‘వాట్సాప్ గవర్నెన్స్’ సేవల్ని ప్రజలు వాడకపోవడంతో ఉద్యోగులపై కత్తిగట్టిన ప్రభుత్వం
ఒకేసారి 27,820 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని నిర్ణయం
వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమిటో 68 శాతం మందికి తెలియదని సర్కారు సర్వేలో బహిర్గతం
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్న ప్రభుత్వం
సాక్షి, అమరావతి: అత్తమీద కోపం దుత్తమీద చూపిన చందంగా.. ప్రజల మీద అసహనాన్ని సచివాలయ ఉద్యోగులపై ప్రదర్శిస్తోంది చంద్రబాబు సర్కారు. ‘మన మిత్ర’ పేరిట ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ సేవల గురించి రాష్ట్రంలోని 68 శాతం మందికి అవగాహన లేదని తేలడంతో.. అందుకు సచివాలయ ఉద్యోగులను బాధ్యుల్ని చేస్తోంది.
ఈ ఏడాది జనవరి 30న ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ విధానం అమల్లో ఉన్నట్టు రాష్ట్రంలో మూడింట రెండొంతుల మందికి పైగా కనీసం తెలియలేదని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందనే నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 27,280 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని సచివాలయాల శాఖ డైరెక్టర్ కార్యాలయం ద్వారా ఆదేశాలు జారీ చేసింది.
20 శాతం మందికే అవగాహన
‘ప్రభుత్వం నిర్వహిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలుసా’ అంటూ ఐవీఆర్‌ఎస్ విధానంలో ప్రభుత్వం 20 లక్షల మందికి ఫోన్లు చేసి సమాచారం సేకరించింది. ఏకంగా 67.99 శాతం మంది ఆ కార్యక్రమం గురించి తమకు తెలియదని చెప్పారు. ఈ విధానం ఉన్నట్టు తెలుసని కేవలం 20.54 శాతం మంది మాత్రమే చెప్పారు. ఈ గణాంకాలను ఇటీవల ప్రభుత్వమే వెల్లడించింది.
డిసెంబర్ 17, 18 తేదీల్లో జరిగిన కలెక్టర్ల సందర్భంగా సర్వే వివరాలు బహిర్గతం కావడం, పత్రికల్లో కథనాలు ప్రచురితమవడంతో ఈ కార్యక్రమంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఇంటింటికీ పంపించి ప్రచారం చేయించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఇకనుంచి ప్రతి శుక్రవారం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలని సచివాలయాల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. డిసెంబర్ 26వ తేదీ మొదటి శుక్రవారం 27,280 సచివాలయాల ఉద్యోగులు ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదని సచివాలయాల శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ డైరెక్టర్ అన్ని జిల్లాల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి 27,280 మంది ఉద్యోగుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు.
తెలియకపోవడానికి కారణాలివీ
2019–24 మధ్య గ్రామ, వార్డు వలంటీర్ల ఆధ్వర్యంలో సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల గడపవద్దే అందేవి. ఆ కాలంలో దాదాపు 10 కోట్లకు పైగా సేవలు ప్రజలు ఇంటినుంచే పొందారు. కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే.. సీఎం చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడేశారు. వలంటీర్ల సేవల స్థానంలో మనమిత్ర యాప్ పేరుతో వాట్సాప్ గవర్నెర్స్ సేవల్ని ప్రవేశపెట్టారు.
ఈ సేవలు వినియోగించుకోవాలంటే ప్రతి ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు ఉండాలి. నిరుపేదలు, సామాన్యుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేవు. కొందరి వద్ద ఉన్నా వారు ఇంటర్నెట్ సేవల్ని పొందడం లేదు. ఒకవేళ ఇంటర్నెట్ డేటా వినియోగిస్తున్నా మనమిత్ర యాప్ ఉపయోగించడం, సేవలు పొందేందుకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తమ ఫోను ద్వారా ఆ యాప్‌లో అప్‌లోడ్ చేసే పరిజ్ఞానం కూడా చాలామందికి తెలియదు.
మరోవైపు తోడు స్మార్ట్ ఫోన్లలో యాప్‌లు వినియోగిస్తే మోసాలకు గురవుతామన్న భయాందోళనలు చాలామందిలో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు, సామాన్యులకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందుబాటులోకి రాలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. ఈ లోపాలను గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఉద్యోగులపై చూపాలన్న పాలకుల నిర్ణయాన్ని సచివాలయాల ఉద్యోగ సంఘాల నేతలు తప్పు పడుతున్నారు.
డొల్లతనం బట్టబయలు
మన మిత్ర యాప్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారా 20 లక్షల మంది అభిప్రాయాలు తీసుకుంటే కేవలం సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో మాత్రమే 33 నుంచి 35 శాతం మంది అవగాహన ఉందని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు. యాప్ వాడటం రాదని 37.42 శాతం మంది వెల్లడించగా.. 32.13 శాతం మంది యాప్ వాడితే ఎక్కడ డబ్బులు పోతాయన్న భయంతో వినియోగించడం లేదని చెప్పారు. 30.45 శాతం మంది తమకు స్మార్ట్‌ఫోన్ లేదని స్పష్టం చేశారు.
వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. తొలుత 161 సేవలు ప్రవేశపెట్టామని.. వీటిని ఇప్పుడు 700 వరకు పెంచామని ప్రతి వేదికపై సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని ఈ నివేదిక బయటపెట్టింది. ఇది కాస్తా అట్టర్ ఫ్లాప్ కావడంతో సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏకంగా 21 శాఖలకు చెందిన 1.20 లక్షల మంది ఉద్యోగులతో ప్రచారం చేపట్టారు. అయినా ప్రయోజనం కనిపించే అవకాశం లేదని తేలిపోవడంతో.. దీనంతటికీ వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బందే కారణమని చూపించేందుకు ప్రభుత్వం సిద్ధమవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


