‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం | Chandrababu government has not given a single new pension for the past 19 months | Sakshi
Sakshi News home page

‘దివ్యాంగ’ ప్రభుత్వం! అభాగ్యులతో చెలగాటం

Dec 28 2025 4:33 AM | Updated on Dec 28 2025 5:32 AM

Chandrababu government has not given a single new pension for the past 19 months

19 నెలలుగా కొత్తగా ఒక్క పింఛన్‌ ఇవ్వని చంద్రబాబు సర్కారు

కాళ్లు.. చేతులు.. కళ్లు లేని దివ్యాంగులు, ఒంటరి మహిళలపైనా కనికరం కరువు 

కొత్త పింఛన్లు ఇవ్వకపోగా.. ఉన్నవీ తొలగింపుతో పేదల గగ్గోలు 

ఉన్న పింఛన్లలోనూ 5 లక్షలకు పైగా తొలగింపు 

వైఎస్‌ జగన్‌ సర్కార్‌లో 27 లక్షలకు పైగా కొత్త పింఛన్లు

అర్హత ఉన్నప్పటికీ ఎండమావిగా మారిన సదరం సర్టిఫికెట్‌  

కష్టపడి తెచ్చుకున్నా.. పింఛన్‌కు దరఖాస్తు చేసుకునే దారేలేని వైనం 

తహసీల్దార్, కలెక్టర్‌లకు ఎన్నిమార్లు విన్నవించినా స్పందన శూన్యం 

వెబ్‌సైట్‌ ఓపెనయ్యేది ఎప్పుడు.. దరఖాస్తు చేసేదెప్పుడు.. పెన్షన్‌ వచ్చేదెప్పుడు? 

ఊరూరా అర్ధాకలితో కళ్లు కాయలు కాసేలా అభాగ్యుల ఎదురుచూపులు  

ఆదుకునే మనసు లేని పాలనలో సామాజిక బాధ్యతకు కొత్త అర్థం 

ఇందుకు ప్రతి నెలా తగ్గుతున్న లబ్దిదారుల సంఖ్యే నిదర్శనం 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు కొత్త పింఛన్లకు అవకాశం

రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు సామాజిక బాధ్యతను గాలికొదిలేసింది. కొత్తగా ఒక్క పింఛన్‌ ఇవ్వకపోగా, ఉన్న పింఛన్లలో నెల నెలా కోత పెడుతోంది.. నోటీసులతో బెంబేలెత్తిస్తూ అర్హులైన లబ్దిదారులను కుదిస్తోంది.. పేదరికంలో మగ్గిపోతూ.. నడవలేని దుస్థితిలో.. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని ‘కనికరించండయ్యా.. మా దీనస్థితిని చూడండయ్యా.. పింఛన్‌ ఇప్పించండయ్యా..’ అంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. జిల్లా సర్వోన్నతాధికారులైన కలెక్టర్లు అభాగ్యుల వినతి పత్రం తీసుకోవడం తప్ప ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉండిపోతున్నారు.. ‘ఇది సర్కారు పెద్దల నిర్ణయం.. మా చేతిలో ఏమీ లేదు’ అని చెప్పలేక పోతున్నారు.. వెరసి అభాగ్యులు ప్రతి వారం కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

జగన్‌ సీఎం అయ్యే నాటికి పింఛన్లు 39 లక్షలు
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఇచ్చిన పింఛన్లు  66,34,372
ప్రస్తుతం ఇస్తున్న పింఛన్లు : 61,24,605
బాబు ప్రభుత్వంలో కోత : 5,09,767

రూపాయికి, అర్ధ రూపాయికి కార్పొరేట్లకు భూములు  కట్టబెడుతున్న చంద్రబాబు సర్కారు పేదల పింఛన్‌ ‘ఆశ’పై మాత్రం నీళ్లు చల్లుతూనే ఉంది. కనీసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అత్యంత దారుణంగా వ్యవహరిస్తుండటం బహుశా దేశంలో ఒక్క మన రాష్ట్రంలో తప్ప మరెక్కడా ఉండి ఉండదు. పైకి మాత్రం వాట్సాప్‌ గవర్నెన్స్‌ అంటూ గొప్పలకు కొదవ లేదు.. ఇలా వాట్సాప్‌లో మెసేజ్‌ చేస్తే అలా సమస్య పరిష్కరించేస్తామంటూ ఊదరగొడుతోంది. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో ఊరూరా కన్నీటి గాధలే కనిపించాయి.  

