breaking news
pension fund
-
ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బు.. ఇక ఒకే పోర్టల్!
క్లెయిమ్ చేయకుండా ఖాతాల్లోనే మిగిలిపోయిన డిపాజిట్లు, పెన్షన్ ఫండ్, షేర్లు, డివిడెండ్లను క్లెయిమ్ చేసుకోవడంలో ప్రజలకు సహాయకరంగా ఉండేలా రిజర్వ్ బ్యాంక్‌తో కలిసి సమగ్ర పోర్టల్‌ను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం నాగరాజు తెలిపారు. త్వరలోనే దీన్ని ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.అన్క్లెయిమ్డ్ అసెట్స్ కోసం ఉద్గాం పేరుతో ఆర్బీఐ, మిత్ర పేరిట మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, బీమా భరోసా పేరుతో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ వేర్వేరు పోర్టల్స్ నిర్వహిస్తున్నాయి. ’మీ డబ్బు, మీ హక్కు’ పేరిట అన్క్లెయిమ్డ్ అసెట్స్‌పై అక్టోబర్ 4న కేంద్ర ఆర్థిక మంత్రి దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఆర్బీఐ, ఐఆర్డీఏఐ, సెబీ, ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ (ఐఈపీఎఫ్ఏ)తో కలిసి ఆర్థిక సేవల విభాగం దీన్ని ప్రారంభించింది. ఇప్పటికే రూ. 1,887 కోట్ల మొత్తాన్ని సిసలైన యజమానులు లేదా వారి నామినీలకు అందజేసినట్లు నాగరాజు వివరించారు. అవగాహన లేకపోవడం లేదా అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకపోవడం వల్ల చాలా ఖాతాల్లో బీమా పాలసీ క్లెయిమ్‌లు, బ్యాంక్ డిపాజిట్లు, డివిడెండ్లు, షేర్లు, మ్యుచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే నిధులు పెద్ద మొత్తంలో ఉండిపోతున్నాయి. వీటిని అన్–క్లెయిమ్డ్ అసెట్స్‌గా పరిగణిస్తున్నారు. -
పెన్షన్ ప్లాన్లపై యువతలో అవగాహన పెరగాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాధారణంగా 25–40 ఏళ్ల వయస్సు వారు పెన్షన్ అనే మాట వినడానికి పెద్దగా ఇష్టపడకపోయినప్పటికీ, పదవీ విరమణ అనంతరం ఆర్థికంగా ఎంతగానో ఉపయోగకరంగా ఉండే దీని ప్రాధాన్యత గురించి యువత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పీఎఫ్ఆర్డీఏ చైర్పర్సన్ ఎస్.రామన్ తెలిపారు. ప్రస్తుతం 55 కోట్ల మంది పైగా వర్క్‌ఫోర్స్ ఉండగా, కేవలం 10 కోట్ల మందే సంఘటిత రంగంలో ఉన్నారని శుక్రవారమిక్కడ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మిగతా 30–40 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే ఉంటున్నారని, వారందరినీ కూడా పెన్షన్ ఫండ్ పరిధిలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత నెలకొందని ఆయన పేర్కొన్నారు. పెన్షన్ ఫండ్లు గణనీయంగా రాబడులు అందిస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్థిక భద్రతకు అధిక రాబడుల కోసం పోంజీ స్కీముల్లాంటి వాటి వలలో పడకుండా సురక్షితమైన పెన్షన్ ఫండ్‌ను ఎంచుకోవడం శ్రేయస్కరమని వివరించారు. మరోవైపు గిగ్ వర్కర్లకు కూడా సామాజిక భద్రతను కల్పించే విధంగా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ తెలిపారు. -
ఎన్పీఎస్, ఏపీవై ఆస్తులు రూ.6.99 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల పరిధిలోని ఆస్తుల విలువ రూ.6.99 లక్షల కోట్లను అధిగమించినట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ఆర్డీఏ) మంగళవారం ప్రకటించింది. 2022 జనవరి 1 నాటికి ఈ రెండు పథకాల పరిధిలో ఇన్వెస్టర్లకు చెందిన ఆస్తులు రూ.6,99,172 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. 2021 మార్చి 31 నాటికి ఈ ఆస్తులు రూ.5,78,025 కోట్లుగా ఉండడం గమనార్హం. 9 నెలల్లో 20 శాతం వృద్ధి చెందాయి. అసంఘటిత రంగంలోని వారికి ఉద్దేశించిన ఏపీవైలోని ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.19,807 కోట్లుగా ఉన్నాయి. ఎన్పీఎస్ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల పింఛను నిధులతోపాటు.. ప్రైవేటు రంగం ఉద్యోగుల పింఛను నిధులు ఎక్కువగా ఉంటాయి. అలాగే, పౌరులు ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్ పరిధిలోని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ ఉద్యోగుల ఆస్తులు 2022 జనవరి 1 నాటికి రూ.3,52,217 కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తులు రూ.2,11,656 కోట్లుగా ఉన్నాయి. కార్పొరేట్ రంగం ఉద్యోగుల ఆస్తులు రూ.82,190 కోట్లుగా ఉన్నట్టు పీఎఫ్ఆర్డీఏ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పౌరుల విభాగంలోని ఆస్తులు రూ.28,657 కోట్లుగా ఉన్నాయి. ఈ రెండు పథకాలను పీఎఫ్ఆర్డీఏ పర్యవేక్షిస్తుంటుంది. -
ఐపీవోల్లోనూ పెన్షన్ ఫండ్ మేనేజర్ల పెట్టుబడులు
