రాష్ట్రాన్ని నిలిపేందుకు కృషి ∙మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
2034 నాటికి ట్రిలియన్ డాలర్లు,2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలు
పరిశ్రమలు, సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం...
2023లో ఊరు గెలిచాం.. ఇప్పుడు రచ్చ గెలవాలన్న ముఖ్యమంత్రి
ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారినిసర్పంచ్‌లుగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి
పలు అభివృద్ధి పనులకు, కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతలకు శ్రీకారం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలిచేందుకు కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ల ఎకానమీ, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. పరిశ్రమలు,సేవ, వ్యవసాయ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామ ని చెప్పారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సంబంధించి ప్రజా పాలన – విజయోత్సవాల్లో భాగంగా తొలిరోజు సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు
‘ఒకవైపు కేసీఆర్ చేసిన రూ.8 లక్షల కోట్ల అప్పు చెల్లిస్తూనే, సంక్షోభంలో ఉన్న రాష్టాన్ని గాడిన పెట్టాం. సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తున్నాం. పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది.. మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం రావాలని 2009లో ఒక పెద్దాయన ఎంపీగా వలస వచ్చారు. తెలంగాణ వస్తే తమ కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా, పాలమూరు ప్రాజెక్టులు పూర్తవుతాయని.. తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆయనకు అవకాశం కలి్పంచారు. కానీ తెలంగాణకు మొట్టమొదటి సీఎం అయిన ఆ పెద్ద మనిషి మన కష్టాలు తీర్చలేదు. సాగునీటి కోసం రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా సంగబండలో బండ పగులకొట్టడానికి రూ.12 కోట్లు ఇవ్వలేదు. మనకు సాగు, తాగునీరు కోసం ఆయన ఏనాడూ తాపత్రయ పడలేదు..’ అని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం వ్యాఖ్యానించారు.
దండుకట్టి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి..
‘ప్రస్తుతం పాలమూరు ప్రజలు వారి బిడ్డను ఆశీర్వదించి సీఎం చేయడంతో మంత్రుల సహకారంతో కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల్లో భూములు కోల్పోయిన వారికి సహాయ, పునరావాసాన్ని (ఆర్‌అండ్‌ఆర్) నూటికి నూరు శాతం మంజూరు చేసి అమలు చేస్తాం. నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 69 జీఓ కోసం గొంతెత్తి మాట్లాడినా అప్పట్లో మన బాధను ఎవరూ వినలేదు. ఇప్పడు కూడా కుట్రలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం రాగానే నారాయణపేట–కొడంగల్–మక్తల్ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టాలని ప్రయత్నిస్తే ..కేసులు వేసి ఏడాదిన్నరగా నిలిపి వేయించారు.
కానీ మంత్రి శ్రీహరి రైతులతో మాట్లాడి 96 శాతం రైతులను ఒప్పించారు. దేశ చరిత్రలోనే అత్యధికంగా ఎకరాకు రూ.20 లక్షల నష్టపరిహారం మంజూరు చేశాం. ఈ ప్రాజెక్టు కోసం దండుకట్టి. గుంపు కట్టి రెండేళ్లలో పూర్తి చేసుకోవాలి. ఆ ప్రాజెక్టు గడువులోగా పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగించండి. రాతింబ్రవళ్లు పని చేయించుకోండి. ఈ ప్రాంతాన్ని పైరు పంటలతో అభివృద్ధి చేసే బాధ్యత నాది..’ అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
సమస్యలు పరిష్కరించే వారిని స్పర్పంచ్‌లుగా ఎన్నుకోవాలి
‘మీరు ఒక్క ఓటు వేస్తే ఇన్ని సమస్యలు తీరాయి. 2023లో ఊరు గెలిచాం. ఇప్పుడు రచ్చ గెలవాలి. ఇంకా పదేళ్లు ఉంటే అన్నీ చేయొచ్చు. ప్రభుత్వం కాళ్ల కింద కట్టె పెట్టే వారిని సర్పంచ్‌గా చేస్తే ఊరు దెబ్బతింటది. గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించే వారికి ఓట్లు వేయాలి. ఎవరి మాటలో నమ్మి ఓట్లు వేస్తే గోస పడాల్సి వస్తుంది. ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసే వారిని సర్పంచ్‌లుగా గెలిపించుకోవాలి. మన సమస్య తెలిసి పరిష్కరించే వారిని ఎన్నుకోవాలి..’ అని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. సభకు ముందు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి వనపర్తి జిల్లా ఆత్మకూర్, నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. కొడంగల్–నారాయణపేట–మక్తల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు.
మంత్రి వాకిటి భావోద్వేగం
సీఎం బహిరంగ సభలో మంత్రి వాకిటి శ్రీహరి భావోద్వేగానికి గురయ్యారు. సభలో మాట్లాడుతూ.. ‘ఎన్నికల్లో మెజార్టీ తక్కువ వచి్చనా బాధలేదు. నన్ను వ్యక్తిగతంగా దుమ్మెత్తిపోసినా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మక్తల్ నియోజకవర్గానికి రూ.1,000 కోట్ల నిధులు ఇచ్చి అభివృద్ధికి అడుగులు వేయించిన సీఎం రేవంత్‌రెడ్డి వచి్చన సమయంలో పెద్ద మనసుతో ప్రజలు వచ్చి పెద్ద ఎత్తున స్వాగతం పలకాల్సి ఉండే. కానీ మీ ప్రవర్తనతో మనసు గాయపడింది..’ అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో ఎప్పుడైనా రెండేళ్లలో రూ.1,000 కోట్లు వచ్చాయా? ఒక్కసారి ఆలోచించండి. ఈ తప్పు మరోసారి చేయకండి..’ అని కోరారు.


