‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’డాక్యుమెంట్‌లో సర్కారు పెద్దపీట
3 ట్రిలియన్ ఎకానమీకి ఊతం ఇచ్చేలా కసరత్తు
పారిశ్రామిక ఉత్పత్తిలో వెన్నెముకగా నిలవనున్న ఇండ్రస్టియల్ కారిడార్లు
స్మార్ట్ ఇండ్రస్టియల్ సిటీలు, మెగా పార్కుల ద్వారా భారీగా ఉపాధి
ఎంఎస్‌ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులతో పాటు
మౌలిక వసతులు... డీప్ టెక్, ఫిన్ టెక్, సైబర్ సెక్యూరిటీలో
డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: సంపన్న, సమానత్వ తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ‘తెలంగాణ రైజింగ్ విజన్ 2047’విజన్ డాక్యుమెంట్‌లో పరిశ్రమల శాఖకు పెద్దపీట వేస్తున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో పరిశ్రమలు, ఐటీ రంగాలు కీలక పాత్ర పోషించేలా డాక్యుమెంటుకు రూపకల్పన జరుగుతోంది.
మేధో వలసను అరికట్టడంతో పాటు ఆవిష్కరణలు, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, రక్షణ, అంతరిక్ష సాంకేతికత, ఏఐ, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ స్టార్టప్‌లు, టూరిజం, సూక్ష్మ చిన్న పరిశ్రమలు, ఎగుమతులు తదితరాల ద్వారా లక్ష్యాన్ని సాధించేలా కసరత్తు జరుగుతోంది. ఐటీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అంతర్జాతీయ స్థాయి నిపుణులు, సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ఈ డాక్యుమెంటు రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. త్వరలో ఈ డాక్యుమెంటుకు తుదిరూపు ఇచ్చేందుకు డ్రాఫ్టింగ్ బృందాలు పనిచేస్తున్నాయి.
వెన్నెముకగా మూడు కారిడార్లు
హైదరాబాద్– వరంగల్, హైదరాబాద్– బెంగళూరు, హైదరాబాద్– విజయవాడ పారిశ్రామిక కారిడార్లు, చిన్న తరహా పారిశ్రామిక పట్టణాలు, మెగా పారిశ్రామిక పార్కులు, సెమీ కండక్టర్, గ్రీన్ హైడ్రోజన్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలను బలోపేతం చేసేలా విజన్ డాక్యుమెంటులో పొందుపరుస్తున్నారు. మూడు పారిశ్రామిక కారిడార్లు పారిశ్రామిక ఉత్పత్తికి వెన్నెముకగా నిలిచేందుకు అనువైన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలు, మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు, ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు పెంచేలా కసరత్తు జరుగుతోంది.
డీప్ టెక్, ఫిన్‌టెక్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ డిజిటల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దడం ద్వారా 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్తలో ఐటీ, పారిశ్రామిక రంగాలను భాగస్వామ్యం కల్పించేలా విజన్ డాక్యుమెంట్‌కు రూపకల్పన జరుగుతోంది. తెలంగాణ భవిష్యత్తుకు మూల స్తంభాలను రంగాల వారీగా పేర్కొంటున్నారు.
తెలంగాణ అభివృద్ధిలో మూల స్తంభాలు
ఐటీ రంగం: ఐటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, కృత్రిమ మేథస్సు, క్వాంటం కంప్యూటింగ్, డిజిటల్ పరిపాలన, వీఎల్‌ఎస్‌ఐ, రోబోటిక్స్, హార్డ్‌వేర్, ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ వాతావరణం.
పరిశ్రమలు, తయారీ రంగం: ఔషధ, డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాలు, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, అడ్వాన్సుడ్ మాన్యుఫ్యాక్చరింగ్, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, క్లీన్ మొబిలిటీ, ఎంఎస్‌ఎంఈలు, టెక్స్‌టైల్, ఫ్యాషన్, గనులు, ఖనిజాలు 


