సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా.. తన గురుగ్రామ్ ప్లాంట్ నుంచి 10 మిలియన్ల (కోటి) ద్విచక్ర వాహనాన్ని విడుదల చేసి.. ఉత్పత్తిలో అరుదైన మైలురాయిని చేరుకుంది. కంపెనీ దేశంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయాన్ని వెల్లడించింది.
కంపెనీ మొదటి 5 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయడానికి.. 14 సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత ఆరేళ్లలో మరో 5 మిలియన్ వాహనాలను ఉత్పత్తి చేసింది. అంటే.. క్రమంగా కంపెనీ వాహనాలను డిమాండ్ పెరుగుతూ వచ్చింది. దీంతో కంపెనీ తన ఉత్పత్తిని కూడా పెంచాల్సి వచ్చింది.
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అమ్మకాలు పెరగడానికి యాక్సెస్ 125 వెన్నెముకగా నిలిచింది. ఆ తరువాత జాబితాలో బర్గ్‌మాన్ స్ట్రీట్, అవెనిస్ వంటి ఇతర స్కూటర్లు, అలాగే జిక్సర్ 150/250 సిరీస్, అడ్వెంచర్ ఓరియెంటెడ్ V-స్ట్రోమ్ SX కూడా సంస్థ పురోగతికి చాలా ఉపయోగపడ్డాయి.
సుజుకి మోటార్‌సైకిల్ ప్రస్తుతం 1,200 కంటే ఎక్కువ అమ్మకాలు & సేవా టచ్‌పాయింట్‌లను కలిగి ఉన్నారు. అంతే కాకుండా 60 కంటే ఎక్కువ దేశాలకు.. భారతదేశంలో నిర్మించిన మోడళ్లను ఎగుమతి చేస్తోంది. భవిష్యత్ డిమాండ్‌కు సిద్ధం కావడానికి, కంపెనీ హర్యానాలోని ఖార్ఖోడాలో రెండవ ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని భారీగా పెంచుతుందని సమాచారం.