నాడు పింఛన్‌ వచ్చింది..   నేడు ఏం పాపం చేశాను?
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం చెట్టుపొదిలాం గ్రామానికి చెందిన గడే తేజకు రెండు కాళ్లు కదలవు. మాటలు సరిగా రావు. వైద్యులు 98 శాతం వైకల్యం ఉందని ధ్రువపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో దివ్యాంగుల పింఛన్‌ వచ్చేది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం.. ఉన్న పింఛన్‌ను సైతం తొలగించింది. ఎందుకు తొలగించారో చెప్పే వారు లేరు. ఎన్నిమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదు. నేను ఏం పాపం చేశాను? 
ఎందుకు నా పింఛన్‌ ఆపేశారని బాధితుడు కన్నీటి పర్యంతం అవుతున్నాడు.

సాక్షి ప్రతినిధి, విజయనగరం/సాక్షి నెట్‌వర్క్‌: రోజులు గడుస్తున్నాయి.. వయసు పెరుగుతోంది.. 60.. 61.. 62.. కానీ ప్రభుత్వం నుంచి పింఛన్‌ రాలేదు. 60 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్‌ అందిస్తాం అని ఎన్నికలప్పుడు చంద్రబాబు చెప్పిన మాటలు నీటి మూటలే అని తేటతెల్లమైంది.. పోనీ, దివ్యాంగులనైనా కనికరిస్తున్నారా.. అంటే అదీ లేదు.. ఒంటరి మహిళల ఊసే లేదు.. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వంలో అయితే పింఛన్‌ తీసుకుంటున్న వారు ఎవరైనా చనిపోతేనే.. ఆ స్థానంలో తిరిగి మరొకరికి పింఛన్‌ ఇచ్చే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. దరఖాస్తు చేసుకునే అవకాశమే లేకుండా చేశారు. 

సచివాలయంలో అడిగితే వాళ్లకు ఏ సమాచారం లేదని చెబుతున్నారు. ఆన్‌లైన్లో ఎప్పుడు దరఖాస్తు చేయాలో తెలియడం లేదు. దానికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారో అంతకంటే తెలియదు. ఊళ్లలో వృద్ధులు మాత్రమే కాదు కదల్లేని దివ్యాంగులు సైతం పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఓట్ల కోసం మాటలు చెప్పినంత సులువుగా చంద్రబాబు పని చేయడంలేదని, పూట గడవక అల్లాడిపోతున్నా ఆదుకోవడం లేదంటూ వాపోతున్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో.. ప్రతి ఊళ్లోనూ పింఛన్‌ గాధలు చూస్తుంటే కంట నీరొస్తోంది.    

పింఛన్లలో కోతలే కోతలు
ఇటు కొత్త పింఛన్‌ ఇవ్వకపోగా గతంలో వైఎస్‌ జగన్‌ హయాంలో పెన్షన్లు అందుకున్న లక్షల మందిని ప్రభుత్వం ఈ పథకానికి దూరం చేసింది. సూపర్‌ సిక్స్‌ పేరిట ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. తర్వాత తన నిజ స్వరూపం చూపుతున్నారు. రకరకాల కారణాలతో పెన్షన్ల సంఖ్యను కుదిస్తూ వస్తున్నారు. 2019లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చే నాటికి 39 లక్షలు మాత్రమే పింఛన్లు ఉన్నాయి. 2024 మార్చిలో ఎన్నికల నాటికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 66,34,372 మందికి పింఛన్లు ఇచ్చేది. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో 27లక్షలకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు సర్కారు పింఛన్లను 61,24,605కే పరిమితం చేసింది. అంటే ఏకంగా 5,09,767 పెన్షన్లను నిర్ధాక్షిణ్యంగా కత్తిరించింది. కొత్తగా ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వకపోగా, విధివంచితులైన దివ్యాంగుల పట్ల కనీసం జాలి, దయ చూపకుండా అమానవీయంగా వారి పెన్షన్లను కూడా కట్‌ చేశారు.. చేస్తున్నారు. రీ–వెరిఫికేషన్‌ పేరిట వారికి నరక యాతన చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో అర్హులైన వారందరికీ పింఛన్‌ అందేది. 

