విద్యావంతులు.. ఉన్నత ఉద్యోగాలు వదిలి.. | Graduates contesting in Telangana Sarpanch elections | Sakshi
Sakshi News home page

విద్యావంతులు.. ఉన్నత ఉద్యోగాలు వదిలి..

Dec 2 2025 2:08 AM | Updated on Dec 2 2025 2:08 AM

Graduates contesting in Telangana Sarpanch elections

గ్రామాభివృద్ధి కోసమే పోటీ చేస్తున్నామంటున్న గ్రాడ్యుయేట్స్‌

డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవారు..సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈసారి పంచాయతీ బరిలో నిల్చున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు వారు చెబుతున్నారు.  

కథలాపూర్‌/రామగుండం/పుల్‌కల్‌: జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన బాసారపు నాగరాణి 2021లో బీటెక్‌ పూ­ర్తి­చేశారు. సర్పంచ్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. 

ఇదే మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన గడ్డం అనూష 2020లో బీటెక్‌ పూర్తి చేశారు. సర్పంచ్‌ స్థానం జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఆమె బరిలో ఉన్నారు.  
 పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్‌ అంతర్గాం గ్రామానికి చెందిన అంగోతు రవికుమార్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలి సర్పంచ్‌ స్థానం కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ ఎన్‌ఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పదేళ్లుగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. తన స్వగ్రామాన్ని డిజిటల్‌ గ్రామంగా, వందశాతం అక్షరాస్యులుగా, మౌలిక సదుపాయాల కల్పనలో ఆధునికంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. 

సంగారెడ్డి జిల్లా పుల్‌కల్‌ మండల పరిధిలోని ముద్దాయిపేట పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఎంబీఏ చదివిన కొల్లూరు జ్యోష్న సర్పంచ్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.     

జగ్గాసాగర్‌ సర్పంచ్‌ పదవికి వేలం
రూ.28.60 లక్షలకు పాడిన ఓ వ్యక్తి 
మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం జగ్గా­సా­గ­ర్‌లో సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్‌ పదవికి వేలం నిర్వహించినట్టు తెలిసింది. ఈ గ్రామంలో మొదటివిడత ఎన్నిక జరగాల్సి ఉండగా.. సర్పంచ్‌ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఓ వ్యక్తి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని వీడీసీ సభ్యులకు తెలిపారు. దీంతో బహిరంగ వేలం వేస్తే మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముందని భావించి వారు వేలం నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.28.60 లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చాడు. అతడినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వీడీసీ సభ్యులు నిర్ణయించి.. మిగతా వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని చెప్పినట్టు సమాచారం.  

ఉద్యోగికి ఓటు భయం ! 
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్ని­కల్లో వందల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో ఎవరు ఏ అభ్యర్థికి లేదా ఏ పారీ్టకి ఓటు వేశారో తెలిసే అవకాశాలు ఉండవు. అయితే ఆయా పంచాయతీల పరిధిలో తక్కు­వ సంఖ్యలో పోస్టల్‌ ఓట్లు ఉంటాయి. కొన్నిచోట్ల ఒక్క­రో, ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు/ఉద్యోగు­లు ఉంటారు. వారు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు.. దరఖాస్తు చేసుకొని బ్యాలెట్‌ పత్రంలో తమకు నచి్చన వ్యక్తికి పెన్నుతో టిక్‌ చేస్తారు. అయితే కౌంటింగ్‌ సమయంలో ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు.

ఆ ఊళ్లో ఒకే ఉద్యోగి/ఉపాధ్యాయు­డు ఉండి, ఆయన ఎవరో ఒకరికి ఓటు వేసినప్పుడు తన ఓటు ఎవరికి వేశారో బహిర్గతమవుతుంది. తద్వారా తమకు ఓటు వేయలేదని ఇతరులు ఆ ఉద్యోగిపై కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. గ­తం­లో పలుచోట్ల ఓటు రహస్యం బహిర్గతమై వివాదాలు ఎదురయ్యాయని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’­తో తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్‌ సమయంలో పోస్టల్‌ బ్యాలెట్‌లను సాధారణ బ్యాలెట్‌ పత్రా­ల్లో కలిపితే ఏ సమస్యా ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారులు తక్షణమే దీని­పై చర్యలు తీసుకొని పోస్టల్‌ బ్యాలెట్‌ వల్ల ఎదుర­య్యే ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. 

