నారాయణపేట: మక్తల్ నియోజకవర్గాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. తమ హయాంలో మక్తల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు రేవంత్. మక్తల్ బహిరంగ సభలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ‘ కొడంగల్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తాం. భూములిచ్చిన రైతులకు రూ 20 లక్షల పరిహారం ఇస్తున్నాం. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయాలి. దండు కట్టండి.. దగ్గరుండి పనిచేయించుకోండి. ఎవరైనా లంచం అడిగితే వీపు విమానం మోత మోగించండి.
ఇరిగేషన్‌తో పాటు విద్యకూ ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రతీ పేదబిడ్డకు చదువు అందేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించాం. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించాం. పక్కనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్న పక్కనే ఉన్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వాలని సోయి 70 ఏళ్లుగా పాలకులు లేకుండా పోయింది.
ఆ పని నేను చేస్తున్నందుకు ఇవాళ నాకు ఎంతో సంతోషంగా ఉంది. రెండేళ్లలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావాలి. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిది. సన్నబియ్యం ఇస్తున్నాం. బీసీల జనాభా 56 శాతం ఉన్న లెక్క తేల్చిన ఘనత మాది. గ్రామపంచాయితీ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలి. అభివృద్ధి ఆకాంక్షించే వారిని సర్పంచ్‌గా గెలిపించాలి’ అని సీఎం రేవంత్ సూచించారు.