అర్హులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఎప్పటికప్పుడు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి, మంజూరు చేసేది. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు ఏర్పాటు చేసి, సర్టిఫికెట్లు మంజూరు చేసింది. 2024 మార్చి నాటికి 8,13,316 మంది దివ్యాంగులకు పెన్షన్లు ఇచ్చింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం రకరకాల వెరిఫికేషన్ల పేరిట వీరి సంఖ్యను నెల నెలా తగ్గిస్తోంది. 

రీ–వెరిఫికేషన్‌ అంటూ వారిని సదరం పేరిట మళ్లీ మళ్లీ ఆస్పత్రులకు తిప్పుతోంది. తొలగించిన వారితో పాటు రెండు మూడు లక్షల మంది కొత్తగా పెన్షన్‌ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. చంద్రబాబును నమ్మి మోసపోయామని ఊరూరా ప్రజలు ఇప్పుడు వాపోతున్నారు.  

మంచానికే పరిమితమైనా అందని పింఛన్‌
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జనపూడికి చెందిన ఇతని పేరు కాకర అబ్బులు. వయసు 58 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం జామాయిల్‌ చెట్టు నరుకుతుండగా చెట్టు మీద పడటంతో మెడ విరిగిపోయింది. మెడకు శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటుండగా, నడుం నొప్పి ప్రారంభమైంది. నడుము దెబ్బతిందని వైద్యులు ధ్రువీకరించారు. ఇప్పటికీ మంచానికే పరిమితమయ్యాడు. ‘నా కుమారుడు శాంతి ప్రసాద్‌ 10వ తరగతితో చదువు ఆపేసి కూలి పనులకు వెళుతున్నాడు. నాకు సదరం సర్టిఫికెట్‌ మంజూరైనా పింఛన్‌ మంజూరు కాలేదు.’ అని అబ్బులు  ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కడుపు కొట్టడమే.. 
ఇతని పేరు శ్రీనివాసులు. శ్రీ సత్యసాయి జిల్లా పేరూరుకు చెందిన ఇతనికి 2010లో జరిగిన ప్రమాదంలో వెన్నెముక చితికిపోయింది. అప్పటి నుంచి మంచం, వీల్‌ చైర్‌కే పరిమితం. ఎటూ కదల్లేడు. గత 15 సంవత్సరాల్లో వైద్య ఖర్చుల కోసం తన పది ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాడు. 90 శాతం వైకల్యం ఉందని వైద్యులు సర్టిఫికెట్‌ జారీ చేశారు. 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇతనికి రూ.6 వేల పింఛన్‌ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం రీ–వెరిఫికేషన్‌ పేరుతో దివ్యాంగ శాతాన్ని 77కు తగ్గించేసింది. దీంతో పూర్తి వైకల్యం కలిగిన బాధితులకు వచ్చే రూ.15 వేల పింఛన్‌కు అర్హత లేకుండా పోయింది. ఈనెల 22న కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు తన గోడు విన్నవించుకున్నాడు.

19 నెలలుగా ఎదురుచూపులు 
ఈమె పేరు అబ్బోల్ల లక్ష్మీదేవి. శ్రీ సత్య సాయి జిల్లా నల్లచెరువు మండలం చెరువు వాండ్లపల్లి గ్రామం. ఈమె రెండేళ్ల కిందట గ్రామంలో కూలి పనులకు వెళ్లి వేరుశనక్కాయలు ఆడిస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కుడి చేయి మిషన్‌లో ఇరుక్కొని కట్‌ అయ్యింది. ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్న తర్వాత సదరం సర్టిఫికెట్‌ తీసుకుంది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 19 నెలలైంది. అన్ని అర్హతలున్నా పెన్షన్‌ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఆన్‌లైన్‌లో పెన్షన్‌కు సంబంధించిన సైట్‌ ఓపెన్‌ కాలేదని అధికారులు వెనక్కి పంపిస్తున్నారని వాపోతోంది.

