సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఓఆర్‌ఆర్ పరిధిలోని 20 పురపాలక సంఘాలు, 7 కార్పొరేషన్ల విలీనానికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ఆమోద ముద్ర వేశారు. విలీన ప్రక్రియకు సంబంధించి సోమవారం ఆర్డినెన్స్ గెజిట్ జారీ కావాల్సి ఉండగా, గవర్నర్ సాంకేతికపరమైన అంశాలను లేవనెత్తడంతో కాస్త ఆలస్యం జరిగిందని సమాచారం. అయితే 10 నెలల కిందట ఉన్న పాలక మండళ్లు చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకొని నవంబర్ 25వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిని విస్తరిస్తూ ఆమోదం తెలిపిన విషయం విదితమే.
విలీనం సందర్భంగా జీహెచ్‌ఎంసీ చట్టానికి, పురపాలక చట్టానికి సవరణలు అవసరమైన నేపథ్యంలో ఈ రెండు ఆర్డినెన్స్‌లను తీసుకొని రావాలని నిర్ణయించి ప్రభుత్వం ఆమోదం తెలి పింది. 20 మునిసిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లను గ్రేటర్‌లో విలీనం చేయడానికి జీహెచ్‌ఎంసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. పదవీ కాలం ముగిసిన పాలక మండళ్లు గతంలో చేసిన తీర్మానాలు ఇప్పుడు చెల్లుబాటు కావన్న అభిప్రాయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వ్యక్తం చేసినట్టు, దానికి ప్రభుత్వం నుంచి సమాచారం వెంటనే పంపించినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ సంతకం చేసి పంపించగా, దీని ఆధారంగా ప్రభుత్వం గెజిట్ జారీ చేయనుంది.


