అంబటి కుటుంబసభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ జగన్
చంద్రబాబు సర్కారు అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిప్పులు
తిరుమల శ్రీవారి పట్ల చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి.. ప్రశ్నిస్తున్న వారిపై భౌతిక దాడులకు పురిగొల్పుతావా చంద్రబాబూ?
లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ సిట్ చార్జిషీట్‌లో స్పష్టంగా తేల్చినా నిస్సిగ్గుగా ఎదురుదాడేనా?
అంబటి, జోగి ఇళ్లపై విధ్వంసకాండ, నిప్పు పెట్టడం దారుణం
పోలీసుల సమక్షంలోనే యథేచ్ఛగా దాడుల పర్వం
ఇప్పుడు తప్పులు చేస్తున్న ఎవరినీ వదిలిపెట్టం
వచ్చేది మా ప్రభుత్వమే.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం
అన్నీ విచారణ చేయిస్తాం.. కోర్టు బోను ఎక్కిస్తాం
చంద్రబాబు లాంటి దిగజారిన నేత ప్రపంచంలోనే ఉండరు
సీబీఐ సిట్ చార్జిషీట్‌లో వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి పేర్లు లేవంటే క్లీన్ చిట్ ఇచ్చినట్లే కదా..
గుంటూరులో అంబటి కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చిన వైఎస్ జగన్
కచ్చితంగా ప్రతిఘటన..
ఇలాంటివి మళ్లీ జరిగితే మాత్రం చూస్తూ ఊరుకునేది ఉండదు. దానికి కచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది. అవసరమైతే రాష్ట్రవ్యాప్త బంద్‌కి కూడా పిలుపునిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే అడుగులు ఇంకా వేగంగా పడతాయి. ఇష్యూస్ పెద్దవి అవుతాయని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నా. ఈ ఘటనలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేస్తున్నాం. సుప్రీంకోర్టు తలుపులు కూడా తడతాం. అన్నిరకాల పోరాటాలు చేస్తాం.
– వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
తనకు కావాల్సిన వారిని నియమించుకుని..
చంద్రబాబు తనకు కావాల్సిన కొంతమందిని మాత్రమే సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలు, డీఐజీలుగా నియమించుకున్నారు. ఎస్పీలు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు. బిహార్లో ఏం జరుగుతోందో తెలియదు కానీ రాష్ట్రంలో వీరందరితో చంద్రబాబు జంగిల్ రాజ్ పాలన సాగిస్తున్నారు. దాదాపు 200 మంది సీఐలు, ఎస్సైలు, డీఎస్పీలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. అలా రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలన సాగుతోంది.
అలా అనుకుంటే బాబు మూర్ఖుడే!
వైఎస్సార్ సీపీపై ఈ రకంగా దాడులు చేస్తే కార్యకర్తలు భయపడతారని చంద్రబాబు అనుకుంటే ఆయన కన్నా మూర్ఖుడు ఇంకొకరు లేనట్టే. బంతిని ఎంత బలంగా నేలకేసి కొడితే అంతకన్నా నాలుగింతలు బలంగా పైకి లేస్తుందన్నట్లుగా.. మా కార్యకర్తలు చంద్రబాబు ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేస్తారు.
- మీడియాతో వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు జంగిల్ రాజ్‌ను నడుపుతూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న చంద్రబాబు ఆరోపణల్లో నిజం లేదని దేశంలోనే ప్రఖ్యాత ల్యాబ్‌లు ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ నిర్థారిస్తూ రిపోర్టులు ఇచ్చినా.. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్‌లో పొందుపరిచినా.. పాపభీతి లేకుండా, తప్పు ఒప్పుకోకుండా చంద్రబాబు ఎదురు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. చేసిన తప్పులకు లెంపలు వేసుకోవాల్సింది పోయి దీనిపై ప్రశ్నిస్తుంటే భౌతిక దాడులు, విధ్వంసం, అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. గుంటూరులో టీడీపీ గూండాల చేతిలో ధ్వంసమైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిని, కార్యాలయాన్ని బుధవారం వైఎస్ జగన్ పరిశీలించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ జగన్ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం
అబద్ధాలతో ఫ్లెక్సీలు..
తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు, సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన తరువాత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ తమ తప్పులకు లెంపలు వేసుకుని శ్రీవేంకటేశ్వరస్వామివారిని, ప్రజలను క్షమాపణ కోరాల్సిందిపోయి.. అంతా కూడబలుక్కుని మళ్లీ అవే అబద్ధాలతో గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. తప్పుడు సమాచారాలతో, కులమతాలను రెచ్చగొట్టే విధంగా, అబద్ధాలతో ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఇదే చంద్రబాబు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ఎన్నికలప్పుడు బాండ్లు ఇచ్చి అబద్ధాలతో మోసగించారని మేం కూడా ఫ్లెక్సీలు పెడితే ఒప్పుకుంటారా?
ఇది హత్యాయత్నం కాదా..? కుట్రలో భాగం కాదా?
ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే సాయంత్రం 5 గంటల నుంచి అర్థరాత్రి వరకు జరిగాయి. పోలీసుల సమక్షంలోనే ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇల్లు, ఆఫీసు మొత్తం తగలబెట్టారు. ఇంట్లో అద్దాలు, సామగ్రిని, ఆఫీసులో ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఇంట్లో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా లోపలికి వచ్చి ధ్వంసం చేశారు. ఇది హత్యాయత్నం కాదా..? పోలీసులు దగ్గరుండి మరీ ఈ కుట్రలో భాగం కాలేదా? పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ఈ మాదిరిగా జరిగేదా? ఇక్కడి నుంచి డీజీపీ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. ఎంత మంది డీఎస్పీలు, సీఐలు లేరు..? మంగళగిరిలో పోలీసు బెటాలియన్ కూడా ఉంది. కనీసం ఫోన్ చేస్తే కూడా పోలీసులు స్పందించలేదు.
మా పార్టీ సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ తదితరులు ఇంటెలిజెన్స్ డీజీ, ఎస్పీ, ఐజీ, ఇతర అధికారులు, చీఫ్ సెక్రటరీ ఆఫీసులకు ఫోన్లు చేస్తే స్పందించలేదు. మరి ఇది కుట్రలో భాగంగా కాదా? సాయంత్రం ఐదు గంటల నుంచి ఒంటి గంట దాకా విధ్వంసం చేశారు. ఇది ధర్మమేనా? న్యాయమేనా? ఇంతటితో ఆగకుండా ఆ రాత్రి రాంబాబు అన్నను అరెస్టు చేశారు. చంద్రబాబును తిట్టాడని కేసు పెట్టి అరెస్టు చేశారు. చంద్రబాబుని తిట్టినందుకు రాంబాబును అరెస్టు చేసినప్పుడు.. మరి రాంబాబు ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించి, ఐదు కార్లను ధ్వంసం చేసి, అద్దాలన్నీ పగలగొట్టి, ఆఫీసుకు నిప్పంటించడం అంతా ఎమ్మెల్యే, ఆమె భర్త సమక్షంలో జరిగితే వారివీుద ఏం యాక్షన్ తీసుకున్నారు? సింపుల్‌గా స్టేషన్ బెయిలిచ్చి పంపేశారు.
అంబటి మీడియా సమక్షంలో వివరణ ఇచ్చారు. జరిగిన దానికి క్షమాపణ కూడా కోరారు. అయినా ఆయన ఇంటిపై దాడి చేశారు. అసలు మీరు మనుషులేనా? ఇది జంగిల్‌రాజ్ కాదా? రాంబాబును అక్రమంగా అరెస్టు చేయడమే కాదు.. అర్థరాత్రి దాటిన తరువాత ఆయన్ను నల్లపాడు స్టేషన్‌లో ముగ్గురు సీఐలు దారుణంగా హింసించి వేధించారు. ఓ మాజీ మంత్రి పట్ల ఆ విధంగా వ్యవహరించడం, టార్చర్ చేయడం ఏం న్యాయం? మరి ఇది జంగిల్‌రాజ్ కాకపోతే మరేమిటి? మాజీ మంత్రి అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్... విలువలున్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా నల్లపాడు సీఐ వంశీ, పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు ఆయన్ను తీవ్రంగా దూషించి కొట్టారు. ఇదంతా చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని అనుమానం కలుగుతోంది. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. 
అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులు...!
మరుసటి రోజు జోగి రమేష్ ఇంటిపై దాడి! అక్కడా మళ్లీ పోలీసుల సమక్షంలోనే. అక్కడ ఏకంగా పెట్రోల్ బాంబులు. బాటిళ్లలో పెట్రోల్ పోసి వాటిని ఇంట్లోకి విసిరారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు విధ్వసం సృష్టించారు. దాదాపు 300–400 మంది పోగయ్యారు. వారంతా అక్కడికి వచ్చేటప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. పోలీసుల సమక్షంలో అదంతా జరుగుతున్నా చూస్తుండిపోయారు. పోలీసుల సమక్షంలోనే జోగి రమేష్ ఇంటికి నిప్పంటించారు.
పోలీసుల సమక్షంలోనే..
అంతకు ముందు రోజు విడదల రజిని గుడిలో పూజ చేసుకుని వస్తుంటే ఆమెను అడ్డగించి తిట్టారు. దుర్భాషలాడుతూ పోలీసుల సమక్షంలోనే ఆమెపై దాడికి యత్నించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తిరిగి ఆమె మీదే కేసు పెట్టారు. అది కూడా ఏమని? ఆమె గుడికి వెళ్లి వారందరిపై అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారని! మాట్లాడటానికి హద్దూ పొద్దూ ఉండాలి! ఇది జంగిల్ రాజ్ కాదా? బొల్లా బ్రహ్మనాయుడు అన్న చేసిన పాపం ఏమిటి..? చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్‌కు జ్ఞానోదయం కలగాలని కోరుతూ పూజ చేయటానికి ఆయన గుడికి బయలుదేరారు. దారిలో ఆయన మీద అటాక్ చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలోనే జరిగింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది.
అసలు తప్పు చేసింది బాబే
అసలు తప్పు చేసింది చంద్రబాబు. తప్పుడు ఆరోపణలు చేసిందీ చంద్రబాబే. అవి తప్పుడు ఆరోపణలనీ దేవుడు మొట్టికాయలు వేసినా.. ఏకంగా సీబీఐ చార్జిషీట్‌లోనే చెప్పినా.. కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు నెయ్యిపై క్లీన్ చిట్ ఇస్తే... దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందిపోయి చంద్రబాబు చేస్తున్నదేమిటి? ప్రతి విషయంలోనూ దుర్మార్గమైన రాజకీయాలే! సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అని ఎన్నికలప్పుడు మాట ఇచ్చారు. ఇంటింటికీ బాండ్లు ఇచ్చి పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంతెంత వస్తుందో చెబుతూ సంతకాలతో సహా హామీ ఇచ్చారు. మీ ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.36 వేలు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? ఇదిగో మీకు రూ.15 వేలు. మీ ఇంట్లో రైతులు ఉన్నారా? ఇదిగో మీకు రూ.26 వేలు. మీ ఇంట్లో చిన్నమ్మలు, పెద్దమ్మలు 55 ఏళ్ల వయసులో ఉన్నారా? వాళ్లకు రూ.48 వేలు అంటూ ప్రజలను మోసం చేశారు. సూపర్ సిక్స్, సెవెన్ అమలు చేశామంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. చంద్రబాబు చేస్తున్నది తప్పని, మోసమని ఎవరైనా ప్రశ్నిస్తే.. కేసులు పెట్టి జైలుకు పంపుతున్నాడు. చివరకు పిల్లలని కూడా చూడకుండా సోషల్ మీడియా యాక్టివిస్టులపై గంజాయి కేసులు పెట్టి జైలుకు పంపి వారి కెరీర్ నాశనం చేస్తున్నాడు.
బాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే!
చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే.. చేసేవన్నీ మోసాలే! టీడీపీ సైన్యానికి లాటరీలో ప్రైవేటు మద్యం షాపులన్నీ కట్టబెడతాడు. ఏకంగా ఎమ్మెల్యేలు దగ్గరుండి ప్రతి గ్రామంలో ఆక్షన్ పాడుతూ బెల్టు షాపులు నిర్వహిస్తున్నారు. లిక్కర్ షాపుల పక్కనే ఇల్లీగల్ పర్మిట్ రూములు నడుపుతూ పెగ్గులతో అమ్ముతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావడం లేదు. అవి పక్కదోవలో చంద్రబాబుకింత... ఎమ్మెల్యేల కింత... వారి మాఫియా సైన్యానికింత.. అని లూటీ పద్ధతిలో పంచుకుంటున్నారు. ప్రతి గ్రామంలో ఒకటి, రెండు కాదు. పది వరకు బెల్టు షాపులున్నాయి. లిక్కర్ ఎమ్మార్పీ కన్నా ఎక్కువకు అమ్ముతున్నారు. అది సరిపోదన్నట్లు ఏకంగా ప్రతి ఐదు బాటిళ్లకు ఒకటి నకిలీ. వీళ్లే కుటీర పరిశ్రమను పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి అమ్ముతున్నారు. ఆ కల్తీ లిక్కర్ తాగి ఇంజనీరింగ్ విద్యార్థులు నలుగురు చనిపోయారు.
నకిలీ లిక్కర్‌ను టీడీపీ నాయకులే తయారు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. తంబళ్లపల్లెలో టీడీపీ తరఫున పోటీచేసిన జయచంద్రారెడ్డి కల్తీ లిక్కర్ తయారు చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు దొరికాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నదంతా ఇదే. ఎక్సైజ్ అధికారులకు, జయచంద్రారెడ్డికి వాటాలు పంచుకోవడంలో తేడాలొచ్చి దొరికిపోతే మా నాయకుడు జోగి రమేష్‌ను ఈ కేసులో అక్రమంగా ఇరికించారు. ఒకపక్క రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీ నాయకులతో కలిసి మా పార్టీకి చెందిన జోగి రమేష్ కల్తీ లిక్కర్ తయారు చేయడం సాధ్యమేనా? వీళ్లు నకిలీ లిక్కర్ తయారు చేసి చంద్రబాబు తీసుకొచ్చిన బెల్ట్ షాపుల్లో జోగి రమేష్ అమ్ముతున్నాడని అక్రమ కేసు పెట్టారు. నకిలీ, కల్తీ లిక్కర్ తయారు చేసేది వారే! బెల్ట్ షాపులు తీసుకొచ్చిందీ వారే! వాటిలో కల్తీ లిక్కర్ అమ్మకాలు చేసేదీ వారి మనుషులే! కానీ కేసు మాత్రం జోగి రమేష్ మీద పెట్టి జైలుకు పంపారు.
విచారణ చేయిస్తాం... వడ్డీతో చెల్లిస్తాం
ఇప్పటికే రెండేళ్లు గడిచిపోయాయి. కళ్లు మూసి తెరిచేలోపు మరో మూడేళ్లు గడిచిపోతాయి. అప్పుడు వచ్చేది మా ప్రభుత్వమేనని ఖచ్చితంగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, ఆయనకు కొమ్ము కాస్తున్న ఇతర పార్టీ నాయకులకు, కొంతమంది పోలీసు అధికారులకు కూడా చెబుతున్నా.. ఎల్లకాలం ఇలాగే అన్యాయం చేస్తుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వీరికి మొట్టికాయలు పడతాయి. రేపు మా ప్రభుత్వం వచ్చాక ఈ అరాచకాల్నంటి మీదా విచారణలు చేయిస్తాం. వడ్డీతో సహా చెల్లిస్తాం. అందర్నీ బోన్లలో నిలబెట్టి సాక్ష్యాధారాలతో వారి యూనిఫాంలు విప్పిస్తాం. ఈ దారుణాల్లో భాగస్వాములైన కూటమి నాయకులు ఎవరున్నా వారిని జైలుకు పంపించి బాధితులకు న్యాయం చేసి తీరుతామని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.
మా కార్యకర్తలూ ఇలాగే స్పందిస్తే..
రాష్ట్రంలో విషపు విత్తనాలు నాటుతున్నారు. ఈ సంస్కృతిని ఇప్పటికైనా ఆపండి. ఈ విషపు విత్తనాలు, కూటమి నాయకులు చేస్తున్న అన్యాయాల కారణంగా గ్రామ స్థాయి నుంచి ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త, నాయకుడు దెబ్బతిని ఉన్నారు. ఈ విషపు విత్తనాలు పెరిగి పెద్దవై చెట్టుగా మారినప్పుడు, రేప్పొద్దున్న మా ప్రభుత్వం వచ్చినప్పుడు మా నాయకులు, కార్యకర్తలు ఇలాగే స్పందిస్తే మీకు ఏం జరుగుతుందో ఆలోచన చేసుకోవాలని చంద్రబాబుని గట్టిగా హెచ్చరిస్తున్నా.
అంబటి నివాసంలో టీడీపీ మూకల దాడిలో ధ్వంసమైన కారును పరిశీలిస్తున్న వైఎస్ జగన్
చేతనైతే ఇవన్నీ చెయ్ బాబూ..!
