పింఛనైనా ఇప్పించండి.. లేదా కిడ్నీలు అమ్ముకునేందుకైనా అనుమతివ్వండి
కాళ్లు పని చేయని తల్లిదండ్రుల పోషణ భారమైంది
రోడ్డు ప్రమాదంలో నా కాళ్లకూ గాయం
నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన ఓ అభాగ్యుడి ఆవేదన
‘మేడం.. మా నాన్న మహబూబ్‌బాషాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్లు, చేతులు చచ్చుబడ్డాయి. పింఛన్ మంజూరు కోసం సదరం క్యాంప్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ స్పందించడం లేదు. మా అమ్మ హమిదాబీకి ఏడాది నుంచి టీబీ సోకడంతో రెండు కాళ్లు పని చేయక మంచం పట్టింది. గతంలో నాకు రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో రాడ్లు వేశారు. అయినా అతి కష్టంగా ఇన్నాళ్లూ పాలిష్ కటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ఇక నాకు ఓపిక సరిపోవడం లేదు మేడం.. మా అమ్మా నాన్నలకు పింఛన్ అయినా ఇప్పించండి.. లేదా నా కిడ్నీలు అమ్ముకుని మా అమ్మనాన్నలను పోషించుకోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అంటూ నంద్యాల జిల్లా దొర్నిపాడుకు చెందిన అన్వర్‌బాషా మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు.
కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి పింఛన్ మంజూరు చేయాలని వేడుకున్నాడు. ఎంపీడీఓ సావిత్రి అతని నుంచి అర్జీ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పింఛన్ మంజూరుకు కృషి చేస్తామన్నారు. కాగా, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్తగా ఒక్కరికి కూడా పింఛన్ మంజూరు చేయలేదని, కనీసం ఇలాంటి వారిపట్ల అయినా కనికరం చూపడం లేదనే విషయం అక్కడ చర్చకు వచ్చింది.
– దొర్నిపాడు