నా గోడు పట్టించుకునే వారేరీ? 
శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొగిడియా పుట్టుగకు చెందిన బొగిడియా లక్ష్మి కూలి పని చేస్తుండగా ఏడాదిన్నర క్రితం ప్రమాదవశాత్తు కుడి కాలు కోల్పోయింది. ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదని, తనకు పింఛన్‌ మంజూరు చేసి ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతోంది. కొబ్బరి తోటల్లోకి వెళ్లి ఇదివరకట్లా పనులు చేయలేక పోతోంది. పూరింట్లో ఉంటున్న ఈమె.. తన ఇద్దరు పిల్లలను పోషించుకోవడానికి అగచాట్లు పడుతోంది. తనకు 84 శాతం దివ్యాంగురాలిగా గుర్తింపు సర్టిఫికెట్‌ ఇచి్చనా.. ఈ ప్రభుత్వం తనకు ఎందుకు పింఛన్‌ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడని విలపిస్తోంది.  

అర్హత ఉన్నా పింఛన్‌ ఇవ్వడం లేదు 
విజయనగరం జిల్లా రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన సత్యం, సీతమ్మ దంపతులది నిరుపేద కుటుంబం. సెంటు భూమి కూడా లేదు.  దివ్యాంగుడైన లక్ష్మణ అనే కుమారుడు ఉన్నాడు. అంతు చిక్కని వ్యాధితో పక్షవాతానికి గురికావడంతో అతని రెండు కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. మంచానికే పరిమితం అయ్యాడు. ఆ వృద్ధులు బతకడమే కష్టం అనుకుంటే వారికి బరువుగా మారాడు. లక్ష్మణకు 2024లో సదరం ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఆ తర్వాత పింఛన్‌కు దరఖాస్తు చేశారు. ఎదురు చూపులే తప్ప ఫలితం లేదు. తామెంత కాలం బతికి ఉంటామో తెలియదని, తమ తదనాంతరం తమ కొడుకు పరిస్థితి ఏమిటని వారు విలపిస్తున్నారు.  

వెన్నుపూస దెబ్బతిన్నా..  
డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామనగరువు పితానివారిపాలెనికి చెందిన నాగవరపు శ్రీనివాసరావుకు వెన్నుపూస దెబ్బతింది. కాళ్లు పని చేయడం లేదు. మంచానికే పరిమితమయ్యాడు. 81 శాతం దివ్యాంగత్వం ఉందని సదరం సరిఫ్టికెట్‌ ఇచ్చారు. పింఛన్‌కు ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం లేదు. శ్రీనివాసరావును తీసుకుని ఆయన భార్య సత్యవతి కలెక్టర్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావును సైతం కలిశారు. అయినా ఫించన్‌ మంజూరు కాలేదు.  

ఒక్క అడుగేయలేదన్నా కనికరం లేదు  
తిరుపతి జిల్లా పాకల మండలం రమణయ్యగారిపల్లెకి చెందిన హేమలత, రమణయ్యకు ఇద్దరు పిల్లలు. పెద్ద బిడ్డ హని్వత (6) మానసిక వైకల్యంతో మంచానికే పరిమితం. అడుగు తీసి అడుగు వేయలేదు. అత్యంత పేద కుటుంబం. సెంటు భూమి లేదు. వ్యవసాయ కూలి పనులకు వెళుతుంటారు. పింఛన్‌ డబ్బులు వస్తే బిడ్డ వైద్య ఖర్చులకు సాయంగా ఉంటుందని ఏడాదిగా పింఛన్‌ కోసం తిరుగుతూనే ఉన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తాము మొరపెట్టుకున్నా.. పింఛన్‌ దరఖాస్తుకు అనుమతులు రాలేదని చెబుతున్నారు.