ఇప్పటికైనా దేవుడంటే భయం, భక్తితో వ్యవహరించి బుద్ధి జ్ఞానం తెచ్చుకుని మంచి పరిపాలనతో ప్రజలకు మేలు చేసి వారి వద్ద మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చంద్రబాబు చేయాలి. చేతనైతే సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ విషయంలో అబద్ధాలు చెప్పకుండా, మోసాలు చేయకుండా నెరవేర్చే కార్యక్రమం చేయాలి. కూటమి వచ్చాక నిర్వీర్యం అయిన స్కూళ్లను బాగుచేయాలి. 8 క్వార్టర్లకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే ఆలోచన చేయాలి. చేతనైతే ఆపేసిన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చేసి చూపించాలి. చేతనైతే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. అన్నదాత సుఖీభవ కింద రూ.10 వేలిచ్చి వదిలేశారు. బకాయి పడ్డ రూ.30 వేలు కూడా తక్షణం చెల్లించాలి. వ్యవసాయాన్ని చక్కబెట్టే కార్యక్రమం చేయాలి. కానీ మీకు వీటన్నింటి మీద ధ్యాస లేదు. అన్నీ అబద్ధాలు, మోసాలు, ప్రశ్నించే గొంతులు నొక్కడమే.
తనకు అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకే కమిషన్!
చంద్రబాబు ఎంత దుర్మార్గుడు, రాక్షసుడో ప్రజలకు ఇప్పుడు స్పష్టంగా తెలిసింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలిసిందని తాను చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు అని స్పష్టంగా తేలడం, ఆధారాలతో సహా రుజువు కావడంతో ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారానికి తెర తీశారు. ఈ అంశంలో తానే ఓ కమిషన్ వేస్తామని చెబుతున్నారు. సీబీఐ చెప్పింది తప్పు..! ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ రిపోర్టులు తప్పు అని చెప్పిస్తూ, తనకు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి మరో కమిషన్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. తాను చెప్పినట్టే నివేదిక రావాలని ఒత్తిడి చేసి, దానిని రాష్ట్ర ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దిగజారిపోయిన రాజకీయ నాయకుడు ప్రపంచ చరిత్రలో ఉండరు.
వైఎస్సార్‌సీపీ నేతలు పేర్ని నాని, విడదల రజిని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, నంబూరు శంకరరావు, అన్నాబత్తుని శివకుమార్, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దేవినేని అవినాష్, వనమా బాలవజ్రబాబు, అంబటి మురళీకృష్ణ, షేక్ నూరీ ఫాతిమా, దొంతిరెడ్డి వేమారెడ్డి, దేవభక్తుని చక్రవర్తి, తన్నీరు నాగేశ్వరరావు, పోతిన మహేష్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, పలువురు రాష్ట్ర కార్యదర్శులు, అధికార ప్రతినిధులు జగన్ పర్యటనలో పాల్గొన్నారు.
దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా..
రాష్ట్రంలో ఈరోజు జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది. ఒక భయానక వాతావరణంతో రాష్ట్రాన్ని పరిపాలించే కార్యక్రమం జరుగుతోంది. అంబటి రాంబాబు ఇంటిపైన దాడి.. జోగి రమేష్ ఇంటి మీద దాడి.. విడదల రజినిపై అటాక్.. బొల్లా బ్రహ్మనాయుడు మీద అటాక్.. ఇవన్నీ జంగిల్ రాజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు కొన్ని ఉదంతాలు. అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజినమ్మ, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్ అన్న చేసిన తప్పేమిటి? చంద్రబాబు దాదాపు ఏడాదిన్నరగా ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారు. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, పంది కొవ్వు ఉందని, చేప నూనె కలిసిందంటూ రకరకాలుగా చంద్రబాబు, ఆయన కుమారుడు, పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేశారు. దేవుడంటే కనీసం భయం, భక్తి లేకుండా స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారు.
ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని తేల్చిన ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ
నెయ్యిపై చంద్రబాబు ఆరోపణలన్నీ అవాస్తవం అని ఎన్‌డీఆర్‌ఐ (నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్), ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) రిపోర్టు ఇచ్చాయి. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్‌లు. వీళ్ల హయాంలో.. వీళ్లే ఇచ్చిన టెస్ట్ శాంపిళ్లు అవి. వాటిని విశ్లేషించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వుగానీ, గొడ్డు మాంసం కొవ్వులు గానీ, పందికొవ్వు గానీ, చేప నూనెగానీ.. ఇటువంటివి ఇంకొకటిగానీ ఇంకొకటి గానీ లేవని నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాయి. అదే విషయాన్ని సీబీఐ తన చార్జిషీట్‌లో పొందుపరిచి ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ సర్టిఫికెట్లను జత చేసి క్లోజర్ కూడా ఇచ్చింది. సీబీఐ క్లీన్‌చిట్ ఇస్తోంది. ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు కూడా క్లీన్ చిట్లు ఇస్తున్నాయి.
ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్‌చిట్..
ఒకవేళ వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి తప్పు చేసి ఉంటే వారి పేర్లు ఎందుకు చేర్చలేదు? వారు ఒకవేళ తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే, తప్పు నిజమే అయితే ఎందుకు అరెస్టు చేయలేదు? వారు ఏ తప్పూ చేయలేదు కాబట్టే సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చింది. ఎటువంటి తప్పూ జరగలేదు కాబట్టే వారి పేర్లు చార్జిషీట్‌లో పెట్టలేదు. తప్పు చేయలేదు కాబట్టే అరెస్టు చేయలేదు. అసలు ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎలా వచ్చిందో తెలుసా..?రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తోందని, దీనిపై విచారణకు ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లి పిటిషన్ వేశారు కాబట్టే దీనిపై స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించింది.
ప్రశ్నిస్తుంటే దాడులు...
దుర్బుద్ధితో ఫ్లెక్సీలు పెట్టి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబును.. ఎందుకయ్యా అబద్ధాలు చెప్పావు? అన్యాయం చేశావు? ఎందుకయ్యా శ్రీవారి ప్రసాదం ప్రతిష్టను దెబ్బ తీశావు? అని ఎవరైనా గట్టిగా నిలదీస్తే ఆయన ఏం చేశారో తెలుసా..? అంబటి రాంబాబు అన్న మీద దాడి! ఆ రోజు (శనివారం) ఉదయం ఆయన గుడికి వెళ్లి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని పూజ చేసి బయటకు వస్తుంటే.. గుడి నుంచి ఇంటికి వచ్చే మార్గంలో ఏకంగా కట్టెలు పట్టుకుని, పోలీసులను పెట్టుకుని అడ్డుకున్నారు. (కర్రలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తల ఫోటోలను చూపారు). కారులో ఉన్న రాంబాబును అడ్డగించి, కారును కర్రలతో బాదుతూ, పోలీసుల సమక్షంలోనే అనకూడని మాటలు అంటూ బూతులు తిట్టారు. 
ఒకేసారి అంతమంది దుండగులు చేతిలో కర్రలతో కారుపైకి దూసుకు రావడం.. బూతులు తిడుతూ మీదకు రావడంతో ఆయన కాస్త ఘాటుగా స్పందించాడు. ఆయన నోటి నుంచి ఒక తిట్టు పదం వచ్చింది. ఒక రియాక్షన్‌గా జరిగింది. అదే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ మీద ఎటువంటి అటాక్ లేకపోయినా రొటీన్‌గా తిడుతున్నారు. అంబటి రాంబాబు అన్న ప్రాణం మీదకు వచ్చినప్పుడు రియాక్షన్‌గా ఆయన తిడితే మాత్రం ఇంకో రకంగా చిత్రీకరిస్తున్నారు. అయినప్పటికీ రాంబాబు ఇంటికి వచ్చిన తర్వాత ఒంటి గంట ప్రాంతంలో ప్రెస్‌మీట్ పెట్టి జరిగిన విషయమంతా వివరించారు. ఆయన పెద్ద మనిషి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి తాను తిట్టకుండా ఉండాల్సింది అని కూడా చింతిస్తూ చెప్పాడు.
అంతటి సంస్కారం ఉన్న వ్యక్తిని చేతనైతే పొగడాలి. కానీ వాళ్లు దాన్ని కూడా వక్రీకరిస్తూ ఏకంగా రాంబాబు అన్నను హత్య చేయడానికి సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు సాక్షాత్తూ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో మనుషులను వేసుకుని వచ్చి అంబటి ఇంటిపై దాడి చేశారు. ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంట్లో కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. పక్కనున్న ఆఫీసులో అన్నీ పగలగొట్టారు. ఆ ఇంట్లో ఆడవాళ్లు ఉన్నారు. వారి ప్రాణాలకు నష్టం జరిగే విధంగా.. వారిని తిడుతూ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం.


