
కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ పెంచింది. దసరా,దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, రిటైరైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ రిలీఫ్‌ను 3 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పెరిగిన డీఏ జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. డీఏ అంటే ఏమిటి.. దాన్ని ఎలా లెక్కిస్తారు.. జీతం ఎంత పెరుగుతుంది.. ఈ కథనంలో తెలుసుకుందాం..
డీఏ అంటే ఏమిటి?
డీఏ అంటే డియర్‌నెస్ అలవెన్స్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ప్రభావాన్ని ఎదుర్కోవడంలో సహాయపడేందుకు డీఏ చెల్లిస్తారు. ద్రవ్యోల్బణం వల్ల వస్తువుల ధరలు పెరుగుతుంటాయి. దీనివల్ల జీవన వ్యయం అధికమవుతుంది. దీన్ని తగ్గించడానికే ఎప్పటికప్పుడు డీఏను పెంచుతుంటారు. డీఏ పెరిగితే ఉద్యోగులకు ప్రతినెలా చేతికందే జీతమూ పెరుగుతుంది.
ఎలా లెక్కిస్తారు?
ఉద్యోగుల మూల వేతనం అంటే బేసిక్ శాలరీపై లెక్కిస్తుంటారు. వినియోగదారు ధరల సూచీ (CPI) ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ 3 శాతం పెంపుకు ఆమోదం తెలిపారు. తాజా పెంపు డీఏ 55 శాతం నుంచి 58 శాతానికి పెరుగుతుంది.
జీతంలో ఎంత పెరుగుంది?
ఉదాహరణకు ఉద్యోగి బేసిక్ జీతం రూ.50,000 అనుకుంటే ఇప్పుడున్న 55 శాతంతో డీఏ రూ.27,500. తాజాగా 3 శాతం పెరిగింది కాబట్టి ఇది 58 శాతానికి చేరుతుంది. రూ.50,000 జీతంపై 58 శాతం డీఏ 29,000 అవుతుంది. అంటే ఉద్యోగికి ప్రతినెలా అందే జీతంలో రూ.1,500 పెరుగుతుందన్న మాట. అయితే హెచ్‌ఆర్‌ఏ, టీఏ వంటి ఇతర అలవెన్సులు డీఏ పెంపుతో మారవు. పెన్షనర్లకు డీఆర్ (Dearness Relief) రూపంలో ఇదే శాతం వర్తిస్తుంది.