రెండేళ్ల నుంచి తిరుగుతున్నా... 
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం అమలాపురానికి చెందిన రావి సత్యవతి భర్త రెండేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి వితంతు పింఛన్‌ మంజూరు చేయాలని సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ‘జగన్‌ బాబు ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు గ్రామంలో మాలాంటోళ్లకు పింఛన్లు ఇచ్చేవోళ్లు, నాఖర్మేటో భర్త పోయి ఏ ఆసరా లేకుండా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు పింఛన్‌ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాను. పింఛన్‌ రావాలంటే నేను కూడా పోవాలేమో. చంద్రబాబు వచ్చేక కొత్తగా ఒక్కరికీ పింఛన్‌ ఇవ్వలేదంట’ అని వాపోతోంది.  

ఈమెకు అర్హత లేదా?
పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం పాంచాలి గ్రామానికి చెందిన జయశ్రీ పుట్టుకతోనే మానసిక దివ్యాంగురాలు. పూర్తిగా మంచానికే పరిమితం. ఆమెతో పాటు.. ఒకరు కచి్చతంగా తోడు ఉండాల్సిందే. నెలవారీ మందులకే రూ.వేలల్లో ఖర్చు అవుతోంది. మంచానికే పరిమితమైన వారికి రూ.15 వేలు సామాజిక పింఛను అందిస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. జయశ్రీకి మాత్రం కేవలం రూ.6 వేలు అందిస్తోంది. తమ బిడ్డ పరిస్థితిని పరిశీలించి పింఛన్‌ మొత్తాన్ని పెంచాలని తల్లిదండ్రులు రమణమ్మ, వెంకటరావు అధికారులు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకుంటూనే ఉన్నారు. గత సోమవారం కూడా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

ఎంత తిరిగినా పట్టించుకోవడంలేదు
‘మేడం.. మా నాన్న మహబూబ్‌బాషాకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్‌ మంజూరు కోసం సదరం క్యాంప్‌ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్‌ కటింగ్‌ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొ­చ్చాను. 

ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్‌ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్‌బాషా గత మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్‌ మంజూరు చేయాలని వేడుకున్నాడు. 

ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి పింఛన్‌ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్‌ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది.

తోడ్పాటు కోసం ఎదురుచూపు 
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అనంతవరం గ్రామానికి చెందిన పెరికల శకుంతల ఏడాదిన్నర క్రితం ఉన్న పళంగా పక్షవాతం బారిన పడింది.  కాలకృత్యాలు సైతం మంచంలోనే తీర్చుకోవాల్సిన పరిస్థితి. పక్షవాతం రోగులకు ఇచ్చే పింఛన్‌ రూ.15 వేలకు నోచుకోలేదు. సదరం క్యాంపుల చుట్టూ తిరిగి తిరిగి ఎట్టకేలకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు ధృవీకరణ పత్రం తెచ్చుకున్నా పింఛన్‌ అందడం లేదు. డైపర్లు, నెలవారి మందుల కోసం నెలకు రూ.8 వేలు ఖర్చు చేస్తున్న ఆ కుటుంబానికి ప్రభుత్వ తోడ్పాటు అందడం లేదు.  

నా కాలు చూడండయ్యా.. 
ఇతని పేరు గంటస్వామి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. మధుమేహంతో రెండేళ్ల క్రితం కాలు తీసేశారు. చేతి వేలు కూడా తీసేశారు. పని చేసుకోలేడు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నా, దాని ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో పూట గడవడానికి ఒక్కోసారి అడుక్కోవాల్సి వస్తోంది. ‘ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి 2024లో సదరం ధ్రువపత్రం తెచ్చుకున్నాను. 75 శాతం వికలాంగత్వం ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చారు. పింఛన్‌ కోసం వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం నుండి అనుమతి రాలేదని చెప్తున్నారు. నాలాంటి వికలాంగుల కోసం అనుమతులు వచ్చే వరకు వేచి ఉంటే నా బతుకు ఏమైపోవాలి? నా కాలు వైపు ఓసారి చూడండయ్యా’ అని వేడుకుంటున్నాడు.  

ఎన్నిమార్లు వినతులివ్వాలి? 
ఈమె పేరు కె.నళిని. చిత్తూరు జిల్లా నగరి మండలం ఎం.కొత్తూరు గ్రామం. భర్త, ముగ్గురు పిల్లలతో నిశ్చింతగా సాగుతున్న ఈమె జీవితంలోకి కష్టం ఒక్కసారిగా వచ్చిపడింది. గ్రానైట్‌ క్వారీలో పని చేస్తూ కుటుంబ పోషణ భారం చూసుకునే ఈమె భర్త అనారోగ్యంతో గత ఏడాది మృతి చెందాడు. దీంతో పిల్లల పోషణ భారం ఆమెపై పడింది. పెద్దగా ఆస్తులు లేవు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకోవడంతో తాపీ పనుల్లో కూలీగా చేరింది. వితంతు పింఛను కోసం ఎన్నిమార్లు వినతి పత్రాలు ఇస్తున్నా పింఛన్‌ మంజూరు కాలేదని కన్నీటిపర్యంతమవుతోంది.    

కాళ్లరిగేలా తిరుగుతున్నా.. 
ఈమె పేరు వంతాల రాధిక. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి పంచాయతీ పరిధిలోని పనసపుట్టు గ్రామం. భర్త జోగేశ్వరరావు 2025 మార్చి 22న అనారోగ్యంతో మృతి చెందాడు. ముగ్గురు ఆడ పిల్లలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. తిండి గింజల కోసం వ్యవసాయమే ఆధారం. వితంతు పింఛన్‌ సౌకర్యం కల్పించాలని 10 నెలల నుంచి గ్రామ సచివాలయం, డుంబ్రిగుడ మండల పరిషత్‌ కార్యాలయాలకు కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కనికరించలేదు.  

దరఖాస్తే తీసుకోవడం లేదు 
ఇతని పేరు గద్దల రామకృష్ణ. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు మండలం కోకిలంపాడు. వ్యవసాయ కూలీ. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కూలి పనికి వెళ్లి మెట్లపై నుంచి కిందపడిపోయాడు. వెన్నెముక విరిగిపోయింది. రెండుసార్లు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. ఉన్నదంతా వైద్యానికే ఖర్చు అయింది. అయినా పూర్తిగా కోలుకోలేదు. వీల్‌ చైర్‌కు పరిమితమయ్యాడు. 

87 శాతం వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం కూడా తీసుకున్నాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళితే గ్రామ సచివాలయానికి వెళ్లాలని చెప్పారు. దరఖాస్తు కూడా తీసుకోకుండానే వెనక్కు పంపారు. గ్రామ సచివాలయంలో అడిగితే ఆన్‌లైన్‌లో సైట్‌ ఓపెన్‌ కావడం లేదని చెబుతున్నారు. ఎన్నిసార్లు తిరిగినా అదే సమాధానం వస్తోందని బావురుమంటున్నాడు.  

వైకల్యం కనిపించడం లేదేమో! 
నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఎల్లావత్తులకు చెందిన ఇట్టే భూపాల్‌కు ప్రమాదవశాత్తు ఏడాదిన్నర క్రితం కుడికాలు పోయింది. ఒంటి కాలితో అవçస్థలు పడుతున్నాడు. ఏదైనా అత్యవసర పని నిమిత్తం కొద్ది దూరం వెళ్లాల్సి వస్తే కర్రల సాయంతో నడుస్తున్నాడు. తనకు పింఛన్‌ మంజూరు చేయాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఫలితం లేదు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి ఆ గ్రామానికి వెళ్లగా ఆయన వద్దకు వెళ్లి వికలాంగత్వ ధ్రువపత్రం, పోగొట్టుకున్న కాలిని చూపించి తనకు పింఛన్‌కు అర్హత ఉన్నప్పటికీ కొత్త పింఛన్‌  మంజూరు చేయడం లేదని విలపించాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement