లేని ఉద్యోగుల పేరిట బ్యాంకు ఖాతాలు సృష్టించి
ఖజానా లూటీ... ఉద్యోగుల ‘ఆధార్’ వివరాలు
ఆర్థిక శాఖ అడగడంతో బండారం బట్టబయలు
రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి 6 వేల వరకు ‘ఉద్యోగాల’ గుర్తింపు
ఎక్కువగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పేరిట మాయాజాలం... ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న దందా
5 వేల మంది పేర్లు పేరోల్స్ నుంచి తొలగించిన ఆర్థిక శాఖ
కొన్ని ప్రభుత్వ ఉద్యోగాల పేరిటా వేతనాలు స్వాహా
క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే యోచనలో ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం ఉంటుంది.. ఉద్యోగం చేస్తున్నట్టుగా ఓ వ్యక్తి పేరు ఉంటుంది..ఆ పేరుతో బ్యాంకు ఖాతా వివరాలు ఉంటాయి.. జీతం తీసుకునేందుకు వీలుగా విధులు నిర్వహించినట్టు రికార్డులు తయారవుతాయి..ఆ మేరకు అతనికి జీతం ఇవ్వాలంటూ ప్రతిపాదనలు తయారవుతాయి.. వాటికి ఆమోదం లభిస్తుంది.. వెంటనే ప్రతి నెలా ఠంచన్‌గా జీతం కూడా బ్యాంకు ఖాతాలో పడిపోతుంది.. కానీ విషయం ఏమిటంటే అక్కడ నిజంగా ఉద్యోగి ఉండడు. విధులు నిర్వర్తించడమూ ఉండదు. ఇదేదో ప్రైవేటు కంపెనీలో జరుగుతున్నది కాదు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో జరుగుతోంది. ఖజానాకు తూట్లు పొడుస్తూ..ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తి ప్రతినెలా జీతం తీసుకుంటున్నాడు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు.. వేల మంది పేరిట.. ఒక నెల, రెండు నెలలు కాదు.. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజా ధనాన్ని లూటీ చేస్తున్నట్లు ఇటీవల ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ విధంగా ఇప్పటివరకు ఏడాదికి రూ.600 కోట్లు దుర్వినియోగం అయినట్లు తేలి్చంది. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేస్తోన్న ఉద్యోగులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాలనే నిబంధన విధించడంతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు, ఆ కార్డుతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లు, ఉద్యోగుల ఇంటి చిరునామాలు తదితర వివరాలు సమర్పించాలని ఆర్థిక శాఖ ఈ ఏడాది అక్టోబర్‌లో అన్ని ప్రభుత్వ విభాగాలను ఆదేశించింది. మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. కొందరు ఉద్యోగులు తమ వివరాలను ఇవ్వకపోవడంతో వారి వేతనాలను నిలిపివేస్తామని ఆర్థిక శాఖ హెచ్చరించింది. ఆ తర్వాత కొన్ని శాఖల్లోని చాలా తక్కువ మంది ఉద్యోగులు మినహా అందరి వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. ఈ వివరాలను, పేరోల్స్‌తో పోల్చి పరిశీలించిన ఆర్థిక శాఖ అధికారులు..పేరోల్స్‌లో ఉన్న వేల మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు సరిపోలక పోవడం, అనుమానాస్పదంగా ఉండడంతో సదరు ఉద్యోగుల వివరాలను ఆయా ప్రభుత్వ శాఖలకు పంపారు.
అనుమానాస్పద ఉద్యోగుల ఉనికిని నిర్ధారించాలంటూ అన్ని ప్రభుత్వ శాఖలకు లేఖ రాశారు. అప్పుడు తమ పేరోల్స్‌లో ఉన్న ఫలానా వ్యక్తి సరీ్వసులో లేడని, ఆ ఉద్యోగి పేరును పేరోల్స్ నుంచి తొలగించాలంటూ సదరు శాఖల నుంచి సమాచారం వచి్చంది. అలా వచ్చిన ఉద్యోగుల సంఖ్య ఇప్పటికే 6 వేలు దాటిందని, అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత 5 వేల మందికి పైగా పేర్లను ఇప్పటికే పేరోల్స్ నుంచి తొలగించామని ఆర్థికశాఖ వర్గాలు వెల్లడించాయి. ఇందులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని ఆ వర్గాలు చెపుతున్నాయి. రెవెన్యూ శాఖ మినహా దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలు, ఇతర విభాగాల్లో లేని ఉద్యోగులు జీతాలు తీసుకుంటున్నట్టుగా తేలిందని అంటున్నాయి.
నెలకు రూ.50 కోట్ల పైమాటే
ప్రస్తుతానికి తేలిన లెక్కల ప్రకారం ఈ విధంగా ప్రతి నెలా వేతనాల రూపంలో దుర్వినియోగం అవుతున్న మొత్తం రూ.50 కోట్ల కంటే ఎక్కువే ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఇలా ఏడాదికి రూ.600 కోట్ల వరకు పక్కదారి పడుతోందని, ఇప్పుడు విషయం వెలుగు చూడటంతో ప్రభుత్వ ఖజానాకు ఆ మేరకు మిగులుతుందని అంటున్నారు. పూర్తిస్థాయిలో లెక్కలు తేలాల్సి ఉందని, అన్ని వివరాలు సేకరించిన తర్వాత ప్రభుత్వానికి నివేదించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యోగుల ఆధార్ వివరాలను సేకరించాలనే ప్రయత్నం జరిగినా, కొందరి ఒత్తిడి వల్ల జరగలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఈ ప్రక్రియ చేపట్టడంతో వందల కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వచి్చందని ఆ శాఖ అధికారులంటున్నారు.
ఏజెన్సీల మాయాజాలం
గత ఏడెనిమిదేళ్లుగా జరుగుతున్న ఈ దందా వెనుక ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీలు, కొందరు అధికారుల ప్రమేయం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చాయి. ప్రభుత్వ ఖజానా నుంచి ఏళ్ల తరబడి అక్రమంగా తీసుకుంటున్న వేల కోట్ల రూపాయలను ఎలా రికవరీ చేయాలనే దానిపై దృష్టి సారించాయి. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. లేని ఉద్యోగుల పేరిట వెళ్లిన వేతనాలు ఏయే బ్యాంకు ఖాతాలకు వెళ్లాయి.. ఎవరు డ్రా చేసుకున్నారనే అంశాలను తేలుస్తామని, ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై ప్రభుత్వ పెద్దలతో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు.
రెగ్యులర్ ఉద్యోగుల పేరిటా బురిడీ
మరింత విస్తుగొలిపే అంశమేమిటంటే.. కేవలం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల పేరిటే కాదు..రెగ్యులర్ ఉద్యోగాల పేరిట కూడా ఖజానాకు కన్నం వేస్తున్నారు. ఎవరూ గుర్తించలేని ఇతర శాఖలకు సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్నట్టుగా జీతాలు క్లెయిమ్ చేస్తున్నారని వెల్లడైంది. హోంగార్డులుగా, పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్నట్టుగా పేర్కొంటూ జీతాలు క్లెయిమ్ చేస్తుండగా, కొందరు ఉద్యోగుల భార్యల పేరిట ఉన్న అకౌంట్లలో జీతం జమ అవుతోందని ఆర్థిక శాఖ పరిశీలనలో తేలింది. అయితే ఈ సంఖ్య చాలా తక్కువేనని, మొత్తం రెగ్యులర్ ఉద్యోగుల్లో కేవలం డబుల్ డిజిట్ కూడా వీరి సంఖ్య దాటలేదని, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులు మాత్రం ఏకంగా 10 శాతం కంటే ఎక్కువ ఉన్నారని తేలిందని ఆర్థిక శాఖ వర్గాల సమాచారం.


