కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్‌లను (New Labour Code) అమల్లోకి తెచ్చింది. దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రధానంగా 29 కార్మిక చట్టాలు ఉండగా వాటిని నాలుగు కొత్త లేబర్ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది. వీటితో వేతనాల (Wages) నిర్వచనం పూర్తిగా మారిపోనుంది. ఈ నేపథ్యంలో వేతన నిర్మాణం ఎలా మారుతుంది? చేతికందే జీతం (టేక్-హోమ్) తగ్గుతుందా? అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వచ్చాయి.
ఎక్కువ బేసిక్ పే.. తక్కువ టేక్ హోమ్
వేతనాలలో కనీసం 50 శాతం భాగం ప్రాథమిక వేతనం + కరువు భత్యం (డీఏ) + నిలుపుదల భత్యం (రిటైనింగ్ అలవెన్స్) రూపంలో ఉండాలనే కొత్త నిబంధన ప్రధాన ఆందోళనగా నిలుస్తోంది. ఇప్పటి వరకు చాలా కంపెనీలు ప్రాథమిక జీతాన్ని మొత్తం సీటీసీ (CTC)లో తక్కువగా ఉంచి, మిగతాది వివిధ భత్యాలతో పూరించేవి. ఎందుకంటే పీఎఫ్ (ఉద్యోగి 12%, యజమాన్యం 12%), గ్రాట్యుటీ లెక్కింపు ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉండటం వల్ల, తక్కువ బేసిక్ పే ఉంటే తక్కువ చట్టబద్ధ తగ్గింపులు (కటింగ్స్) పోయి ఎక్కువ జీతం చేతికందేది.
అయితే కొత్త లేబర్ కోడ్‌లు వేతనాలకు ఒక నూతన ఏకీకృత నిర్వచనాన్ని తీసుకొస్తున్నాయి. మొత్తం వేతనంలో 50 శాతాన్ని మినహాయింపుల కసం కనీస వేతనంగా పరిగణిస్తుండటంతో ఈపీఎఫ్, గ్రాట్యుటీ లెక్కింపునకు ఉపయోగించే బేస్ పెరుగుతుంది. అహ్లావాట్& అసోసియేట్స్‌కు చెందిన అలయ్ రజ్వీ ప్రకారం.. ఇది ఉద్యోగి పొందే రిటైర్మెంట్, ఇతర చట్టబద్ధమైన ప్రయోజనాల లెక్కింపులో మార్పుని తీసుకువస్తుంది.
ఇదీ చదవండి: ఉద్యోగుల గ్రాట్యుటీకి ఇక ఏడాది చాలు..
అయితే యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రాథమిక వేతనాన్ని పెంచాల్సిన అవసరం లేదని, మారేది పీఎఫ్/గ్రాట్యుటీ లెక్కింపు కోసం ఉపయోగించే మొత్తం మాత్రమేనని రజ్వీ స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల మినహాయింపుల బేస్ పెరుగుతుందనీ, కానీ టేక్-హోమ్ పై ప్రభావం యాజమాన్యాలు జీత నిర్మాణాన్ని ఎలా పునర్నిర్మిస్తాయన్న దానిపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.


