నగరంపాలెంలో భారీ జనసందోహానికి నమస్కరిస్తున్న వైఎస్ జగన్
చంద్రబాబు పాలనపై జనాగ్రహంతో దద్దరిల్లిన గుంటూరు
జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఏకమైన జనం
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
అడుగడుగునా బారికేడ్లు, తనిఖీలతో పోలీసుల ఆంక్షలు
జగన్‌ను చూడటానికి వెళ్లకూడదంటూ ఎక్కడికక్కడ అడ్డగింత
ముఖ్యనేతలకు నోటీసులు.. వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలింపు
అయినా ఆంక్షలు ఛేదించుకుని కదిలిన జనం.. ఎగిసిపడ్డ అభిమాన సంద్రం
35 కిలోమీటర్ల దూరానికి ఏకంగా ఆరు గంటల సమయం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: రోడ్డుపై కిలోమీటర్ల కొద్దీ కనుచూపు మేర జనం.. జంగిల్ రాజ్‌కు వ్యతిరేకంగా ఏకమయ్యారు.. చంద్రబాబు సర్కారు దుర్మార్గాన్ని ధైర్యంగా దుయ్యబట్టారు.. సర్కారు ఆంక్షలను లెక్క చేయకుండా రోడ్డుపైకి వచ్చారు.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అడుగులో అడుగేస్తూ దిక్కులు పిక్కటిల్లేలా జై జగన్ అంటూ నినాదాలు చేశారు.. జంగిల్ రాజ్‌కు రోజులు దగ్గర పడ్డాయని గర్జించారు.. ఇందుకు బుధవారం గుంటూరు వేదికైంది.. గుంటూరు నగరం జన సంద్రమైంది.. నినాదాలతో దద్దరిల్లింది.
తెలుగుదేశం పార్టీ గూండాల దాడికి గురైన అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జన సందోహం అపూర్వ స్వాగతం పలికింది. జగన్ పర్యటన ఖరారైందని తెలిసిన వెంటనే జిల్లాలో 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లు ప్రకటించి, నాయకులందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని పోలీసులు నోటీసులు ఇచ్చారు.
తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటి వరకు మార్గ మధ్యంలో అనేక చోట్ల బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. జగన్ కాన్వాయ్‌ను మాత్రం అనుమతించి.. ఆయన వెనుక వస్తున్న వాహనాలను, జన సందోహాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఇన్ని అడ్డంకుల మధ్య కూడా వైఎస్ జగన్ పర్యటన విజయవంతమైంది.

35 కిలోమీటర్లు.. ఆరు గంటలు
» తాడేపల్లి నుంచి గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు నివాసం వద్దకు 35 కిలోమీటర్ల దూరం చేరుకోవడానికి వైఎస్ జగన్‌కు ఏకంగా ఆరు గంటల సమయం పట్టిందంటే జనం ఎంతగా పోటెత్తారో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ జగన్‌ను చూడటానికి స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది.
» జగన్ కాన్వాయ్ తాడేపల్లిలో బయలుదేరిన తర్వాత కాజా టోల్‌గేట్ వద్ద వాహనాలను ఆపారు. ఆయనతోపాటు కొద్ది వాహనాలు మాత్రమే పంపి మిగతా వాటిని నిలువరించారు. అనంతరం కాన్వాయ్ గుంటూరు ఆటోనగర్ వై జంక్షన్‌కు చేరుకోగానే అక్కడ బారికేడ్లు అడ్డుగా పెట్టి పూర్తి స్థాయిలో వాహనాలు ఆపేశారు.
» ఏటుకూరు బైపాస్ వద్ద కూడా కార్యకర్తలు పత్తిపాడు నుంచి గుంటూరు నగరంలోకి రాకుండా బారికేడ్లు పెట్టి ఎక్కడికక్కడ నిలువరించారు. బైక్‌లపై వస్తుంటే బైక్‌ల తాళాలు లాక్కున్నారు. గుంటూరు జిల్లాను దిగ్బంధనం చేశారు. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.
» ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారు.. అంటూ ఆరా తీశారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని అడ్డుకొని వెనక్కి పంపారు. కొందరిని పోలీసు స్టేషన్‌లకు తరలించి సాయంత్రం ఐదు గంటల తర్వాత వదిలిపెట్టారు.
జననేతకు జనం జేజేలు
» గుంటూరు నగరానికి వచ్చిన జననేత వైఎస్ జగన్‌కు ప్రజలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు జేజేలు పలికారు. విద్యార్థి విభాగం నేతలు, యువజన విభాగం నేతలు, అనుబంధ విభాగాల నేతలు, యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ జన నేతకు ఎదురేగి స్వాగతం పలికారు. వైఎస్సార్‌సీపీ లీగల్ విభాగం నేతలు, న్యాయవాదులు ప్ల కార్డులు ప్రదర్శిస్తూ వైఎస్ జగన్ పర్యటనకు మద్దతు తెలిపారు.
