ప్రజలపై పరోక్షంగా విద్యుత్ చార్జీల బాదుడుకు డిస్కమ్‌ల ప్రతిపాదన
ప్రతి కిలోవాట్‌కూ రూ. 50 ఫిక్స్‌డ్ చార్జీలు పెంచాలని ఈఆర్‌సీకి వినతి
అందుకు ఆమోదం లభిస్తే పేదలపై ఉన్న తక్కువ టారిఫ్‌కు రెక్కలు
ఒక్క యూనిట్ పెరిగినా చార్జీలు రెట్టింపు
ఇకపై వ్యవసాయ విద్యుత్ లెక్కలన్నీ పక్కా
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు పంపిణీ సంస్థలు షాక్ ఇవ్వనున్నాయి. రూ. 5 వేల కోట్ల మేర భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఈ మొత్తాన్ని పరోక్ష మార్గాల నుంచే రాబట్టాలని నిర్ణయించాయి. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నేరుగా విద్యుత్ టారిఫ్‌ను పెంచబోమని డిస్కమ్ సీఎండీలు తెలిపారు. 2026–27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ, అవసర నివేదిక (ఏఆర్‌ఆర్)ను దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి సమర్పించాయి. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి టారిఫ్ ఆర్డర్‌ను ప్రకటించనుంది. కొత్త టారిఫ్ ఆర్డర్ వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. డిస్కమ్‌లు ఏఆర్‌ఆర్‌లను సమర్పించినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఆ వివరాల వెల్లడికి నిరాకరించాయి. అయితే విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం డిస్కమ్‌ల ఏఆర్‌ఆర్‌లు ఈ విధంగా ఉన్నాయి.
ఆర్థిక లోటు రూ. 20 వేల కోట్లపైనే..: గత ఏడాది కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు విద్యుత్ చార్జీల రూపంలో రూ. 45 వేల కోట్ల ఆదాయం వచి్చంది. విద్యుత్ కొనుగోళ్లు, నిర్వహణ, ఇతర ఖర్చులు రూ. 65 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఆదాయానికి, వ్యయానికి మధ్య వ్యత్యాసం రూ. 20 వేల కోట్ల వరకు ఉంది. బొగ్గు ధరలు తగ్గడం వల్ల గత ఏడాదిలో విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గాయని డిస్కమ్‌లు పేర్కొన్నాయి. అయితే డిమాండ్‌కు తగ్గట్లు వచ్చే ఏడాది ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల సామర్థ్యం పెంపు, భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు నిధులు అవసరం ఉంటాయని తెలిపాయి. రుణాలు తీసుకున్నా వాటిపై వడ్డీల భారం పెరుగుతుందని పేర్కొన్నాయి.
ప్రస్తుత లోటు రూ. 20 వేల కోట్లకు మరో రూ. 6 వేల కోట్ల మేర వనరుల అవసరం ఉంటుందని అంచనా వేశాయి. మొత్తంగా రూ. 26 వేల కోట్ల ప్రభుత్వ సబ్సిడీపై డిస్కమ్‌లు నమ్మకం పెట్టుకున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్, పేదలకు గృహజ్యోతి పథకం కింద ఇచ్చే నెలకు 200 యూనిట్ల విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలకు ఇచ్చే ఉచిత విద్యుత్‌కు కలిపి గత ఏడాది ప్రభుత్వం రూ. 12 వేల కోట్ల వరకు సబ్సిడీ ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఈ ఏడాది మరో రూ. 5 వేల కోట్లు పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.
‘ఫిక్స్‌డ్’రూపంలో రాబడి
ప్రతి విద్యుత్ వినియోగదారుడు ప్రతి నెలా కిలోవాట్‌కు రూ. 10 చొప్పున ఫిక్స్‌డ్ చార్జీలు చెల్లిస్తున్నారు. దాదాపు కోటి మంది విద్యుత్ వినియోగదారుల నుంచి వాటిని వసూలు చేస్తున్నారు. కర్ణాటకతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఫిక్స్‌డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ. 100పైనే ఉన్నాయని డిస్కమ్ అధికారులు చెబుతున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని ప్రతి కిలోవాట్‌కూ ఫిక్స్‌డ్ చార్జీలను రూ. 50 వరకు వసూలు చేయాలని ఏఆర్‌ఆర్‌లో ప్రతిపాదిస్తున్నారు. ప్రతి వినియోగదారుడికీ సగటున 3 కిలోవాట్లు లోడ్ ఉంటుంది. దీంతో ఒక్కో వినియోదారుడిపై నెలకు రూ. 150 భారం పడే అవకాశం ఉంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 1,800 వరకు అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది.
గృహజ్యోతి వినియోగదారులు సుమారు 40 లక్షల మంది ఉండగా ఈ కేటగిరీపై పడే అదనపు భారం ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ సబ్సిడీని కూడా పెంచాలన్నది డిస్కమ్‌ల వాదన. మిగిలిన 60 లక్షల మంది మాత్రం ఫిక్స్‌డ్ చార్జీల భారాన్ని మోయాల్సి ఉంటుంది. దీంతోపాటు పరిశ్రమలకు కూడా టారిఫ్‌లో స్వల్ప మార్పులు చేసేందుకు ప్రతిపాదించారు. మొత్తంగా రూ. 5 వేల కోట్ల రెవెన్యూ పెంచుకునేలా డిస్కమ్‌లు ప్రతిపాదనలు పంపాయి.
శ్లాబుల్లో మార్పులు... ఉచిత విద్యుత్‌కు లెక్కలు
ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో కొన్ని మార్పులను డిస్కమ్‌లు సూచిస్తున్నాయి. 1–50 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ. 1.95 టారిఫ్ ఉంది. ఏడాదికి 600 యూనిట్లు దాటితే శ్లాబ్ మార్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు తర్వాత శ్లాబ్ (యూనిట్ రూ. 3)కు వెళ్లే వీలుంది. ఈ కారణంగా 25 లక్షల మందిపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉండగా వాటికి 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. అయితే కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి వాటిని తేవాలనే ఆలోచన ఉంది. దీంతోపాటు ప్రతి ట్రాన్స్‌ఫార్మర్ వద్ద స్మార్ట్‌మీటర్ల ఏర్పాటును డిస్కమ్‌లు ప్రతిపాదిస్తున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో ఉచిత విద్యుత్‌పై నియంత్రణ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ లెక్క కోసమే స్మార్ట్‌మీటర్ల ఏర్పాటని డిస్కమ్ అధికారులు అంటున్నారు.


