కార్మిక చట్టాలలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రవేశపెట్టింది. కొత్త లేబర్ కోడ్‌ల ప్రకారం.. అన్ని రంగాల్లోని ఉద్యోగులు ఇప్పుడు కేవలం ఒక సంవత్సరం సర్వీస్ ఉంటే చాలు గ్రాట్యుటీకి అర్హులు అవుతారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న 29 కార్మిక చట్టాలను ప్రభుత్వం నాలుగు సరళీకృత లేబర్ కోడ్‌లుగా ఏకీకృతం చేసింది.
కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం.. ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, విస్తృత సామాజిక భద్రతా కవరేజ్, మెరుగైన ఆరోగ్య రక్షణ అందించడమే ఈ మార్పుల లక్ష్యం. ఈ సంస్కరణలు అనధికారిక కార్మికులు, గిగ్ , ప్లాట్‌ఫామ్ వర్కర్లు, వలస కార్మికులు, మహిళా ఉద్యోగులు వంటి విభిన్న వర్గాలకు వర్తిస్తాయి.
గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పు
పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ ప్రకారం.. ఇప్పటిదాకా ఒక ఉద్యోగి ఐదు సంవత్సరాల నిరంతర సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాతే గ్రాట్యుటీకి అర్హుడు. అయితే, కొత్త లేబర్ కోడ్‌ల అమలుతో నిర్ణీత కాలానికి అంటే రెండేళ్లకో.. మూడేళ్లకో ఒప్పందంపై చేరే ఉద్యోగులు (ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ (FTEs) కూడా ఇప్పుడు ఏడాది సర్వీస్ అనంతరం గ్రాట్యుటీకి అర్హత పొందుతారు.
మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. ఈ మార్పు ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులతో సమాన హోదాలోకి తీసుకురావడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగానే జీతాలు, సెలవు సదుపాయాలు, వైద్య ప్రయోజనాలు, సామాజిక భద్రతా పరిరక్షణలు పొందుతారు.
గ్రాట్యుటీ అంటే..
గ్రాట్యుటీ అనేది ఉద్యోగి దీర్ఘకాలిక సేవకు గుర్తింపుగా కంపెనీల యాజమాన్యాలు చెల్లించే ఆర్థిక ప్రయోజనం. సాధారణంగా, ఒక ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు, పదవీ విరమణ చేసినప్పుడు లేదా అర్హతగల సర్వీస్ కాలాన్ని పూర్తి చేసినప్పుడు ఈ మొత్తం చెల్లిస్తారు.
లెక్కిస్తారిలా..
ఉద్యోగికి చెల్లించే గ్రాట్యుటీ మొత్తం ఈ ఫార్ములాతో లెక్కిస్తారు.
గ్రాట్యుటీ = (చివరిగా అందుకున్న వేతనం) × (15/26) × (సర్వీస్ కాలం సంవత్సరాల్లో)
ఇక్కడ చివరిసారిగా అందుకున్న వేతనం అంటే బేసిక్ పే, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపి తీసుకోవాలి.
ఉదాహరణకు ఒక ఉద్యోగి 5 సంవత్సరాలు పనిచేసి చివరిగా బేసిక్, డీఏ కలిపి రూ.50 వేలు అందుకున్నారనుకుంటే.. గ్రాట్యుటీ రూపంలో సదరు ఉద్యోగి అందే మొత్తం రూ.1,44,230 అవుతుంది.