» కంకరగుంట ఓవర్ బ్రిడ్జి, పట్టాభిపురం స్వామి థియేటర్ వద్ద సైతం ప్రజలు భారీగా చేరుకుని పూల వర్షం కురిపించారు. చేబ్రోలు హనుమయ్య కంపెనీ, గుజ్జనగుండ్ల సెంటర్‌లో తీన్మార్ డప్పు వాయిద్యాలతో స్థానిక నేతలు స్వాగతం పలికారు. యువత భారీగా బైక్ ర్యాలీలతో సందడి చేశారు. జగన్ గుంటూరు చేరుకున్న తర్వాత ఏటుకూరు వద్ద సర్వీస్ రోడ్డు మీదుగా వీఐపి రోడ్లోకి రావడానికి ముందుగా పోలీసులు ఆ దారిన వచ్చిన వాహనాలను అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం దాటిన తర్వాత కంకర్ గుంట ఓవర్ బ్రిడ్జి వద్ద సైతం వాహనాలను నిలువరించారు. అయినా జన సందోహం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
» గుంటూరు రోడ్లన్నింటిపై ప్రజలు, అభిమానుల కోలాహలం కనిపించింది. ఉదయం 10 గంటల నుంచే రోడ్లపైకి వచ్చి తమ అభిమాన నేత కోసం ఎదురు చూశారు. పెద్ద సంఖ్యలో వస్తున్న నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని అంబటి ఇంటికి వెళ్లనీయకుండా ఆపివేసినప్పటికీ.. సాయంత్రం 5 గంటలయ్యే సరికి ఆ ప్రాంతం జనసంద్రంగా మారిపోయింది.
» గుంటూరు నగరంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్ కాన్వాయ్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో చుట్టుగుంట సెంటర్ నుంచి అంబటి రాంబాబు నివాసానికి వచ్చేందుకు ఏకంగా 3 గంటలకుపైగా సమయం పట్టింది. అంబటి రాంబాబు నివాసంతో పాటు చుట్టుపక్కల ఇళ్లపైన, గోడలపైకి ఎక్కి ప్రజలు తమ అభిమాన నేతను చూశారు. పర్యటన ఈ స్థాయిలో విజయవంతం కావడంతో అధికార పార్టీ నేతల్లో గుబులుపుట్టింది.
అడుగడుగునా అడ్డంకులే..
సాక్షి, నరసరావుపేట: జంగిల్ రాజ్ అరాచకాలను ఎండగట్టేందుకు గుంటూరు నగరానికి వస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా వెళ్తున్న వేలాది మంది ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు అడుగడుగునా ఆంక్షలతో ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. పల్నాడు జిల్లా నుంచి గుంటూరుకు వెళ్లే సరిహద్దు మండలాలైన నరసరావుపేట, యడ్లపాడు, సత్తెనపల్లి, అమరావతి మండలాల పరిధిలో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు.
జగన్‌ను చూడటానికి వెళ్తున్న వారిని గుర్తించి వెనక్కు పంపారు. ఉదయం 7 గంటల నుంచే వాహనాల తనిఖీలు ప్రారంభించారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ, యడ్లపాడు మండలం బోయపాలెం హైవే వద్ద, సత్తెనపల్లి మండలం నందిగం అడ్డరోడ్డు వద్ద పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అడ్డుకున్నారు. సత్తెనపల్లి, సత్తెనపల్లి రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, దాచేపల్లి, అచ్చంపేట, బెల్లంకొండ తదితర మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్తున్న వాహనాలను సత్తెనపల్లి నందిగం అడ్డరోడ్డు వద్ద సత్తెనపల్లి రూరల్ పోలీసులు ఆపేశారు.
వారిని సత్తెనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించి సాయంత్రం 6 గంటల వరకు స్టేషన్‌లోనే నిర్బంధించారు. సత్తెనపల్లి కార్యకర్తలను సైతం ఇదే స్టేషన్‌లో సాయంత్రం వరకు ఉంచారు. వైఎస్ జగన్ పర్యటనలో పాల్గొనేందుకు అనుమతి లేదంటూ పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుకు గుంటూరులోని నివాసంలో పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ఎంత కట్టడి చేసినా పల్నాడు జిల్లా మీదుగా గుంటూరు నగరానికి వేలాది మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు అద్దం పడుతోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


