దీర్ఘకాలిక లీజుకా.. పీపీపీకా? | Reconsideration is needed regarding handing over Waqf lands to APIIC through land acquisition | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక లీజుకా.. పీపీపీకా?

Feb 5 2026 5:30 AM | Updated on Feb 5 2026 5:30 AM

Reconsideration is needed regarding handing over Waqf lands to APIIC through land acquisition

అంజుమన్‌ ఇ ఇస్లామియా భూములపై ప్రభుత్వం మల్లగుల్లాలు 

71.57 ఎకరాల వక్ఫ్‌ భూములను భూసేకరణతో ఏపీఐఐసీకి కట్టబెట్టడంపై పునరాలోచన  

వక్ఫ్‌ టైటిల్‌ మార్పునకు చట్టం అంగీకరించకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు అడుగులు  

నేడు వక్ఫ్‌ బోర్డ్‌ సమావేశంలో నిర్ణయం? 

వక్ఫ్‌ భూములు అన్యాక్రాంతం చేసేలా ప్రభుత్వ తీరు ఉందని ముస్లిం సమాజం మండిపాటు

సాక్షి, అమరావతి: గుంటూరు అంజుమన్‌ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన రూ.కోట్ల విలువైన భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో వాటిని మరో మార్గంలో మళ్లించేందుకు చంద్రబాబు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ముస్లిం సమాజం నుంచి ఆగ్రహం పెల్లుబుకడంతో ఆ భూములను ఏపీఐఐసీకి బదలాయించేందుకు చేపట్టిన భూసేకరణ విషయంలో పునరాలోచనలో పడింది. 

ఈ నేపథ్యంలో.. గుంటూరు జిల్లా చినకాకానిలోని 71.57 ఎకరాల అంజుమన్‌ ఇ ఇస్లామియా సంస్థకు చెందిన భూములను ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకునే అంశాన్ని వక్ఫ్‌బోర్డు పరిధిలోకి ప్రభుత్వం నెట్టింది. దీంతో.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టేందుకు ఏపీ వక్ఫ్‌బోర్డు రంగంలోకి దిగింది.

దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? ప్రభుత్వ శాఖలకు, ప్రైవేట్‌ వ్యక్తులకు పీపీపీ పద్ధతిలో అప్పగిద్దామా? అనే దానిపై తీర్మానం చేసేందుకు వక్ఫ్‌బోర్డు రంగం సిద్ధంచేసింది. ఇందుకోసం గురువారం విజయవాడలో ఏపీ వక్ఫ్‌బోర్డు కీలక సమావేశం నిర్వహిస్తోంది. అయితే, ఈ సమావేశం ఎజెండాను బుధవారం సాయంత్రం వరకు పలువురు సభ్యులకు అందించలేదు. 

మల్లాయపాలెంతో మొదలైన ప్రయత్నాలు.. 
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాగానే రూ.వందల కోట్ల విలువైన వక్ఫ్‌ భూములను ఏపీఐఐసీకి బదలాయించి తద్వారా పచ్చనేతలకు పప్పుబెల్లాల్లా పంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కానీ, ప్రభుత్వ ప్రయత్నాలు వక్ఫ్‌ చట్టానికి విరుద్ధమని న్యాయ నిపుణులు, ముస్లిం నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ చట్టం ప్రకారం వక్ఫ్‌ ఆస్తుల టైటిల్‌ను వేరొక సంస్థ, వ్యక్తి పేరున మార్చడానికి వీల్లేదు. అయినా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ భూసేకరణ చట్టం–2018లోని సెక్షన్‌–22 అనుసరించి అతితక్కువ ధరకు ఏపీఐఐసీకి అప్పగించాలనే ప్రతిపాదన తెచ్చింది. 

ఇందులో భాగంగా.. తొలుత గుంటూరు షాహీ జామియా మసీదుకు చెందిన మల్లాయపాలెంలోని 233.18 ఎకరాలను ఇండ్రస్టియల్‌ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు గతేడాది యత్నించింది. ఈ ప్రయత్నాలపై ముస్లిం సమాజం మండిపడడంతో వెనక్కి తగ్గింది. భూసేకరణను వాయిదా వేసి దీర్ఘకాలిక లీజు లేదా పీపీపీ పద్ధతిలో అప్పగించేందుకు వక్ఫ్‌బోర్డు ప్రతిపాదన చేసేలా స్కెచ్‌ వేసింది. కానీ, వక్ఫ్‌బోర్డు సభ్యుల నుంచి ముస్లిం నేతల వరకు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తంచేయడంతో మల్లాయపాలెం భూముల బదలాయింపునకు తాత్కాలిక బ్రేక్‌ పడింది. 

ఇప్పుడు అంజుమన్‌ ఇ ఇస్లామియా భూముల వంతు.. 
ఈ నేపథ్యంలో.. చినకాకానిలోని అంజుమన్‌ ఏ ఇస్లామియా సంస్థకు చెందిన 71.57 ఎకరాలను ఇండ్రస్టియల్‌ పార్కు పేరుతో ఏపీఐఐసీకి భూసేకరణ ద్వారా బదలాయించేందుకు నోటిఫికేషన్‌ జారీచేశారు. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరాలు రావడంతో ఇప్పుడు దీర్ఘకాలిక లీజుకు ఇద్దామా? పీపీపీ పద్ధతిలో ఇద్దామా? అంటూ కొత్త డ్రామాకు తెరలేపారు. వాస్తవానికి.. వక్ఫ్‌ భూములు లీజు, విక్రయం, బహుమతి (గిఫ్ట్‌)గా ఇవ్వడం కుదరదని వక్ఫ్‌ చట్టం–1995లోని సెక్షన్‌–51 స్పష్టంచేస్తోందని ముస్లిం ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. వక్ఫ్‌బోర్డు సమావేశం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement