వచ్చే ఏడాది(2026) జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్)ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరగడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం.. అధికార-ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.
తమిళనాడులో 97 లక్షల పేర్లు తొలగింపు
తమిళనాడులో మొదటి దశ సవరణ తర్వాత ఏకంగా 97 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియకు ముందు 6.41 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ఇప్పుడు 5.43 కోట్లకు పడిపోయింది. తొలగించిన వారిలో 27 లక్షల మంది మరణించిన వారు కాగా, 66 లక్షల మంది రాష్ట్రం విడిచి వెళ్లిన వలసదారులు, మరో 3.4 లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. రాజధాని చెన్నైలోనే అత్యధికంగా 14.25 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం.
కోయంబత్తూరులో భారీ మార్పులు
ప్రతిపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు జిల్లాలో 6.5 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఇక్కడ ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఏఐడీఎంకే, ఒకటి బీజేపీ చేతిలో ఉన్నాయి. అలాగే దిండిగల్‌లో 2.34 లక్షలు, కాంచీపురంలో 2.74 లక్షల పేర్లను తొలగించారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేస్తున్న కరూర్ జిల్లాలో కూడా 80 వేల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి.
బెంగాల్‌లో 58 లక్షల ఓట్లపై వేటు
పశ్చిమ బెంగాల్‌లో కూడా పరిస్థితి ఇదేవిధంగా ఉంది. అక్కడ విడుదలైన ముసాయిదా జాబితా ప్రకారం 58.20 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో 24.16 లక్షల మంది మరణించిన వారు, 19.88 లక్షల మంది వలస వెళ్లిన వారు కాగా, 12.20 లక్షల మంది గల్లంతైనట్లు గుర్తించారు. దాదాపు 1.38 లక్షల పేర్లను బోగస్ ఎంట్రీలుగా ఈసీఐ నిర్ధారించింది. ఫిబ్రవరి 2026 వరకు ఇక్కడ ప్రక్రియ కొనసాగనుంది.
మమతా బెనర్జీ ఆగ్రహం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను ‘బీజేపీ-ఈసీ కుట్ర’గా అభివర్ణించారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, తమ రాష్ట్రం నుండి ఎవరినీ బయటకు పంపనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో 40 మంది అధికారులు మరణించారని ఆమె ఆరోపించారు. అయితే, మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని అక్రమ వలసదారుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
తమిళనాడులో భిన్న స్వరాలు
తమిళనాడులో అధికార డీఎంకే, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే, ప్రధాన ప్రతిపక్షం ఏఐడీఎంకే మాత్రం ఈ ప్రక్రియకు మద్దతు తెలపడం విశేషం. నకిలీ ఓటర్ల తొలగింపు అవసరమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పేర్కొన్నారు. డీఎంకే ఈ విషయంలో అనవసర నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు.
గుజరాత్‌లో 73.73 లక్షల పేర్లు తొలగింపు
గుజరాత్ రాష్ట్రంలో 2025 అక్టోబర్ 27న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది. ప్రధాన ఎన్నికల అధికారి హరిత్ శుక్లా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 73.73 లక్షల పేర్లను తొలగించారు. ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు 508 లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య, సవరణల అనంతరం ప్రస్తుతం 434 లక్షలకు చేరింది. తొలగించిన పేర్లలో అత్యధికంగా 40.25 లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా, 18.07 లక్షల మంది మరణించిన వారు, 9.69 లక్షల మంది గైర్హాజరైన వారు, 3.81 లక్షల నకిలీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 85.50 శాతం మంది ఓటర్ల నుండి (4.34 కోట్ల మంది) గణన ఫారాలను సేకరించి ఈ ప్రక్షాళన చేపట్టారు. ఓటర్లు తమ పేర్ల నమోదు లేదా సవరణల కోసం 2026 జనవరి 18 వరకు అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు.తుది ఓటర్ల జాబితా 2026 ఫిబ్రవరి 17న ప్రచురితమవుతుంది.
బీహార్‌లో ‘సర్’ సాగిందిలా..
బీహార్‌లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ (సర్) ప్రక్రియ 2025 జూన్ 24న ప్రారంభమై, 2025 సెప్టెంబర్ 30 నాడు తుది జాబితా ప్రచురణతో ముగిసింది. ఈ ప్రక్రియలో మొత్తం 69 లక్షల మంది పేర్లను జాబితా నుండి తొలగించగా, 21.5 లక్షల మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు. దీనివల్ల నికరంగా ఓటర్ల సంఖ్య సుమారు 47.5 లక్షలు తగ్గి, తుది జాబితా 742 లక్షలుగా ఉంది. ముఖ్యంగా ఆగస్టు 1న విడుదల చేసిన ముసాయిదాలోనే 65.6 లక్షల పేర్లను తొలగించగా, ఆ తర్వాత జరిగిన రెండు నెలల క్షేత్రస్థాయి పరిశీలనలో మరో 3.66 లక్షల పేర్లను తొలగించి, కొత్త దరఖాస్తులను ఆమోదించారు. ఈ ప్రక్రియలో మహిళా ఓటర్ల పేర్లు అత్యధికంగా తొలగించబడటం, సరిహద్దు జిల్లా అయిన గోపాల్‌గంజ్‌లో గరిష్టంగా కోత పడటం చర్చనీయాంశంగా మారింది.
ఈసీఐ క్లారిటీ.. కోర్టు సమర్థన
ఓటర్ల జాబితాను కాలానుగుణంగా సవరించే రాజ్యాంగబద్ధమైన అధికారం తమకు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. బీహార్‌లో కూడా ఇదే తరహా వివాదం తలెత్తగా, సుప్రీంకోర్టు ఈసీఐ నిర్ణయాన్ని సమర్థించింది. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరును కూడా అన్యాయంగా తొలగించబోమని, ఫిర్యాదులు చేసేందుకు జనవరి 18 వరకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం తమిళనాడు, బెంగాల్‌తో పాటు యూపీ, కేరళ, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తమిళనాడు ఓటర్లకు అభ్యంతరాల కోసం జనవరి 18 వరకు సమయం ఇవ్వగా, బెంగాల్‌లో తుది జాబితా ఫిబ్రవరి 14, 2026న విడుదల కానుంది. ఎన్నికల వేళ ఈ ‘ఓట్ల వేట’ ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో, ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: ‘బీజింగ్‌కు సాధ్యం.. ఢిల్లీకి అసాధ్యమా?’.. చైనా ‘మాస్టర్ క్లాస్’


