తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏం చేయాలనే దానిపై మంతనాలు
రాజ్యసభ స్థానాల పంపకం, క్షేత్రస్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయ లోపంపైనా చర్చ
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని అడ్డగోలుగా విష ప్రచారం చేసి దొరికిపోయిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇద్దరూ రెండున్నర గంటలపాటు ఏకాంతంగా చర్చలు జరిపినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు చేసిన ఆరోపణలు అబద్ధాలని సీబీఐ సిట్ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ ద్వారా బయటకొచ్చిన నేపథ్యంలో వారి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామిని రాజకీయాల్లోకి లాగి పాపం మూటగట్టుకున్నారని ప్రజలు నమ్ముతుండడం.. వారు చెప్పిన అబద్ధాలను ఎంత సమర్థించుకుంటున్నా ప్రజలు నమ్మకపోవడంతో దీనిపై ఏం చేయాలని కూటమి నేతలు రెండ్రోజులుగా తర్జనభర్జన పడుతున్నారు. అందులోభాగంగానే చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్ బుధవారం సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు, కార్యాలయాలపై టీడీపీ శ్రేణులతో దాడి చేయించడంవల్ల ప్రభుత్వం తీరుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోవడంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై కూడా వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. ఈ అంశంపైనే ఎక్కువగా వీరు మాట్లాడుకున్నట్లు టీడీపీ నేతల ద్వారా తెలిసింది.
అలాగే, త్వరలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల పంపకం పైనా ప్రాథమికంగా చర్చలు జరిపారు. బీజేపీ రెండు రాజ్యసభ స్థానాలు తమకే కావాలని పట్టుబడుతుండడంతో దానిపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. టీడీపీ, జనసేన చెరొకటి పంచుకోవాలా లేక బీజేపీని ఒక్క స్థానంతో సరిపెట్టుకోవాలని ఒప్పించాలా అనే అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలిసింది.
అయితే, ఈసారి జనసేనకు ఒక స్థానం కచ్చితంగా ఇవ్వాలని చంద్రబాబును పవన్ కోరినట్లు తెలిసింది. అలాగే, తన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం వంటి అంశాలను కూడా పవన్ ప్రస్తావించినట్లు సమాచారం. దీంతోపాటు ఇంకా భర్తీ కావాల్సిన నామినేటెడ్ పదవులతోపాటు రెండు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయం లేకపోవడంవల్ల ఎదురవుతున్న సమస్యలపైనా చర్చించినట్లు తెలిసింది.


