాంతీకరించి, దానిని రుజువు చేసింది నిజానికి అమెరికన్ మహిళా శాస్త్రవేత్త యునిస్ ఫూటే (1819–1888). విచారకరం ఏంటంటే – ఆమె కనిపెట్టిన ‘గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్’ గురించి వివరించటానికి ఆమెకు అనుమతి లభించలేదు. దాంతో ఆమె తన పరిశోధనల గురించి మాట్లాడాలని ఒక పురుష సహోద్యోగిని అడగాల్సి వచ్చింది.
1856లోనే యూనిస్ ఫూటే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్‌ను కనిపెట్టారు. కానీ 1861లో దానిని కనిపెట్టిన జాన్ టిండాల్‌కు ప్రాధాన్యం లభించింది. భూవాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ వంటి వాయువులు సూర్యుని వేడిని సంగ్రహించి భూమికి హితంగా ఉండేంత మోతాదులో మాత్రమే ఉష్ణోగ్రతను స్వీకరించి, మిగతా కిరణాలను వెనక్కు పంపే సహజ ప్రక్రియే గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్.


