హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
విజయనగరం అర్బన్: పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు వంటి ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) విమర్శించింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేరకపోవడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనమని జిల్లా కమిటీ సభ్యులు పేర్కొన్నారు. విజయనగరం మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాలలో సంఘ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు అధ్యక్షతన జిల్లా ఆర్ధిక కార్యదర్శి ఎస్‌ఎస్ దొర, జిల్లా కార్యవర్గ సభ్యులతో కలిసి మంగళవారం నిర్వహించిన అత్యవసర సమావేశంలో ధర్నా కార్యాచరణను ఖరారు చేశారు. రాష్ట్ర సంఘం ప్రకటించిన మూడు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా రెండవ దశలో ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జిల్లా స్థాయి ధర్నా నిర్వహిస్తామని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉద్యోగ వర్గాలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా వేతన సవరణ, డీఏల చెల్లింపు అత్యవసరమైనప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం ఉపాధ్యాయులను రోడ్డెక్కే పరిస్థితికి నెట్టిందని ఆరోపించారు.
తక్షణమే అమలు చేయాల్సిన మేనిఫెస్టో హామీలు....
● 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటించాలి.
● పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు గ్రాట్యూటీని వెంటనే మంజూరు చేయాలి.
● ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను తక్షణమే చెల్లించాలి.
● సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలి.
● 2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, పోలీసులు, ఇతర శాఖల ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలి.
● ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద జరిగే రెండవ దశ ధర్నాకు స్పందికపోతే మూడవ దశగా ఈ నెల 25న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జిల్లా కమిటీ హెచ్చరించింది. ఈ నెల 13న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నాకు రాష్ట్ర, జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సి లర్లు, మండల, నగరంపాలక, పురపాలక సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
టీచర్ల సహనానికి పరీక్ష
13న కలెక్టరేట్ ముట్టడి
స్పందించకపోతే ఈనెల 25న
‘చలో విజయవాడ’
అత్యవసర సమావేశంలో ఎస్టీయూ
జిల్లా కమిటీ తీర్మానం


