వేగావతిలో సైఖతం..!
బొబ్బిలి: బొబ్బిలిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. రాజుల అండదండలతో వేగావతి నదిలోని ఇసుకను తోడేస్తూ కాసులవేట సాగిస్తున్నారు. వీరికి చట్టాలు, నియమనిబంధనలతో పనిలేదు. ప్రజలకు తాగునీరు అందదన్న ఆందోళన వారిలో కనిపించదు. కనిపించిన ఇసుకను ఖతం చేయడమే వారి పని. పారాది వద్ద వేగావతి నదిలో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుపుతున్నారు. అలజంగిలో ఒకేసారి పదుల సంఖ్యలో ట్రాక్టర్లకు ఇసుకను లోడ్‌చేసి తరలిస్తున్నారు. బాడంగి మండలం పాల్తేరు, భీమవరం, గొల్లాది ప్రాంతాల్లోనూ నదిని గుల్లచేస్తున్నారు. రామభద్రపురం మండలంలోని కొట్టక్కి వద్ద గల వంతెన కింద నుంచే ఇసుకను నిత్యం తోడుకు పోతున్నారు. దీనివలన కొత్త వంతెన బలహీన పడుతుందని జనం బెంగపడుతున్నా తవ్వకాలు మాత్రం ఆపడంలేదు.
దొరికితేనే కేసులు...
ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొరపాటున ఇసుక ట్రాక్టర్‌ను అధికారులు పట్టుకున్నా ప్రజాప్రతినిధి నుంచి ‘మనవాడే వదిలేయ్’ అన్న ఫోన్ సమాచారంతో చర్యలు తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్డీఓ జేవీఎస్‌ఎస్ రామమోహనరావు పర్యటించే సమయంలో పలుసార్లు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధించారు. స్థానిక అధికారులు మాత్రం కళ్లముందే నదిని గుల్లచేస్తున్నా పట్టించుకోవడంలేదంటూ స్థానికులు విమర్శిస్తున్నారు. ఇసుక తవ్వకాలను స్థానిక తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా తరచూ తనిఖీలు చేస్తున్నామని, ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని జరిమానా విధిస్తున్నట్టు తెలిపారు.
అలజంగి వద్ద వేగావతి నదిలో ఇసుక తవ్వకాలు
రాత్రీపగలు తేడాలేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు
ప్రమాదకరంగా మారుతున్న వంతెనలు, బావులు
మిన్నకుంటున్న యంత్రాంగం!
వేగావతిలో సైఖతం..!


