‘జల’కంటక సర్కారుపై పోరుకేక.. | Rayalaseema Farmers Are Going For Chalo Pothireddypadu To Protest Against Halt Of Lift Irrigation Project | Sakshi
Sakshi News home page

Chalo Pothireddypadu: ‘జల’కంటక సర్కారుపై పోరుకేక..

Feb 5 2026 5:48 AM | Updated on Feb 5 2026 11:54 AM

Farmers of Rayalaseema are going to Chalo Pothireddypadu

నేడు చలో పోతిరెడ్డిపాడుకు రాయలసీమ రైతాంగం   

ఎత్తిపోతల పూర్తిచేయాలని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన   

తరలిరానున్న నేతలు, కార్యకర్తలు, రైతులు 

ప్రజా, రైతు సంఘాల సంఘీభావం   

సభకు అనుమతివ్వకుండా చివరి క్షణం వరకూ అడ్డుకున్న ప్రభుత్వం  

అనుమతి లేకున్నా.. పోతిరెడ్డిపాడు పోరుకు సిద్ధమైన సీమ, నెల్లూరు రైతులు, ప్రజలు 

చివరకు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన ఆత్మకూరు డీఎస్పీ 

సభకు ఏర్పాట్లు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి     

సాక్షి ప్రతినిధి కర్నూలు: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ఎత్తిపోతలను నిర్దాక్షిణ్యంగా ఆపేసి ఈ ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ప్రజానీకం కన్నెర్ర చేస్తోంది. ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాల్సిందేనని నినదిస్తోంది. ‘సీమ’కు ద్రోహం చేస్తున్న ‘జల’కంటక సర్కారుపై గళమెత్తి గర్జిస్తోంది. ‘తీరుమారకుంటే పతనం తప్పదు ఖబడ్దార్‌’ అంటూ హెచ్చరిస్తోంది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో గురువారం ‘చలో పోతిరెడ్డిపాడు’కు రాయలసీమ రైతాంగం సిద్ధమైంది.   
అనుమతివ్వకుండా అడ్డంకులు  
రాయలసీమ లిప్ట్‌ ఇరిగేషన్‌ ప్రాధాన్యం, చేసిన పనులు, ప్రాజెక్టు ఆవశ్యకత సీమ ప్రజలకు తెలిసేందుకు జనవరిలోనే వైఎస్సార్‌సీపీ నేతలు సమావేశమై ఈనెల 5న పోతిరెడ్డిపాడు వద్ద సభ నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత నంద్యాల వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి సభ అనుమతి కోసం యత్నించారు. అయితే ప్రభుత్వ ఆదేశంతో పోలీసులు చివరి క్షణం వరకూ సభకు అనుమతివ్వలేదు.  పోలీసులు అనుమతి చ్చి­నా, ఇవ్వకపోయినా ‘సీమ’ ప్రయోజనాల కోసం ఆ­టంకాలను అధిగమించి, పోతిరెడ్డిపాడుకు చేరుకుని నిరసన తెలపాలని రైతాంగం సిద్ధమైంది. 

వైఎస్సార్‌సీపీ నేతలూ దృఢ సంకల్పంతో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్‌ నివేదికల ద్వారా పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా భారీ­గా రైతులు, ప్రజలు తరలివస్తారని తెలుసుకున్న సర్కారు.. అనుమతివ్వకపోతే అభాసుపాలవుతామ­ని  జంకింది. ఫలితంగా పోతిరెడ్డిపాడు సభకు షరతులతో కూడిన అనుమతులిస్తూ ఆత్మకూరు డీఎస్పీ బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేశారు.   

వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే చలో పోతిరెడ్డిపాడు 
తెలంగాణ సీఎం రేవంత్‌తో, చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే రాయలసీమలిప్ట్‌ ఇరిగేషన్‌ పనులు నిలిచిపోయాయి. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌ ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. దీంతో చంద్రబాబు, ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు అసలు రాయలసీమ లిప్ట్‌ అవసరం లేదని, ఇది వృథా ప్రాజెక్టు అని ఏకంగా జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతోపాటు కూటమి ప్రభుత్వంలోని పలువురు వితండవాదానికి దిగారు. 

ఈ క్రమంలో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాధాన్యం, తెలంగాణ చేస్తున్న జలదోపిడీ, చంద్రబాబు చేస్తున్న ద్రోహం, ఇప్పటి వరకూ జరిగిన రూ.990 కోట్ల విలువైన పనులను ప్రజలకు చూపించడమే లక్ష్యంగా వైఎస్సార్‌ సీపీ చలో పోతిరెడ్డిపాడుకు పిలుపునిచ్చిoది. 

పిడికిలి బిగించిన సీమ నేతలు  
రాయలసీమ ప్రయోజనాలపై రాజీపడబోమని సీ­మ నేతలు, రైతులు పిడికిలి బిగించారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగురోజులుగా అక్కడే ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 

వైఎస్సార్‌సీపీ నందికొట్కూరు సమన్వయకర్త ధారా సుధీర్‌ కూడా ఏర్పాట్లలో చురుగ్గా పా­ల్గొంటున్నారు. శిల్పా రవి, ఎమ్మెల్సీ ఇసాక్‌తో పా­టు పలువురు నేతలు ఇప్పటికే పోతిరెడ్డిపాడును సందర్శించారు. అలాగే ‘సీమ’లోని అన్ని జిల్లాల అధ్యక్షులు, ఎంపీ మిథున్‌రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యే­లు, మాజీ ఎమ్మెల్యేలు,  నేత­లు భారీగా తరలిరానున్నారు. వీరికి సంఘీభా­వంగా ‘సీమ’ ప్రయోజనాలు కాంక్షించే పలు రైతు, ప్రజా సంఘాల నేతలు  సభలో పాల్గొననున్నారు.   

హైకోర్టులో పిటిషన్‌తో దిగొచ్చిన పోలీసులు
సాక్షి, అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేసి సీఎం చంద్రబాబు రాయలసీమ, నెల్లూరు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన బహిరంగ సభ­కు అనుమతి ఇచ్చే విషయంలో పోలీసులు దిగొ­చ్చారు. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయడంతో బహిరంగ సభ నిర్వహించేందుకు నంద్యాల జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చా­రు. దీంతో పిటిషన్‌ను పరిష్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ నెల 5న ఉదయం 10 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు పోతులపాడు గ్రామంలో మాజీ సర్పంచ్‌ గోపాల్‌రెడ్డికి చెందిన పొలంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరు­తూ నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రా గా రాంభూపాల్‌రెడ్డి తరఫు న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి స్పందిస్తూ.. తాము ఈ వ్యాజ్యం దాఖలు చేసిన తరువాత సభ నిర్వహణకు అనుమతి ఇస్తూ పోలీసులు ప్రొసీడింగ్స్‌ ఇచ్చారన్నారు. పోలీసులు ప్రొసీడింగ్స్‌ను రికార్డ్‌ చేస్తూ కేసు­ను పరిష్కరించాలని కోరారు. ఇందుకు న్యాయ­మూ­ర్తి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

సీమకు ద్రోహం చేస్తావా బాబూ? 
‘సీమ’కు మేలు చేయ­ని అ­నుభవం, అధికా­రం ఎందు­కు చంద్రబాబు?  రాయలసీమ అ­త్యంత వెనుకబడింది. కరువులతో వలసలు ఎ­క్కువ­య్యాయి. అయినా ఈ ప్రాంతానికి ద్రో­హం చేస్తావా చంద్రబాబూ..!  రాయలసీమ లిఫ్ట్‌ ఆపిన ఈ పాపం ఊరికేపోదు. వైఎస్‌ జగన్‌ ప్రారంభించిన ఎత్తిపోతలను రాజకీయ ప్రయోజనాల కోసం నిర్దాక్షిణ్యంగా ఆపేస్తావా? నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు జాగ్రత్త.  – కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, నంద్యాల 

ప్రభుత్వ తీరును ఎండగడతాం 
సభ జరగకుండా ప్ర­భు­త్వం అడ్డుకుంటోంది. సభ విఫ­లం కావడానికి సర్కారు చేస్తు­న్న యత్నాలు ఫలించవు. సభకు చివరి నిమిషం వరకు అనుమతివ్వని ప్రభుత్వం జనంలో పలుచన అవుతామనే భయంతో చివరికి అనుమతి ఉత్తర్వులు జారీ చేసింది. కానీ షరతులు విధించింది. సభ నాలుగు గంటలే జరపాలంట. నా­లుగైదు వేలమందే రావాలంట. ఏదేమైనా గురువారం పోతిరెడ్డిపాడు వద్ద రైతులు పెట్టే పొలికేక ఈ సర్కారు గుండెల్లో సమరభేరై మోగుతోంది. బాబు ప్రభుత్వ తీరును ఎండగట్టి తీరతాం.   – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement