నేర నిరూపణ అయ్యే వరకు నిందితులు నిరపరాధులే
సామాన్యుల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారు
నిందితుల పెరేడింగ్‌పై కౌంటర్లు వేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది.
నిందితులను పెరేడ్ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్‌పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ రైట్స్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
పోలీసులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు
పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, నిందితులను రోడ్లపై పెరేడ్ చేయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇలా పెరేడ్ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్దమని తెలిపారు. ఇలా చేయడం ఓ రకంగా నేరం చేశారని తీర్పునిచ్చేయడమేనన్నారు. వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ మాత్రమేనని, అయితే రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతల్లా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

నేరారోపణ ఉన్న ప్రతి వ్యక్తీ దోషి కాదని, అలాంటప్పుడు వారిని రోడ్లపై పెరేడ్ చేయించడం వారి హక్కులను హరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు దూషిస్తూ కొడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్ తమకు వచి్చందని తెలిపింది. సామాన్య ప్రజల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారంది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడిని తీసుకెళ్లే వాహనం మరమ్మతులకు గురి కావడంతో పోలీసులు అతన్ని నడిపించుకు తీసుకెళ్లారని, దీన్ని ఫోటోలు తీసి ప్రచారం చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది.


