ఒక్క రోజంతా నీరు తాగకుండా ఉంటే శరీరం మొత్తం డీహైడ్రేషన్ అయి, ఏ పని చేయలేం. కాని, అమెరికాకు చెందిన లోరీ మాత్రం ఎన్నో ఏళ్లుగా నీరే తాగడం లేదు. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం! జిమ్‌లో రెండుసార్లు ఎక్కువ శ్రమ చేసి ఆసుపత్రిలో చేరినా, ఆమె నిర్ణయం ఏమాత్రం మారలేదు. సాదాసీదా నీటి కంటే కాఫీ, బీర్, రుచికరమైన పానీయాలే తనకు ఇష్టమని చెప్పేసి, లోరీ నీటిని పూర్తిగా మానేసింది.
డాక్టర్లు దీన్ని ఒక మానసిక సమస్యగా చెప్తున్నారు. అందుకే ఆమె తనకంటూ ఓ ప్రత్యేకమైన హైడ్రేషన్ పద్ధతిని ఫిక్స్ చేసుకుంది. ఉదయం కాఫీతో మొదలు, మధ్యాహ్నం మరో కాఫీతో పాటు సాఫ్ట్ డ్రింక్స్, సాయంత్రం జిమ్ తర్వాత బీర్, రాత్రికి రెండు పుల్ల ఐస్‌క్రీమ్స్.. ఇదే ఆమె స్టయిల్.
వీటన్నింటికీ రోజుకి దాదాపు నూటయాభై డాలర్లు, అంటే పదమూడు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. మంచినీరు తాగితే ఇంత ఖర్చు అవసరం లేదని తెలిసినా, ‘ఇవి నాకు నీటికి మించిన రుచితో హైడ్రేషన్ ఇస్తున్నాయి’ అని ఆమె సమర్థించుకుంటోంది. ఈ విషయం సోషల్ మీడియాలో తెలిసి కొందరు షాక్ అయ్యారు, కొందరు నవ్వుకున్నారు. కానీ లోరీ మాత్రం తన ప్రత్యేక హైడ్రేషన్ స్టయిల్‌కి కట్టుబడి, తనదైన రీతిలో ఆనందంగా జీవిస్తోంది.
(చదవండి: బియ్యపు గింజంత కంప్యూటర్!)


