భారతదేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం. ఇక్కడి ప్రజలు ప్రతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు, వీధులన్నీ రంగురంగుల విద్యుత్ దీపాలతో, చర్చిలు ప్రార్థనలతో, బేకరీలు ఘుమఘుమలాడే కేకులతో కళకళలాడుతుంటాయి. దేశ రాజధాని ఢిల్లీ నుండి సముద్ర తీర ప్రాంతమైన గోవా వరకు, ప్రతి నగరం తనదైన శైలిలో క్రిస్మస్ వేడుకలకు స్వాగతం పలుకుతుంది.
ఢిల్లీ, ముంబై మహానగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కన్నాట్ ప్లేస్ ప్రాంతం పెద్ద క్రిస్మస్ చెట్లు, మెరిసే లైట్లతో పండుగ ధగధగలాడుతోంది. ఇక్కడ షాపింగ్ చేయడంతో పాటు, సేక్రెడ్ హార్ట్ కేథడ్రల్‌లో జరిగే అర్ధరాత్రి ప్రార్థనల్లో పాల్గొనడం ఒక అద్భుత ఆధ్యాత్మిక అనుభవం అందిస్తుందని అంటారు. ముంబై నగరంలో బాంద్రా వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. మౌంట్ మేరీ బసిలికా చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మందిని పాల్గొంటారు. మెరైన్ డ్రైవ్ వెంబడి చల్లని గాలిలో నడుస్తూ, క్వీన్స్ నెక్లెస్ కాంతులను వీక్షించడం పర్యాటకులకు మరుపురాని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
గోవా,పాండిచ్చేరి తీరాల్లో..
దేశంలో క్రిస్మస్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది గోవా. ఇక్కడి పురాతన చర్చిలైన బాసిలికా ఆఫ్ బోమ్ జీసస్, సే కేథడ్రల్‌లు పండుగ వేళ అద్భుతమైన అలంకరణలతో మెరిసిపోతాయి. బీచ్‌లలో జరిగే రాత్రి పార్టీలు, సంగీత కచేరీలు, బాణసంచా వేడుకలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటాయి. ఫ్రెంచ్ సంస్కృతి మమేకమై ఉండే పాండిచ్చేరిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. వైట్ టౌన్‌లోని ఫ్రెంచ్ వాస్తుశిల్ప భవనాలు, 'చర్చి ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ఏంజిల్స్'లో జరిగే ప్రార్థనలు.. యూరప్‌లో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని పలువురు చెబుతుంటారు.
కోల్‌కతా,బెంగళూరులలో..
కోల్‌కతాలో క్రిస్మస్‌ను అత్యంత వేడుకగా జరుపుకుంటారు. పార్క్ స్ట్రీట్ ఒక పెద్ద కార్నివాల్‌లా మారుతుంది. ఎక్కడ చూసినా సంగీతం, లైట్లు, రకరకాల ఆహార స్టాళ్లు కనిపిస్తాయి. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌లో జరిగే కరోల్ గానం వినడానికి రెండు చెవులూ చాలవు. ఇక గార్డెన్ సిటీ బెంగళూరులో బ్రిగేడ్ రోడ్, ఎంజీ రోడ్‌లు విద్యుత్ దీపాల వెలుగులతో మెరిసిపోతాయి. చర్చి స్ట్రీట్‌లోని కేఫ్‌లు ప్రత్యేకమైన క్రిస్మస్ మెనూలతో పర్యాటకులను ఆహ్వానిస్తాయి. పురాతన సెయింట్ మేరీస్ బసిలికాలో జరిగే వేడుకలు నగరపు పాత కాలపు వైభవాన్ని గుర్తుచేస్తాయి.
ఇది కూడా చదవండి: ఈసీఐ ‘ఆపరేషన్ క్లీన్’: ఆ రాష్ట్రాల్లో గగ్గోలు!


