సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం 5 గంటలకు గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. రెండోదశ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు (ఆదివారం)..మొత్తం 4,332 సర్పంచ్ పదవులకు గాను 2,975, 38,342 వార్డులకు గాను 3,608 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) వర్గాల సమాచారం. అయితే సోమవారం సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యే దానిపై మాత్రం రాత్రి పొద్దుపోయే వరకు ఎస్‌ఈసీకి పూర్తి సమాచారం అందలేదు. దీంతో మంగళవారమే రెండురోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
‘పోస్టల్ బ్యాలెట్’ వీరికే..
పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, సైన్యం, రక్షణ దళాలు, ప్రభుత్వ ఉద్యోగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ‘పోస్టల్ బ్యాలెట్’ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫారం–12 లేదా ఫారం–12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి పోస్టల్ చార్జీలు ఉండవు. కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటల లోపు రిటరి్నంగ్ అధికారికి ఇవి చేరాలి.