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ (ఐపీవోలు), ఎన్ఎస్ఈ–200 కంపెనీల్లో కూడా పెన్షన్ ఫండ్ల మేనేజర్లు (పీఎఫ్ఎం) ఇన్వెస్ట్ చేసేందుకు త్వరలో అనుమతులు ఇవ్వనున్నట్లు పింఛను రంగ నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ పీఎఫ్ఆర్డీఏ చైర్మన్ సుప్రతిమ్ బందోపాధ్యాయ్ వెల్లడించారు. రెండు, మూడు రోజుల్లో కొత్త నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు, ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు జారీ చేసే డెట్ సాధనాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పీఎఫ్‌ఎంలను అనుమతించే అవకాశాలు ఉన్నాయని బందోపాధ్యాయ్ వివరించారు. ప్రస్తుతం పీఎఫ్ఎంలు తమ కార్పస్‌లోని ఈక్విటీ విభాగం నిధులను రూ. 5,000 కోట్ల పైచిలుకు మార్కెట్ క్యాప్ ఉండి, ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ సెగ్మెంట్లో ట్రేడయ్యే స్టాక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతులు ఉన్నాయి. దీనివల్ల ఫండ్ మేనేజర్లు మెరుగైన రాబడులు అందించే అవకాశాలు పరిమితంగా ఉంటున్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ఎంలు.. ఐపీవోలు, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్లు, ఆఫర్ ఫర్ సేల్ మొదలైన వాటిల్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే, ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ట్రేడయ్యే టాప్ 200 స్క్రిప్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. ఈక్విటీలపరంగా ఎదురయ్యే రిస్కులను తగ్గించేందుకు తగిన నిబంధనలు ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులు మెరుగైన రాబడులు అందిస్తున్న నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా ఈక్విటీ పెట్టుబడుల వైపే మొగ్గు చూపుతానని బంద్యోపాధ్యాయ్ తెలిపారు. -
మార్కెట్లోకి పీఎస్‌యూల నగదు నిల్వలు!
బడ్జెట్లో ప్రకటించే అవకాశం... న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలకోసం ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)ల వద్దనున్న మిగలు నగదు నిల్వలను మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్)లలో ఇన్వెస్ట్ చేసేలా అనుమతించాలని ప్రభుత్వానికి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ సూచించింది. దీంతోపాటు పెన్షన్ ఫండ్స్ అన్నింటికీ ఒకేవిధమైన పన్నువిధానాన్ని వర్తింపజేయాలని కూడా కోరింది. ప్రధానంగా భారతీయ మార్కెట్లు విదేశీ పెట్టుబడులపై మరీ అధికంగా ఆధారపడకుండా చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడులతో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టేందుకు వీలుగా పీఎస్‌యూల మిగులు నిల్వలను ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే ప్రతిపాదనను సెబీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అంశాన్ని ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోందని... వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సంబంధిత సీనియర్ అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు పెన్షన్ పథకాలను ప్రవేశపెట్టే ఎంఎఫ్లకు పన్ను ప్రయోజనాలు, ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) వద్దనున్న రూ.5 లక్షల కోట్లకు పైగా మూల నిధిలో కొంత మొత్తాన్ని స్టాక్ మార్కెట్ షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని కూడా సెబీ కోరుతోంది. మరోపక్క, కార్పొరేట్లు కూడా తమ సొంత పెన్షన్ ఫండ్లను ప్రారంభించాలని, వీటిలోని కొన్ని నిధులను స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా వెచ్చించాలనేది సెబీ సూచన. దేశంలో స్టాక్ మార్కెట్లకు విదేశీ నిధులే ప్రధాన ఇంధనంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ-ఫ్లోట్ మార్కెట్ క్యాప్(ప్రమోటర్లవద్దనున్న షేర్లు కాకుండా ఇన్వెస్టర్ల వద్దనున్న స్టాక్స్ విలువ)లో సగానికి సగం విదేశీ ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ)వద్దే ఉండటం దీనికి నిదర్శనం. అంతేకాదు భారత్ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసే నిధుల్లో దాదాపు సగభాగం వివిధ దేశాల్లోని పెన్షన్ ఫండ్స్ నుంచి తరలివస్తున్నాయి. భారత్‌లో మాత్రం పెన్షన్ నిధులను స్టాక్స్‌లో పెట్టుబడిగా వెచ్చించేందుకు అనుమతులు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం నవరత్న, మినీరత్న కేంద్ర పీఎస్‌యూలకు మాత్రమే ప్రభుత్వ రంగ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. అలాకాకుంగా మొత్తం పీఎస్‌యూలన్నింటినీ తమ మిగులు నగదు నిల్వలను ఫండ్స్‌లో పెట్టుబడులకు అనుమతించాలనేది సెబీ వాదన. దేశంలో మొత్తం 250కిపైగా కేంద్ర పీఎస్‌యూలు ఉన్నాయి. వీటివద్దనున్న నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం సుమారు రూ.3 లక్షల కోట్లుగా అంచనా.


