2.4 కోట్ల కి.మి. పొడవు
తోక చుక్కగా మారనుందా?
ఆ ఆస్కారముంది: సైంటిస్టులు
మరిన్ని పరిశోధనలకు సిద్ధం
బుధుడు. సౌర వ్యవస్థలో అత్యంత బుల్లి గ్రహం. అంతేగాక సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండే గ్రహం కూడా. అయితే అది క్రమంగా చెదిరిపోతోందా? కొద్దికాలానికి గ్రహ లక్షణాలను కోల్పోయేలా ఉందా? ఆ అవకాశం లేకపోలేదు అన్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే బుధ గ్రహం ఉన్నట్టుండి తోకచుక్క లక్షణాలు ప్రదర్శిస్తోంది.
అవును! దానికి ఏకంగా 2.4 కోట్ల కిలోమీటర్ల పొడవున సాగిన తోక ఇప్పుడు సైంటిస్టు లోకాన్ని అబ్బురపరుస్తోంది. సోడియం వాయువులతో కూడిన అది దూరదూరాల దాకా తన వెలుగులను విరజిమ్ముతోంది. అమెరికాలోని వర్జీనియకు చెందిన స్టీవెన్ బెలావియా అనే సైంటిస్టు ఈ తోక తాలూకు ఫోటోను తొలిసారిగా తీసి ప్రపంచానికి చూపాడు. అది జరిగింది కూడా బుధవారమే (డిసెంబర్ 3న) కావడం.మరో విశేషం.
సూర్యునితో సాన్నిహిత్యం వల్లే...
బుధ గ్రహానికి ఇలా ఒక తోక పుట్టుకు రావచ్చని అప్పుడెప్పుడో 1980లోనే సైంటిస్టులు అత్యంత కచితత్వంతో కూడిన అంచనా వేయడం విశేషం. సూర్యునికి అత్యంత దగ్గరగా ఉండటమే తోక పుట్టుకకు కారణమని సైంటిస్టులు వివరిస్తున్నారు. బుధుని తాలూకు అత్యంత పలుచనైన వాతావరణంపై సూర్యుని రేడియో ధార్మికత నురగ ప్రభావం చూపుతూ ఉంటుంది. ఫలితంగా బుధాణువులు దాన్నుంచి విడివడుతూ తీవ్ర వేగంతో. అంతరిక్షంకేసి దూసుకు పోతుంటాయి. కొన్నేళ్లుగా ఇవి అతి పొడవున తోక ఆకృతి దాలుస్తున్నాయి. ఈ తోక ఉనికి నిజానికి 2001లోనే నిర్ధారణ అయింది. కాకుంటే దాన్ని చూడటం మాత్రం నేటిదాకా సాధ్యపడలేదు.
అత్యంత ప్రకాశవంతంగా...
ప్రస్తుతం బుధుడు పరిహేళి క్రమంలో ఉన్నాడు. ఈ దశలో ప్రతి గ్రహమూ తన పరిభ్రమణ క్రమంలో సూర్యునికి అతి సమీపానికి వెళ్తుంది. దాంతో ఈ 2.4 కోట్ల కి.మీ. పొడవైన తోకచుక్క అతి స్పష్టంగా, ప్రకాశవంతంగా కనిపిస్తోందిప్పుడు. దాని ప్రకాశంలో మార్పుచేర్పులను నాసా మెసెంజర్ ఉపగ్రహ కొన్నేళ్లుగా స్పష్టంగా గమనిస్తూ వస్తోంది. అంతేగాక దానికి సంబంధించిన కీలక వివరాలను కూడా అందించింది. డిసెంబర్ 9న ఈ తోక మరింత ప్రకాశవంతంగా కనిపించనుందని సైంటిస్టులు తెలిపారు. ఎంతగా అంటే, ప్రస్తుతం కనిపిస్తున్న దానికంటే ఏకంగా పదింతల వెలుగుతో మెరిసిపోనుందట!
సైంటిస్టులు సిద్ధం
ఆ సమయంలో, అంటే డిసెంబర్ 9న బుధునిపై, దాని తోకపై ఇంకొన్ని పరిశోధనలు చేసి, మరిన్ని కీలక వివరాలు, విశేషాలు వెలుగులోకి తెచ్చేందుకు సైంటిస్టులు ఇప్పటి నుంచే అన్ని పరికరాలతో సిద్ధమవుతున్నారు! ఎందుకంటే గ్రహానికి, తోక చుక్కకు ఉన్న మౌలిక భేదాలనే బుధుని తాలూకు ఈ పొడవాటి తోక సవాలు చేస్తోంది. బహుశా బుధుడు ముక్కలు చుక్కలుగా విడిపోయి ఒక పెద్ద తోక చక్కగా మారే ఆస్కారం కూడా లేకపోలేదన్నది కొందరి సైంటిస్టుల జోస్యం. అదేంతవరకూ ఫలిస్తుందో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే!
– సాక్షి, నేషనల్ డెస్క్


