గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం | Chrome Enduring Legacy Beyond AI Competition | Sakshi
Sakshi News home page

గూగుల్ క్రోమ్ తిరుగులేని ప్రయాణం

Dec 31 2025 2:00 PM | Updated on Dec 31 2025 2:47 PM

Chrome Enduring Legacy Beyond AI Competition

ఇంటర్నెట్ వినియోగంలో ఒక విప్లవం వస్తుందని, ఏఐ ఆధారిత బ్రౌజర్లు వెబ్ బ్రౌజింగ్ తీరును పూర్తిగా మార్చేస్తాయని గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓపెన్‌ఏఐ మద్దతు ఉన్న అట్లాస్, పెర్ప్లెక్సిటీ ఆధ్వర్యంలోని కామెట్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోని కోపైలట్ వంటివి సాంప్రదాయ బ్రౌజర్లకు ముగింపు పలుకుతాయని భావించారు. కానీ, 2025 ముగింపు దశకు చేరుకున్నా గూగుల్ క్రోమ్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

భారత మార్కెట్‌లో క్రోమ్ ప్రభంజనం

భారతదేశంలో సుమారు 90% బ్రౌజింగ్‌కుపైగా మార్కెట్ వాటాతో గూగుల్‌ క్రోమ్ అగ్రస్థానంలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో క్రోమ్ డిఫాల్ట్ బ్రౌజర్‌గా ఉండటం, గూగుల్ ఖాతాతో ఉన్న విడదీయలేని అనుబంధం ఇందుకు కారణమని తెలుస్తుంది. ఒపెరా, సఫారీ వంటివి సింగిల్ డిజిట్ వాటాకే పరిమితం కాగా, ఎడ్జ్, ఫైర్‌ఫాక్స్ 1% కంటే తక్కువ స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. క్రోమ్ 71% మార్కెట్ వాటాను కలిగి ఉండగా, యాపిల్ సఫారీ (15%) రెండో స్థానంలో ఉంది. ఏఐను ఉపయోగిస్తున్న ఇతర బ్రౌజర్లు ఇప్పటికీ నామమాత్రపు వాటాకే పరిమితమయ్యాయి.

ఈ లెగసీకి కారణం..

  • కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉందనే కారణంతో వినియోగదారులు తమ దశాబ్ద కాలపు అలవాట్లను మార్చుకోవడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికిగల కారణాలు..

  • జీమెయిల్, గూగుల్‌ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలతో క్రోమ్ ఇచ్చే అనుభవం మరే బ్రౌజర్ ఇవ్వలేకపోతోంది.

  • కొత్త ఏఐ బ్రౌజర్ల అవసరం లేకుండానే గూగుల్ తన జెమిని(Gemini) ఏఐని నేరుగా క్రోమ్‌లోకి ఎంబెడ్ చేసింది.

  • సెర్చ్ సమ్మరీలు, రైటింగ్ అసిస్టెంట్, ట్యాబ్ ఆర్గనైజర్ వంటి ఫీచర్లను క్రోమ్ వినియోగదారులకు వారి పాత అలవాట్లను మార్చకుండానే అందుబాటులోకి తెచ్చింది.

  • చాలా ఏఐ బ్రౌజర్లు క్రోమ్‌లానే పనిచేస్తున్నాయి. వినియోగదారులకు తమ పాస్‌వర్డ్‌లు, హిస్టరీ, బుక్‌మార్క్‌లను వదులుకుని కొత్త బ్రౌజర్‌కు వెళ్లడానికి బలమైన కారణాలు కనిపించడం లేదు. ఏఐ ఫీచర్లు ఇప్పుడు క్రోమ్ ఎక్స్‌టెన్షన్ల రూపంలో కూడా లభిస్తుండటం మరో కారణం.

ఏఐ ఏజెంట్ వైపు..

ప్రస్తుత ఏఐ బ్రౌజర్లు కేవలం సమాచారాన్ని క్రోడీకరించడానికి (Summarization) లేదా పోల్చడానికి మాత్రమే పరిమితమయ్యాయి. కానీ భవిష్యత్తులో బ్రౌజర్ల పాత్ర మారబోతోంది. వినియోగదారుడి తరపున స్వయంగా పనులు చేసే (ఉదాహరణకు: టికెట్లు బుక్ చేయడం, షాపింగ్ చేయడం, షెడ్యూల్ మేనేజ్ చేయడం) అటానమస్ ఏజెంట్‌గా బ్రౌజర్ మారినప్పుడు మాత్రమే క్రోమ్‌కు నిజమైన పోటీ ఎదురవుతుందనే వాదనలున్నాయి. బ్రౌజర్ అనేది ఒక విండోలా కాకుండా, ఒక పర్సనల్ అసిస్టెంట్‌గా మారినప్పుడు మాత్రమే మార్కెట్ వాటాలో మార్పులు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: 10 నిమిషాల డెలివరీ.. సాంకేతిక ప్రగతా? శ్రమ దోపిడీనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement