మొత్తం 1,315వృక్షాలుసేఫ్ జోన్‌లో...
చేవెళ్ల హైవే విస్తరణలో ఎన్‌హెచ్‌ఏఐ రోడ్ మ్యాప్
బీజాపూర్ జాతీయ రహదారి పనుల ప్రారంభం
రెండేళ్లు కాదు... ఏడాదిన్నరలోనే సిద్ధం
నాలుగు బృందాలను ఏర్పాటు చేసి పనులు ప్రతి 10 కి.మీ.కు ఓ టీమ్
సాక్షి, హైదరాబాద్: బీజాపూర్ హైవేలో నగర శివారు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణలో భారీ మర్రి వృక్షాలను నరికివేయకుండా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చేసిన పోరాటం, ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉన్న ఇతర జాతుల భారీ వృక్షాలకూ రక్షణ కవచం కలి్పంచింది. 915 మర్రి వృక్షాలను తొలగించకుండా చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వృక్షాల రక్షణకు ఎలాగూ చర్యలు తీసుకోవాల్సిన నేపథ్యంలో, వాటితోపాటు ఆ రోడ్డు మీద ఉన్న 400 ఇతర రకాల భారీ వృక్షాలను కూడా రక్షించేలా రోడ్‌మ్యాప్‌లో చేర్చాలని అటవీశాఖ చేసిన సూచనకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించింది. వెరసి 1,315 భారీ వృక్షాలు దర్జాగా నిలిచే ఉంటాయి.
ఎట్టకేలకు పనులు...: పదేళ్లలో 365 నిండు ప్రాణాలను బలిగొన్న చేవెళ్ల (బీజాపూర్ జాతీయ రహదారిలో భాగం) హైవే విస్తరణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. తరచూ భారీ ప్రమాదాలతో ఈ రోడ్డు రక్తసిక్తమవుతున్న విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం కంకర లోడుతో వేగంగా వచ్చి అదుపు తప్పిన ట్రక్కు ఆర్టీసీ బస్సులోకి చొచ్చుకుపోవటంతో 19 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. సెంట్రల్ మీడియన్ లేకుండా ఇరుగ్గా ఉన్న ఈ రోడ్డును ఇప్పుడు నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఎన్‌జీటీ తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపటం, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారుల బృందం అలైన్‌మెంట్‌లో మార్పులు చేయగా, నాలుగేళ్లుగా నలుగుతున్న కేసు కొలిక్కి వచి్చంది.
విస్తరణ ప్లాన్‌ను మార్చిన ఫలితంగా కేవలం 136 మర్రి వృక్షాలు మాత్రమే రోడ్డు విస్తరణకు అడ్డుగా మారాయి. మిగతా 779 వృక్షాలు ఉన్నవి ఉన్నచోటనే కొనసాగనున్నాయి. వాటి కొమ్మలను మాత్రం తొలగించాల్సి ఉంటుంది. అడ్డుగా ఉన్న 136 వృక్షాలను రోడ్డుకు కాస్త పక్కకు ట్రాన్స్‌లొకేట్ చేయాల్సి ఉంది. కేసు వేసిన వృక్ష ప్రేమికులు దీనికి సానుకూలత వ్యక్తం చేయటంతో ఎన్‌జీటీ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రణాళికను అమలు చేసే అంశంపై లిఖితపూర్వక హామీ కూడా ఇవ్వటంతో రోడ్డు విస్తరణకు అనుమతిస్తూ గత నెల 12న ఎన్‌జీటీ తీర్పు వెలువరించింది. ఆ వెంటనే ఎన్‌హెచ్‌ఏఐ విస్తరణ పనులు ప్రారంభించింది. అప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసిన నిర్మాణ సంస్థకు బాధ్యతలు అప్పగించి ఉండంతో, ఎలాంటి జాప్యం లేకుండా పనులు ఆరంభమయ్యాయి.
ఆ 46 కిలోమీటర్ల దూరం....
అప్పా జంక్షన్ నుంచి 46 కి.మీ. దూరంలోని మన్నెగూడ కూడలి వరకు 60 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరించాల్సి ఉంది. ఇందుకు రెండేళ్ల సమయం పట్టనుంది. కానీ, కోర్టు కేసు మూలంగా జాప్యం అయినందున అంతకంటే ముందే పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో నిర్మాణ సంస్థ ప్రతి 10 కి.మీ.కు ఓ బృందాన్ని ఏర్పాటు చేసి, మొత్తం నాలుగు బృందాలతో పనులు మొదలుపెట్టింది. దీంతో సమాంతరంగా నాలుగు చోట్ల పనులు ఒకేసారి జరుగుతున్నందున ఏడాదిన్నరలోనే పూర్తి అవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.
ఆ చెట్లకూ రక్షణ
మర్రి వృక్షాలను రక్షించేందుకు చేసిన పోరాటం మరో 400 ఇతర వృక్షాల రక్షణకు కారణమైంది. మర్రి వృక్షాల మధ్య మరో 1,600 ఇతర చెట్లు కూడా ఉన్నాయి. వీటిల్లో 400 పెద్ద చెట్లు ఉన్నాయి. ఈ పెద్ద చెట్లను పరిరక్షించాలని ట్రీ ప్రొటెక్షన్ కమిటీ కోరింది. ఎలాగూ మర్రి వృక్షాలను రక్షించేందుకు అలైన్‌మెంట్‌లో మార్పులు చేసిన నేపథ్యంలో, ఈ ఇతర 400 పెద్ద చెట్లను కాపాడనున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ హామీ ఇచి్చంది. వాటిల్లో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న వాటిని కాస్త పక్కకు ట్రాన్స్‌లొకేట్ చేసి తిరిగి నాటనున్నారు. వీటిల్లో వేప, రావి, మేడి లాంటి చెట్లున్నాయి. కాస్త చిన్నగా ఉన్న మిగతా 1,100 చెట్లను కొట్టేస్తారు.ఇప్పటికే అటవీ శాఖ అనుమతించటంతో వాటిని కొట్టేసే పని కూడా మొదలైంది.


