మూకుమ్మడిగా వెళుతున్న మహిళలు. (ఇన్‌సెట్‌లో)రోడ్డుపై పడేసిన మద్యం సీసాలు
బెల్టు షాపులపై మహిళల దాడి
జె.పంగులూరు: మద్యం మహమ్మారిపై మహిళలు ధ్వజమెత్తారు. అసురపాలనపై అపర కాళికలై దునుమాడారు. బెల్టుషాపులపై దాడి చేసి అక్రమంగా దాచిన మద్యాన్ని తీసుకొచ్చి నడివీధిలో తగలెట్టారు. ఇకపై మద్యం అమ్మితే ఖబడ్దార్ అని హెచ్చరించారు. బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మహిళామూర్తుల ధర్మాగ్రహానికి గ్రామస్తులంతా సంఘీభావం పలికారు. కోటపాడులో ఏడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు రేగుతున్నాయి.
పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. దీంతో పిల్లల భవిష్యత్తు నాశనమవుతోంది. ఈ దాష్టికాలను భరించలేని మహిళలంతా సోమవారం రాత్రి నడుంబిగించారు. ఊళ్లో బెల్టుషాపులు ఉండడానికి వీల్లేదని నిర్ణయించుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ఆధ్వర్యంలో దళితకాలనీలో సమావేశమై ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. సమీపంలో ఉన్న బెల్టుషాపులపైకి దూసుకెళ్లారు.
దాచి ఉంచిన మద్యం సీసాలను తీసుకొచ్చి నడివీధిలో తగలబెట్టారు. వీరి ధర్మాగ్రహానికి గ్రామస్తులు సంఘీభావం తెలిపారు. ఇకపై గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రమాదేవి మాట్లాడుతూ బీచ్‌లలో ఆడ, మగ మద్యం తాగితే అప్పుడు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని శాసనసభ స్పీకర్ ఆయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ప్రజల చేత మద్యం తాగించేందుకు ప్రభుత్వ పెద్దలే ముందుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


