నీదైతే ఎక్కడికెళ్లినా నీ దగ్గరకు వస్తుంది. నీది కాకపోతే ప్రపంచం మొత్తం వెతికినా తిరిగి రాదు.’ అన్నట్లు.. అచ్చం ఒక ఉంగరానికి జరిగింది. 1969లో న్యూయార్క్‌లోని సీడార్ బీచ్‌లో అల్ఫ్రెడ్ డి స్టెఫానో అనే వ్యక్తి ఒక రోజు ఈత కొడుతున్నప్పుడు, అతని విలువైన క్లాస్ రింగ్ జారి నీటిలో పడిపోయింది.
సముద్రంలో పడ్డ ఆ ఉంగరం, ఇక ఎప్పటికీ దొరకదని భావించి, దానికి మనసులోనే ఫుల్‌స్టాప్ పెట్టేసుకున్నాడు. కాని, కాలం మరో అద్భుతాన్ని దాచిపెట్టింది. దాదాపు 56 ఏళ్ల తర్వాత, డేవిడ్ ఓర్లొవ్‌స్కీ అనే మరో వ్యక్తి, మెటల్ డిటెక్టర్ పట్టుకుని బీచ్‌లో నిధి నిక్షేపాల కోసం వెతుకుతుండగా, అనుకోకుండా ఆ ఉంగరం అతని చేతికి చిక్కింది.
మొదట అది సాధారణ ఆభరణమేమోనని అనుకున్నాడు. కాని, దానిపై చెక్కి ఉన్న పేరు, కాలేజీ గుర్తు చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయానికి, అతని భార్య ‘నువ్వు నీ ఉంగరం కోల్పోతే, దొరికిన వారు తిరిగి ఇస్తే ఎంత ఆనందిస్తావు?’ అని ప్రశ్నించింది. భార్య మాటలు అతన్ని కదిలించాయి. వెంటనే, ఉంగరం అసలు యజమాని కోసం వెతకడం ప్రారంభించాడు.
అలా సోషల్ మీడియా సహాయంతో ఫేస్‌బుక్‌లో గాలించి, చివరికి డి స్టెఫానోకు ఆ ఉంగరం చేరేలా చేశాడు. దాదాపు ఆరు దశాబ్దాలుగా దాచుకున్న జ్ఞాపకం అకస్మాత్తుగా తిరిగి చేతిలోకి రావడంతో అతని కళ్లలో ఆనందబాష్పాలు వెల్లువెత్తాయి.
(చదవండి: నీటికి బదులు బీర్! స్పెషల్ హైడ్రేషన్ స్టయిల్..)


