లాహోర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌లకు గాను ఇచ్చిన మ్యాచ్ ఫీజుపై పాకిస్తాన్ హాకీ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ తొలి దశ మ్యాచ్‌ల్లో భాగంగా... ఈ నెల అర్జెంటీనాలో పాకిస్తాన్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. వాటికి సంబంధించిన రోజూవారీ భత్యాలు తాజాగా అందించారు.
అయితే ముందు చెప్పిన దాంట్లో మూడో వంతు ఫీజులు కూడా ఇవ్వకపోవడంపై జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరగనున్న ఎఫ్‌ఐహెచ్ ప్రొ లీగ్ మ్యాచ్‌ల్లో ఆడబోమని వెల్లడించారు.
ఇది చాలా అవమానకరం
‘అర్జెంటీనాలో జరిగిన ప్రొ లీగ్ సందర్భంగా రోజుకు 30,000 రూపాయలు ఇస్తామని ముందు చెప్పారు. కానీ దానికి బదులు రోజుకు 11,000 చొప్పున ఇచ్చారు. ఇది చాలా అవమానకరం. అంటే డాలర్ల రూపంలో చూసుకుంటే రోజుకు 110 డాలర్లు ఇస్తామని చెప్పి 40 డాలర్లు కూడా ఇవ్వలేదు.
చెప్పిన దానికి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంది’ అని ఒక ఆటగాడు పేర్కొన్నాడు. ‘ఆటగాళ్లకు 30,000 రూపాయలు రోజూవారీ భత్యం చెల్లించాలనేది పాకిస్తాన్ హాకీ సమాఖ్య విధానం.
మేము ఏమీ చేయలేం
కానీ ప్రొ లీగ్ రెండు దశలకు జట్టు మొత్తం ఖర్చులను పాకిస్తాన్ స్పోర్ట్స్ బోర్డు నిధులు సమకూరుస్తున్నందున ఈ విషయంలో మేము ఏమీ చేయలేం’ అని ఎఫ్‌ఐహెచ్ కార్యదర్శి రాణా ముజాహిద్ పేర్కొన్నాడు. కాగా అర్జెంటీనా అంచె పోటీల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ జట్టు పరాజయం పాలైంది.