నామినేషన్లు తీసుకున్నాక.. రిజర్వేషన్‌ మారిందన్నారు ! 
ధారూరు: వికారాబాద్‌ జిల్లా ధారూరు పంచాయతీలోని 11వ వార్డును జనరల్‌ (అన్‌రిజర్వ్‌డ్‌)కు కేటాయిస్తూ కలెక్టర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ వార్డుకు జనరల్‌ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్‌ఎస్‌ మద్దతుదారుడు మైతాబ్‌కు ఫోన్‌ చేసిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది.. ‘మీ వార్డును జనరల్‌ మహిళకు కేటాయించారు, మీ భార్యను తీసుకొచ్చి మళ్లీ నామినేషన్‌ వేయమని చెప్పడంతో కంగుతిన్నారు. అయితే, తమకు ఇచి్చన రిజర్వేషన్‌ ప్రకారమే నామినేషన్లు వేశామని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ నర్సింలును వివరణ కోరగా తాను జారీచేసిన రిజర్వేషన్‌ జాబితానే నామినేషన్‌ అధికారికి ఇచ్చామని తెలిపారు.

రూపాయి నాణేలతో నామినేషన్‌ డిపాజిట్‌ 
మిరుదొడ్డి: సిద్ది­పేట జిల్లా మిరు­దొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ల లావణ్య సర్పంచ్‌ పదవికి సోమవారం నామినేషన్‌ దాఖలు చేశా­రు. అయితే నామినేషన్‌ డిపాజిట్‌ కింద తాను దాచు­కు­న్న రూపాయి నాణేలను అందజేశారు.

మా తండాకు అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం
ధర్పల్లి(నిజామాబాద్‌ రూరల్‌): తమ తండా వారికి సర్పంచ్‌గా అవకాశం ఇవ్వ­కపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని నిజా­మాబాద్‌ జిల్లా ధర్పల్లి మండలం చెరువు తండావాసులు పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీఓ లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోబిన్‌సాబ్‌ తండా, చెరు­వు తండాలను కలిసి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారని, ఒకసారి మోబిన్‌సాబ్‌ తండాకు మరోసారి చెరువు తండాకు సర్పంచ్‌ అవకాశం ఇవ్వాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.

ఒప్పందం ప్రకారం మొదటిసారి మోబిన్‌సాబ్‌ తండాకు చెందిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఈసారి తమ తండాకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా, మోబిన్‌సాబ్‌ తండావాసులు ఒప్పందాన్ని ఉల్లంఘించి సర్పంచ్‌ అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్నారన్నారు. ఒప్పందం ప్రకారం తమ తండాకు చెందిన వ్యక్తికే సర్పంచ్‌గా అవకాశం ఇవ్వాలని లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

ఏం చేయాలో చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో సర్పంచ్‌గా పోటీచేసే అభ్యర్థులు చేయాల్సిన పనుల జాబితాతో ఆ గ్రామ యువత ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గ్రామానికి అవసరమైన రోడ్లు, ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెంపు, యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్స్‌ నిర్వహణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఫ్లెక్సీ ద్వారా స్పష్టం చేశారు.  

గెలిపిస్తే శుభకార్యాలకు టెంట్‌హౌస్‌ సామగ్రి ఉచితం
ఇల్లంతకుంట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామానికి చెందిన భారతమ్మ కుటుంబానికి టెంట్‌హౌస్‌ ఉంది. సర్పంచ్‌గా పోటీ చేస్తున్న ఆమె.. తనను గెలిపిస్తే ఐదేళ్లపాటు గ్రామస్తులు చేసుకునే అన్ని శుభకార్యాలకు టెంట్‌హౌస్‌ సామగ్రిని ఉచితంగా సరఫరా చేస్తానని ప్రచారం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement