
రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యాంకుల్లో మూలుగుతున్న డబ్బు
పదేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలు 78,53,607
ఈ ఖాతాలపై డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్
ఉద్గం పోర్టల్‌లో చెక్ చేసుకొని క్లెయిమ్ చేసుకునే అవకాశం
ఎవరూ రాకపోతే డీఈఏఎస్‌లో జమకానున్న డబ్బు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల్లో పదేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరగని వినియోగదారుల ఖాతాల్లో రూ.2,095.10 కోట్లు పేరుకుపోయాయి. ఇలాంటి 78,53,607 ఖాతాలను ఆర్‌బీఐ గుర్తించింది. చాలా మంది తమ ఆర్థిక విషయాలను ఎవరితో పంచుకోవడానికి ఇష్టపడరు. వారికి అనుకోకుండా ఏమైనా జరిగినా బ్యాంకు ఖాతాల్లో డబ్బులున్నాయన్న విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. మరోవైపు కొందరు బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసి మరిచిపోతుంటారు. ఇలా ఆగస్టు 31, 2025 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 78,53,607 ఖాతాల్లో రూ 2,095.10 కోట్లు పేరుకుపోయాయి.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం బ్యాంకు ఖాతాను పదేళ్లకు మించి ఆపరేట్ చేయకపోతే అందులో ఉన్న డబ్బు డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (డీఈఏఎఫ్) ఖాతాకు చేరుతుంది. ఆర్‌బీఐ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఖాతాలపై బ్యాంకులు ఈ నెల 13వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నాయి.
ఎస్‌బీఐలోనే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా 30 బ్యాంకులలో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉండగా.. అందులో ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)లోనే 21,61,529 ఖాతాలలో రూ 586.98 కోట్లు మూలుగుతున్నాయి. తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 20,70,208 ఖాతాల్లో రూ.467.76 కోట్లు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ అన్‌క్లెయిమ్డ్ డబ్బు అధికంగా ఉండిపోయింది.
ఉద్గం పోర్టల్ ద్వారా వివరాలు..
చనిపోయిన వారి బ్యాంక్ ఖాతాల్లో ఏమైన డబ్బులు ఉన్నాయని భావిస్తే వారి కుటుంబ సభ్యులు ఉద్గం పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. మొదట ఉద్గం పోర్టల్‌లో లాగిన్ కావాలి. తర్వాత కుటుంబ సభ్యుని వివరాలు నమోదు చేయాలి. అప్పుడు ఖాతాలోని నగదు నిల్వ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ డబ్బు ఉంటే సంబంధిత బ్యాంక్‌ను సంప్రదించి, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలను సమర్పించి క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఖాతాదారుడు బ్యాంక్‌లో డబ్బులు జమచేసి మర్చిపోతే సదరు ఖాతాదారుని ధ్రువీకరణ పత్రాలు, కేవైసీ పత్రాలతో సంప్రదించాలి. అన్నీ పరిశీలించిన తర్వాత బ్యాంకు ఖాతాలోని డబ్బులను అప్పగిస్తుంది. డిసెంబర్ 31వ తేదీవరకు క్లెయిమ్ చేసుకోకపోతే డీఈఏఎఫ్‌లో ఆ డబ్బు జమ అవుతుంది.

ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాం
బ్యాంక్‌లో డబ్బులు జమచేసి పదేళ్లుగా లావాదేవీలు జరగని ఖాతాలను అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తాం. వీటిపై డిసెంబర్ 31 వరకు ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తాం. చనిపోయినవారి ఖాతాల్లో ఉన్న డబ్బులను సంబంధిత కుటుంబ సభ్యులు తగిన పత్రాలను అందించి డ్రా చేసుకోవచ్చు. ఉద్గం పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు.
– హరిబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్, సిద్దిపేట