ప్రజా సేవకులమని మర్చిపోయి.. పాలకుల్లా వ్యవహరిస్తున్నారు | The High Court lashed out at the government officials | Sakshi
Sakshi News home page

ప్రజా సేవకులమని మర్చిపోయి.. పాలకుల్లా వ్యవహరిస్తున్నారు

Feb 5 2026 5:11 AM | Updated on Feb 5 2026 5:11 AM

The High Court lashed out at the government officials

ఎల్లవేళలా ప్రజలను ప్రతిపక్షంలా చూస్తున్నారు 

కోర్టులు ఏం చేస్తాయిలే అనుకుంటే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు 

మా ఆదేశాలను మూలనపడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు 

ప్రభుత్వ అధికారులపై నిప్పులు చెరిగిన హైకోర్టు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు నిప్పులు చెరిగింది. అధికారులు ప్రజా సేవకులన్న విషయాన్ని మర్చిపోయి, వారే పాలకులన్నట్లు వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. అధికారులందరూ ఒక కుటుంబంగానే ఉంటారని, కానీ ప్రజలను ఎల్లవేళలా ఓ ప్రతిపక్షంలా చూస్తుంటారని తెలిపింది. కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవ్వరూ కాపాడలేరని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను అమలుచేసి తీరాల్సిందేనని తేల్చి చెప్పింది. 

కోర్టులో మా ఆదేశాలను అమలుచేస్తామని చెప్పి, ఆఫీసులకు వెళ్లిన తరువాత మూలన పడేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. సింగిల్‌జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టర్‌ డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావును న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ అవధానం హరిహరనాథ శర్మ ధర్మాసనం బుధవారం ఆదేశించింది.  

ప్రజాధనంతో పథకాలు తెస్తూ ప్రచారం కోసం వాడుకుంటున్నారు 
సర్వశిక్ష అభియాన్‌ పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన మెమోను పరిశీలించిన ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ తీరును కూడా తప్పుపట్టింది. పథకాలను ప్రచారం కోసమే వాడుకుంటున్నారు తప్ప, అమలు బాధ్యతను తీసుకోవడంలేదని వ్యాఖ్యానించింది. దీనివల్ల పథకం ఉద్దేశం నెరవేరడంలేదని తెలిపింది. ప్రభు­త్వాలు బాధ్యతల నుంచి తప్పుకున్నా న్యాయస్థానాలు మాత్రం బాధ్యత నుంచి తప్పుకోవని హైకోర్టు స్పష్టం చేసింది. పథకం అమలుపై పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది.

నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటారా? 
తమను అర్ధంతరంగా తొలగించడాన్ని సవాలు చేస్తూ కేజీబీవీ పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. వారి సేవలను కొనసాగించాలని ఆదేశించారు. ఈ తీర్పుపై అధికారులు దాఖలు చేసిన అప్పీల్‌పైన, సింగిల్‌ జడ్జి తీర్పును అమలు చేస్తామంటూ కోర్టుకిచ్చిన హామీని ఉల్లంఘించినందుకు సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుపై తమ ఆదేశాల మేరకు నమోదైన సుమోటో కోర్టు ధిక్కార వ్యాజ్యం పైనా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. 

ధర్మాసనం ఆదేశాల మేరకు కోర్టుకు హాజరైన శ్రీనివాసరావును సింగిల్‌ జడ్జి ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కింది స్థాయి అధికారుల తీరు వల్ల తన ఆదేశాలు అమలు కాలేదని, ఆ అధికారులకు నోటీసులు ఇచ్చానని ఆయన చెప్పగా, నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారా అంటూ నిలదీసింది. మరో ప్రశ్నకు శ్రీనివాసరావు సూటిగా సమాధానం చెప్పకపోవడంతో.. ‘ఇది మీ అధికారుల రివ్యూ మీటింగ్‌ కాదు. మీకు తోచింది చెప్పడానికి. కోర్టు అన్న విషయం గుర్తు పెట్టుకోండి’ అని ధర్మాసనం మండిపడింది. 

అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ)  తరఫున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ అధికారుల చర్యలను సమర్థించబోగా.. ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. సుమోటో కేసులో కోర్టు సహాయకారిగా వ్యవహరించాల్సిన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) సైతం అధికారులను సమర్థించేలా వాదించకూడదని స్పష్టం చేసింది. ఏజీ ఓ ప్రాసిక్యూటర్‌గా వ్యవహరించాలంది.  తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement